సంపూర్తిగా అమెరికా ఉచ్చులోకి

INDO-USPTI4_12_201_2992047f మంగళవారం నాడు ఏకకాలంలో వాషింగ్టన్‌లోనూ న్యూఢిల్లీలోనూ భారత అమెరికాల మధ్య కుదిరిన రక్షణ వాణిజ్య ఒప్పందాలు దేశాన్ని పూర్తిగా దృతరాష్ట్రకౌగిలిలోకి చేర్చాయి. వాషింగ్టన్‌లో రక్షణ మంత్రి మనోహర్‌ పరిక్కర్‌,రక్షణశాఖ కార్యదర్శి అష్టిన్‌ కార్టర్‌ సంతకాలు చేయగా న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌, అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌ కెర్రీ ఒప్పందం చేసుకున్నారు. 2002లో వాజ్‌పేయి హయాంలో మొదలై 2004లో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం వుండగా ఒక రూపం తీసుకుని కూడా దశాబ్దంపైగా ముగింపునకు రాలేదు. వామపక్షాల వ్యతిరేకతే అందుకు కారణమని 2004లో రక్షణ మంత్రి ఎకెఆంటోనీ అన్నారు.కాని వారి మద్దతు ఉపసంహరణ తర్వాత కూడా ఇన్నేళ్లు పట్టిందంటే ఎలాటి విపత్కర అంశాలున్నాయో తెలుస్తుంది. అలాటి ఒప్పందంపై దస్కత్‌ చేయడం నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వ లొంగుబాటుకు పరాకాష్ట. ఈ సందర్భంగా రక్షణ శాఖ కార్యదర్శి అష్టిన్‌ కార్టర్‌ చెప్పిన రెండు మాటలు ఆసక్తికరమే గాక ఆందోళనకరమైనవి. మొదటిది- తమ దేశపు అతి ప్రధాన రక్షణ భాగస్వామిగా భారతదేశం గురించి చెప్పే మాట ఈ ఒప్పందాల తర్వాత నూటికి నూరుశాతం నిజమవుతుందన్నారు. రెండు- తాను రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టాక పరిక్కర్‌తో సమావేశం కావడం ఇది ఆరోసారి అని, ఈ ఏడాది కాలంలోనూ మరే దేశ మంత్రికన్నా ఆయనతోనే ఎక్కువ సమయం గడిపానని చెప్పారు. తన ప్రపంచాధిపత్య వ్యూహంలో భారత దేశాన్ని ఇరికించడం చాలా అవసరమని దానికి బాగా తెలుసు గనకే గత పదహారేళ్లుగా ఆ దిశలోనే పాచికలూ వేస్తూ ఇప్పటికి పూర్తిగా సఫలీకృతమైంది. నాటో సైనిక కూటమిలోని దేశాలతో సమాన స్థాయి భారత దేశానికి కల్పించామని అమెరికా చెబుతున్నదంటే మన పరిస్థితి తెలుస్తుంది.
స్థావరాలను మించిన సదుపాయం
న్యూయార్క్‌లో కుదిరిన ఒప్పందం పేరు లెమోవా(- లాజిస్టిక్‌ ఎక్స్జేంజి మెమోరాండం ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌) ఇరు దేశాల సైనిక సదుపాయాలను పరస్పర అవసరాలకోసం వాడుకోవచ్చన్నది ఈ ఒప్పందం సారాంశం.అంటే మన నౌకా వైమానిక స్థావరాలు, సైనిక దళాల వ్యవస్థ, ఆయుధ సాంకేతిక పరిజ్ఞానం, వినియోగం వంటి వాటిని ఇచ్చిపుచ్చుకోవడం, ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు అమెరికా నౌకలు మన స్థావరాలకు రావచ్చు. వాటి ఇంధన అవసరాలు లేదా మరమ్మత్తులు , మకాంలు లేదా మరేదైనా అక్కడ చేసుకోవచ్చు. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో అపారమైన వ్యూహాత్మక అవసరాలు గల అమెరికా లెమోవా ద్వారా వాటిని నెరవేర్చుకోవచ్చని ఆశిస్తున్నది. ప్రపంచ వ్యాపితంగా 156 దేశాలలో సైనిక స్థావరాలు గల అమెరికా దురాక్రమణ స్వభావం తెలియనిదేమీ కాదు. ు. కనుకనే ఇది మామూలు ఒప్పందమేఅయినట్టు దీనివల్ల ఎలాటి అదనపు ప్రభావం వుండదన్నట్టు చిత్రించేందుకు తంటాలు పడుతున్నారు. గతంలో ఉమ్మడి విన్యాసాలంటే ముందస్తు చర్చలు అనుమతలు అవసరమయ్యేవని దీనివల్ల ఆ అవసరం లేకుండా పోవడమే ముఖ్యమైన మార్పు అని తక్కువ చేసి చూపిస్తున్నారు. ఈ ఒప్పందం వల్ల అమెరికా సైనిక స్థావరాలు ఏర్పర్చుకునే అవకాశం కలగడని సమర్థించుకుంటున్నారు. ఒకసారి వారి ప్రవేశానికి అవకాశం కలిగించిన తర్వాత మన మాట బలహీనమై పోవడం చూస్తున్నదే. వారి సైనిక కేంద్రం పెంటగాన్‌లో భారత దేశ అవసరాలకు ఒక విభాగమే సృష్టిస్తారట! నిజానికి ఈ ఒప్పందం పూర్తిపాఠం ఇంతవరకూ ప్రతిపక్షాలకూ ప్రజలకూ అందుబాటులో వుంచనే లేదు.
లాభాలన్నీ వారికి.. సమస్యలు మనకు
గల్ఫ్‌యుద్ధం సందర్భంగానే ఆ విమానాలు ఇంధనం నింపుకోవడానికి చంద్రశేఖర్‌,వాజపేయి ప్రభుత్వాలు అనుమతించడం చాలా విమర్శలకు దారితీసింది. ఈ ఒప్పందంతో వారు అధికారికంగానే మన స్థావరాలను వాడుకునే అవకాశం కలిగిన తర్వాత వారు విడిగా ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఏముంటుంది? దీనివల్ల మన సాయుధ సంపత్తిని గురించి వారికి ప్రత్యక్ష అవగాహన లభించడమే గాక మన సైనిక దళాలలోనూ చొరబడే వీలు దొరుకుతుంది. ఆఖరుకు నిఘా పరికరాలను సమాచార యంత్రాంగాన్ని కూడా పూర్తిగా తెలుసుకోగలదు. గతంలో మన రక్షణ పరికరాలు అనేకం రష్యా నుంచి వచ్చాయి. ఇప్పటికి వారే వాటి నిర్వహణకు ఆధునీకరణకు సహకరిస్తున్నారు. అవన్నీ ఇప్పుడు అమెరికాకు తెలిసిపోతాయి. ఇంతా చేసి అమెరికా పాకిస్తాన్‌కు కూడా వ్యూహాత్మక నేస్తంగానే గాక ఆ సైనిక వ్యవస్థ పోషకురాలుగానూ వుంది. ఆఫ్ఘనిస్తాన్‌లోనూ ప్రతీఘాత శక్తులకు దాని ప్రోత్సాహముంది. అంతర్జాతీయంగా ఇస్లామోఫోబియా పెంచిన అమెరికా వారిని ఆగర్భ శత్రువులుగా మార్చేసిన నేపథ్యం వుంది. ఇవన్నీ కలిస్తే వారి స్నేహం వల్ల మనకున్నసమస్యలు గాక అదనంగా శత్రువులను కొనితెచ్చుకున్నట్టవవుతుంది.అమెరికాకు అంత దగ్గరైన తర్వాత మన సహజ నేస్తుంగా వున్న రష్యాగాని, పొరుగున వున్న చైనా గాని గతంలో వలె ఇచ్చిపుచ్చుకోవడంకష్టమవుతుంది.ఇరాన్‌తో ఇటీవలే మనం కుదుర్చుకున్న ఒప్పందాల అమలు కూడా క్లిష్టంగా మారుతుంది. దేశ సార్వభౌమతత్వం స్వతంత్ర విధానం వదులుకొని అమెరికా కనుసన్నల్లో మెలిగే దుస్తితి దాపురిస్తుంది. వారి ఆయుధ అమ్మకాల్లో మనమే ప్రధాన కొనుగోలు దార్లుగా వున్నాము. అయినా సరే అనేక ప్రధాన ఆయుధాల పరిజ్ఞానాల అమ్మకంపై నిషేదాలు కొనసాగిస్తూనే వుంది.ఇటీవలనే రక్షణ రంగంలో భారత దేశాన్ని విశ్వసించి విక్రయాలు కొనసాగించడానికి అనుమతించే ఒక చట్టాన్ని వారి సెనేట్‌ ఆమోదించాల్సి వచ్చింది. . కాలం చెల్లిన తన అణు విద్యుత్‌ పరికరాలు మనకు అంటగట్టడం కోసం ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం ఇప్పిస్తానని నమ్మించి వాటిని అంటగట్టింది. 2లక్షల 80వేల కోట్ల రూపాయల విలువైన అణు విద్యుత్‌ రియాక్టర్ల కొనుగోలుకు మనం ఒప్పందం కుదుర్చుకోవడం మూలపడిన వెస్టింగ్టన్‌హౌస్‌కు కొత్త వూపిరి పోసింది. దీని కోసం మన అణు వ్యవస్థల తనిఖీకి కూడా అంగీకరించాము. ఇవన్నీ అయిన తర్వాత ఎన్‌ఎస్‌జిలో ప్రవేశం కల్పించేందుకు తన శక్తియుక్తులు ఉపయోగించకుండా అమెరికా ఇచ్చిన మాట తప్పింది. దీనిపై విమర్శ చేసేబదులు బడా మీడియా చైనా వల్లనే మనకు హౌదా రాలేదని చర్చను దారి తప్పించింది.బాధ్యత దక్షిణచైనా సముద్ర వివాదంలో మనం తలదూర్చడం అమెరికాకు మేలు తప్ప మనకు కలిగే ప్రయోజనం శూన్యం. హిందూ మహాసముద్రంలోనూ చైనా ప్రభావాన్ని తగ్గించాలనే పేరిట అమెరికాకు పీట వేయడం మరీ తప్పు.
చైనాపై ప్రచారం
ఇప్పుడు ఈ ఒప్పందాన్ని చైనా వ్యతిరేకిస్తున్నట్టు అగ్ర తెలుగు పత్రికతో సహా రాశాయి. నిజానికి చైనా స్పందన మరోలా వుంది. ఈ ఒప్పందం వల్ల ఈ ప్రాంతంలో శాంతి సుస్తిరతలు లభిస్తే మంచిదేనని చైనా ప్రభుత్వం అధికారికంగా వ్యాఖ్యానించింది. పాకిస్తాన్‌తో అమెరికాకు(చైనాకు కూడా మరో విధంగా) వున్న స్నేహం రీత్యా భారత పాక్‌ సంబంధాలు మెరుగుపడతాయన్న సూచన ఆ వ్యాఖ్యవెనక వుండొచ్చు. అయితే అంతకంటే ముఖ్యంగా చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ మరింత వివరంగా విశ్లేషిస్తూ భారత దేశం గతంలో అనుసరించిన అలీన విధానానికే కట్టుబడివుంటే ఎక్కువ ప్రయోజనం వుంటుందని వ్యాఖ్యానించింది. దాేనివల్ల ప్రధానదేశాలైన అమెరికా రష్యా చైనా జపాన్‌ అన్ని భారత దేశానికి విలువనిచ్చేవని గుర్తుచేసింది. అందుకు భిన్నంగా ఇప్పుడు అమెరికాకే అంటకాగితే రష్యా చైనాలే గాక పాకిస్తాన్‌ కూడా సందేహాలు పెంచుకునే పరిస్తితి ఏర్పడుతుందని దానివల్ల వాస్తవంగా భారత దేశ భద్రత దెబ్బతింటుందని ఆ పత్రిక పేర్కొంది. చైనాకూ మన దేశానికి వున్న చారిత్రిక విభేదాలను అలా వుంచితే ఈ వ్యాఖ్యల్లో తప్పుపట్టడానికేమీ లేదు. ఉదాహరణకు రక్షణ విషయాలు నిపుణుడు భరత్‌ కర్నాడ్‌ సెక్యూరిటీవైస్‌ అన్న తన వెబ్‌సైట్‌లో ఈ విధమైన అభిప్రాయాలే వెలిబుచ్చారు. అయితే ఆ వెంటనే మరో వ్యాఖ్యాత రష్యానుంచి ఎలాటి ఇబ్బందులు రాబోవని వారిని ఉటంకిస్తూ రాశారు. ఏదో విధంగా ఈ ఒప్పందాన్ని మింగించి భారత దేశాన్ని తన వలయంలో చిక్కించుకోవాలన్న అమెరికా వ్యూహం స్పష్టమే.
