కొత్త జిల్లాలు, కొత్త బంగళా.. కొత్త పంథా!

KTR-copying-from-KCR

తెలంగాణలో జిల్లాల పునర్విభజనను అందరూ స్వాగతించారు. అందులో అశాస్త్రీయతనూ హడావుడిని పున:పరిశీలించుకుని జనగామ,గద్వాల వంటివి పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అన్నిటికన్నా పెద్దదైన హైదరాబాద్‌ను ఎందుకు విభజించలేదన్న ప్రశ్న కూడా అలాగే వుంది. నిబంధనల ప్రకారం ముసాయిదా విడుదల చేయడం తప్ప నిర్ణయం మార్చుకునే ఆలోచనే ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేదని అందరికీ తెలుసు. అందుకే సమాంతరంగా కొత్త జిల్లాల ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నిర్ణయంతోనే పెద్దగా ప్రజల జీవితాలు మారేది వుండదు. పైగా తొలిదశలో గజిబిజి కూడా అనివార్యం. అయినా సరే దసరానాటికి కొలువు తీరాల్సిందే.ఈ జిల్లాల విభజన వల్ల కలిగే ఒక ముఖ్యమైన మార్పు ఏమంటే తెలంగాణలో ఏ నాయకుని చేతిలోనూ నలుగురు ఎంఎల్‌ఎలు వుండే అవకాశం వుండదు. ముఖ్యమంత్రి సర్వశక్తిమంతులైతే స్థానిక నాయకులందరూ శక్తిహీన సామంతులుగా మిగిలిపోవలసిందే. రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాలు కూడా బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఏతావాతా ఈ పాలనా వికేంద్రీకరణ రాజకీయ కేంద్రీకరణను అపరిమితంగా పెంచుతుంది. పైగా సంప్రదాయికమూలాలు చెదిరిపోతాయి గనక పాత పెత్తనాలు కూడా సడలిపోతాయి. అయితే ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ఈ విభజనతో తమ తెలంగాణ అస్తిత్వమే లేకుండా పోతుందని రాయడం మాత్రం మరీ భావుకత అనిపిస్తుంది. ఏదో విధంగా పునర్వ్యవస్థీకరణ జరక్కపోతే రాజకీయ సామాజిక చట్రాలు కూడా మార్పులేకుండా స్థిరోభవ అన్నట్టు వుండిపోతాయి. కనుక కొత్త జిల్లాలకు స్వాగతం పలకవలసిందే. గిరిజన ప్రాంతాలకు స్వయం పాలనా మండళ్లను ఏర్పాటు చేయకపోవడం, తెలంగాణ పోరాటానికి నాంది పలికిన జనగామను జిల్లాగా మార్చకపోవడం నా వరకూ కొరతగానే చెప్పాలి. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో డి.కె.అరుణ ఆమె కుటుంబ ఆధిపత్యాన్ని కాంగ్రెస్‌ నాయకులతో సహా చాలా మంది వ్యతిరేకిస్తుంటారు. కనుక కెసిఆర్‌ ఆమె కోర్కెను ఆందోళనకు స్పందించి గద్వాల జిల్లా ఏర్పాటు చేయడం జరగని పని.
( అన్నట్టు మహబూబ్‌నగర్‌జిల్ల్‌ాలో చారిత్రికంగా మా పూర్వీకుల గ్రామమైన తెలకపల్లి ఇప్పుడు నాగర్‌కర్నూలు జిల్లాలోకి వెళ్తుండడం విశేషం. కర్నూలు గుంటూరు ప్రకాశం జిల్లాలలో ఈ ఇంటిపేరు గల వారు చాలామంది కనిపిస్తుంటారు. నల్గొండలోనూ వున్నారని విన్నాను గాని నాకు తారసపడలేదు.కర్నూలులో పుట్టి , 21వ ఏటి నుంచి ప్రజాశక్తికోసం విజయవాడలో సుదీర్ఘకాలం వుండి హైదరాబాదులోనూ దీర్ఘకాలం పూర్తి చేసుకున్న నాకు ఈ తేడాలు పట్టేవి కావు. ఎవరైనా పులిమినా ఒప్పుకోను)
మళ్లీ కెసిఆర్‌ పాలనకు వస్తే కొత్త జిల్లాలే గాక కొత్త భవనంలోకి కార్యాలయంలోకి ఆయన మారడం కూడా దసరాతోనే జరుగుతుంది. ఈ కొత్త క్యాంపు కార్యాలయంలోనూ నివాసంలోనూ ఆయన ప్రజా జీవితం, పరిపాలన, సామాజిక సమాలోచనలు మరింత విస్త్రతమయ్యేందుకు ఏర్పాట్లు జరిగినట్టు చెబుతున్నారు.ప్రజలను మిత్రులను కలుసుకోవడానికి చర్చలు జరపడానికి ప్రాధాన్యత పెంచుతున్నట్టు సన్నిహితుల కథనం. తెలంగాణ సాధన, ప్రభుత్వాధికారం, ఆపరేషన్‌ ఆకర్ష, ఉప స్థానిక ఎన్నికలు, ఇరిగేషన్‌ రీడిజైన్‌, జిల్లాల రీ డిజైన్‌ అయిపోయింది. కనక మరింత విస్త్రతమైన విషయాలపైకి వీలైతే జాతీయ రాజకీయాలపైకి కూడా కెసిఆర్‌ దృష్టి మరలుస్తారని అంటున్నారు. చూడాలి మరి! నిజంగా ప్రజలకు మరింత మేలు చేసే కొత్త పద్ధతులేమైనా చేపడితే మంచిదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *