కోర్టు చూసుకోవల్సిందే.. మాకేం ఆసక్తిలేదు
ఓటుకు నోటు కేసులో హైకోర్టు తాజా ఉత్తర్వుల తర్వాత ఏదో జరగబోతుందనే వాదనలు కొనసాగుతున్నాయి. నమస్తే తెలంగాణ కూడా ఉత్కంఠ అంటూ కథనాలు ప్రచురించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా విచారించవచ్చని ఎసిబి కోర్టుకు నివేదించినట్టు వార్తలు వచ్చాయి. దీనికి తోడు ఎసిబి చీప్ ఎకెఖాన్ గవర్నర్‌ను కలవడం కూడా ఆసక్తి పెంచింది. వీటిని బట్టి చూస్తే కొంత కదలిక వున్నట్టు కనిపిస్తుంది. అయితే గవర్నర్ ఎందుకు పిలిచారు వేగవంతం చేయడానికా లేక సర్దుబాటు చేయడానికా అనేదానిపై భిన్నమైన అంచనాలు వినిపించాయి. తన పాత్రకు న్యాయం చేశాననిపించుకోవడానికి కూడా ఆయన పిలిపించి వుంటారని అంటున్నారు. ఇక టిఆర్ఎస్ ప్రభుత్వ వర్గాల వాదన మరో విధంగా వుంది. కోర్టు ఆదేశించాక ఏదో ఒకటి చేయాలి కదా.. అని ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి దగ్గరగా వుండే ఒక ప్రజా ప్రతినిధి వ్యాఖ్యానించారు. మరైతే చంద్రబాబు విషయంలోనూ ఏదైనా చేస్తారా అంటే అదంతా కోర్టు ఎసిబి చూసుకుంటాయి.ఎలా బయిటపడాలనే లీగల్ వ్యూహం చంద్రబాబుకు కావలసినంత వుంది అని ఆయన అన్నారు. తమకైతే ఈ కేసు మీద ఇంకా ఆసక్తి లేదనీ, చేయాలనే కోపం అంతకన్నా లేదనీ స్పష్టం చేశారు.తాము హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లాము గనక తామేదో లాలూచీ పడ్డామన్న ఆరోపణ అర్థం లేనిదని టిఆర్ఎస్ నాయకులంటున్నారు. ఇక పోతే చంద్రబాబును విచారించడం జరిగినా అది కెసిఆర్‌ను సిబిఐ లాంఛనంగా విచారించినట్టు గుంభనగా జరిగిపోవచ్చని భావిస్తున్నారు. పైగా ఆయన ఫోన్ సంభాషణలో చాలా జాగ్రత్తగా పదాలు వాడినందువల్ల సంబంధం వున్నట్టు నిరూపించడం కూడా కష్టమేనని కొందరు నిపుణులు చెబుతున్నారు. అతిగా ఆవేశపడే నాయకులూ అతిగా ఆవేశపడే పార్టీలూ చరిత్రలో భంగపాటుకు గురవుతూనే వుంటాయని తెలుగుదేశం నాయకులొకరు సినిమా డైలాగు చెప్పారు. తమ నాయకుడికి అన్ని రకాల వ్యూహాలు సిద్ధంగా వున్నాయని స్పష్టం చేశారు. సెప్టెంబరు 29 నాటికి ఎసిబి కోర్టుకు ఇచ్చే నివేదికలో ఇప్పటి వరకూ జరిగిన ప్రక్రియ పేర్కొని మరింత గడువు కోరుతుందని కూడా అధికార వర్గాలంటున్నాయి. ఇందుకు తగినట్టే చంద్రబాబు నాయుడు కూడా మీడియా వద్ద ఆచితూచి స్పందించారు. అదే సమయంలో న్యాయ వ్యవహారాలు ఒకోసారి అనుకోని మలుపులు తిరుగుతుంటాయి గనక అలసత్వం పనికిరాదనే భావన టిడిపిలో వుంది.ఇలాటి పరిస్థితి తెచ్చిపెట్టిన వారిపై మిగిలినవారిలో చాలా ఆగ్రహం కూడా వుంది.ఈ ఒక్క చర్యతో మొత్తం రాష్ట్రంలో రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తగిలిందని వారు వాపోతున్నారు.