లెమోవా ఖరారవుతున్న సమయంలోనే న్యూఢిల్లీలో కెర్రీ సుష్మాల మధ్య జరిగింది వాణిజ్యం వ్యూహాత్మక సంభాషణ(స్ట్రాటెజిక్‌ అండ్‌ కమర్షియల్‌ డైలాగ్‌) ఇవే గాక ఇంకా ఇలాటి చాలా పేర్లతో వ్యవస్థలతో దేశాన్ని తమ చక్రబంధంలోకి తీసుకుంటున్నది అమెరికా. ఇంతకూ ఈ చర్యల సమయంలో సుష్మ పాకిస్తాన్‌ నుంచి టెర్రరిస్టులకు లభిస్తున్న తోడ్పాటును గురించి ప్రస్తావించగా కెర్రీ ఈ విషయంలో ఆ దేశం ఇంకా చాలా చేయవలసి వుందని మాత్రమే చెప్పారు. తాను ఆ దేశంతో సమగ్ర వ్యూహాత్మక సంభాషణ జరిపినప్పుడు ఇవన్నీ ప్రస్తావిస్తానన్నారు. వీసాల మంజూరులో భారత విద్యార్తులు యువత ఎదుర్కొంటున్న సమస్యలు సుష్మ చెప్పగా అవి మీ దేశానికి సంబంధించినవి కాకపోయినా మాట్లాడతామని మాత్రమే అమెరికా ప్రతినిధి అన్నారు. ఇక వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన అమెరికా చేపట్టే కొన్ని చర్యలు భారతీయ పరిశ్రమలకు వాణిజ్యానికి వ్యతిరేకంగా వున్నాయని అంటే దానికీ స్పందన లేదు. ఇప్పుడు కూడా మన ఉత్పత్తులపైన ఉద్యోగులపైన ఆఖరుకు అక్కడకు వెళ్లిన షారుక్‌ఖాన్‌ వంటి ప్రముఖుల పైన కూడా వివక్షాయుతంగా ప్రవర్తించడం మనకు తెలుసు. సోవియట్‌విచ్చిన్నానంతర ప్రపంచంలో ఏకధృవ ఆధిపత్యంకోసం దాని కుటిల వ్యూహాలను అడ్డుకోవడానికి బదులు మన పాలకులు ప్రభుత్వాలు వరుసగా లొంగిపోతూ వచ్చిన ఫలితమే ఈ పరిణామం. మోడీ హయాంలో ఇది మరింత తీవ్రమైంది. పరస్పర అవగాహనగా చెప్పుకుంటున్నా ఆచరణలో ఇది అమెరికా ఆదేశానుసారమే జరగడం, మనం ఆ వుచ్చులో చిక్కుకుపోవడం తథ్యం. అందుకే దేశ హితైషులు దీన్ని వ్యతిరేకించడం అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *