రక్షణ కోసం కోర్టెక్కిన చంద్రబాబు

high-court-of-telanganaఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రశ్నించినప్పుడు స్పందించడానికి ఏముందని ఎదురు ప్రశ్న వేశారు. లాయర్లు చూసుకుంటారని దాటేశారు. అయితే ఈ విషయంలో ఆయన లీగల్‌ రక్షణ పొందకుండా వుండరని అందరికీ తెలుసు. నిన్న నేను పోస్టు చేసిన ఒక ఐటంలో టిఆర్‌ఎస్‌ నాయకుడు కూడా చంద్రబాబు దగ్గర కావలసినన్ని లీగల్‌ వ్యూహాలుంటాయని చేసిన వ్యాఖ్యను ప్రస్తావించాను. నిజంగానే ఆయన ఈ రోజు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు. ఇది రాసే సమయానికి ఇంకా కోర్టు నిర్ణయం వెలువడలేదు. కాని పెద్ద అనుకూలంగా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఎసిబి కోర్టు ఆదేశంలో గాని, ఎసిపి నివేదికలో గాని నిర్దిష్టంగా ఆయన పేరు ప్రస్తావించలేదు. పేరే లేనప్పుడు మీకెందుకు ఆందోళన అని కోర్టు ప్రశ్నించవచ్చు. సమస్య వచ్చినప్పుడు రమ్మని వెనక్కు పంపొచ్చు. ఉదాహరణకు జెరూసలెం మత్తయ్య కేసులో అలాగే చేసి ఆయన పేరు తొలగింపచేసింది. ఇప్పుడు నిర్దిష్టంగా పేరు లేనప్పుడు చంద్రబాబు పిటిషన్‌పై విచారణ లేదా పేరు తొలగింపు ప్రశ్నే వుత్పన్నం కాకపోవచ్చు. పైగా ఈ పిటిషన్‌ దాఖలు చేయడం ద్వారా ఆయన తన ఆందోళనను బయిటపెట్టుకున్నారు. తమాషా ఏమంటే నిన్నటి వరకూ చంద్రబాబుపై కోర్టు ఆదేశాలిచ్చిందని వాదించిన వైసీపీ నేతలు మీడియా సంస్థలూ ఇప్పుడు అందుకు భిన్నంగా వాదించడం. పేరే లేకపోయినా కోర్టుకు వెళ్లారంటూ వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏమైతేనేం ఇప్పుడు కోర్టులోనూ నాటకీయమైన నిర్ణయాలేమీ రావన్నది స్పష్టం.ఈ పరిణామాలన్నీ చూస్తుంటే గత రెండు రోజులుగా మనం చెప్పుకుంటున్న విశ్లేషణల ఔచిత్యం వాస్తవికత అర్థమవుతాయి. తనకు సమస్య వచ్చినప్పుడల్లా కోర్టులను ఆశ్రయించి బయిటపడతారనేది ఆయనపై వున్న విమర్శ. దాన్ని ఇప్పుడు కూడా నిజం చేసుకున్నారు! పరువు కాపాడుకోవాలి తప్ప ప్రతిష్ట కోసం పాకులాడక్కర్లేదన్న వాస్తవిక రాజకీయ వాది ఆయన. చట్టపరంగా కోర్టుకు వెళ్లే ఆయన హక్కును కాదనలేం గాని ప్రజాజీవితంలో వుండేవారు ఏ విచారణకైనా సిద్ధం కావాలి గాని పదే పదే తప్పించాలని కోరడమెందుకు? ఈ విషయంపై టి సర్కారు మౌనమెందుకు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *