కెసిఆర్ బాధ తగ్గించిన చంద్రబాబు

ఓటుకు నోటు కేసులో హడావుడిగా హైకోర్టును ఆశ్రయించడం ద్వారా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తలనొప్పి తగ్గించారు. బాబు సంగతి ఎలా వున్నా వున్న ఫలానా రెండు మాసాల పాటు ఈ వాదోపవాదాల నుంచి ఆయనకు వూరట లభించింది. ఈ లోగా కేసు వేసిన రామకృష్ణారెడ్డి గనక సుప్రీం కోర్టుకు వెళితే మరిన్ని మలుపులు రావచ్చు. ఇంకా ఆలస్యం కావచ్చు. ఎసిబి సుప్రీంలో వేసిన కేసును కూడా వాటితోనే కలిపేసే అవకాశం కూడా వుంటుంది. గత పదిహేను మాసాలలో ఈ కేసు వూపందుకోకపోవడానికి తెలంగాణ ప్రభుత్వ అనాసక్తి లేక అవగాహన కారణమైతే ఇకమీదట అధికారికంగా న్యాయవ్యవస్థ చూసుకుంటుందని చెప్పే అవకాశమేర్పడుతున్నది. అది గనక వాయిదాలు పడుతుంటే ఈ లోగా ప్రభుత్వాల పదవీ కాలం కూడా తగ్గుతుంటుంది. న్యాయస్థానాల వ్యవహరశైలి గమనిస్తే అంతకన్నా భిన్నంగా ఏదో జరుగుతుందని వూహించలేము కూడా. ఇప్పటి వరకూ ఏసిబి గాని తెలంగాణ ప్రభుత్వం గాని ఈ విషయంలో అధికారికంగా స్పందించింది లేదు. ఇకపైన ఎసిబి కోర్టులోనే నివేదికలిస్తే ప్రభుత్వం కోర్టులు చూసుకుంటున్నాయని తప్పుకుంటుంది. ఇకపోతే టిడిపి నేతల ట్రాపింగు, టిఆర్‌ఎస్ ప్రభుత్వ ట్యాపింగు అంటూ మొదలైన వివాదంలో ఒక భాగం ఇప్పటికే వెనక్కుపోయింది. ఇంతటి ఇరకాటంలో చిక్కిన చంద్రబాబు అప్పుడు ఎంత తీవ్రంగా గర్జించివున్నా ఇప్పుడు దాన్ని తిరగదోడి తనపై దాడిని ఆహ్వానించే పొరబాటు మాత్రం చేయరు. కనుక ఏ విధంగా చూసినా ఇది టిసర్కారుకు రాజకీయ ప్రత్యుపకారం లాటిదేనని చెప్పాలి.