రాజధాని అంటే నారాయణ ట్యుటోరియల్‌ కాలేజీనా? టిడిపి నేత వ్యాఖ్య

velaga111

ఈ ప్రశ్నవేసింది మీడియా వారో ప్రతిపక్షాలో కాదు. రాజధాని నిర్మాణమవుతున్న జిల్లాకు సంబంధించిన టిడిపి ప్రజా ప్రతినిధి ఒకరి ఆవేదనాత్మక వ్యాఖ్య అది. అక్కడ ఏం జరిగేది మంత్రి నారాయణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తప్ప తమకు తెలిసింది చాలా స్వల్పమని ఆయన కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. ఎప్పటికప్పుడు ఏవో కొత్త కొత్త జీవోలతో ఒప్పందాలతో గజిబిజి వస్తుంటే ప్రజలకు చెప్పడం కూడా కష్టమై పోతుందన్నారు. అనుభవం గల చంద్రబాబు నాయుడు ఇంత అస్తవ్యస్తంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదని ఆయన వాపోయారు.ఈ విషయమై చర్చలలో నాలాటి వాళ్లం లేవనెత్తే సందేహాలు విమర్శలు చాలా వరకూ నిజమేనని అయినా పైకి మాట్లాడలేకపోతున్నామని చెప్పారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం పేరిట ఇంత ఖర్చు ప్రయాస ఎందుకుని నాతో మాట్లాడిన ప్రజా ప్రతినిధి ప్రశ్నించారు. వాస్తవానికి కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన చాలామంది తెలుగుదేశం ఎంఎల్‌ఎలు మంత్రులు కూడా కాస్త అటూ ఇటూ ఇలాగే మాట్లాడుతున్నారు. మరి చంద్రబాబుకు చెప్పొచ్చుకదా అంటే తమ ముందు వివరమైన సమాచారం వుండటం లేదని, విమర్శలు వచ్చాక పార్టీని ప్రభుత్వాన్ని సమర్థించడం అనివార్యమై పోతుందని అంటున్నారు. అధినేత అలసత్వం ఇలాగే కొనసాగితే ఒక బాయిలింగ్‌ పాయింట్‌ వస్తుందని హెచ్చరిస్తున్నారు. రాజధాని నిర్మాణమంటే ట్యుటోరియల్‌ కాలేజీ నడపడమా అని మంత్రి నారాయణను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్య ఆగ్రహానికి అద్దం పట్టింది. అయితే నిజంగా ఇక్కడ నారాయణే సూత్రధారి అయివుంటారా లేక ఇంకా ఘనాపాటీలు వున్నారా అంటే ఆలోచించాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *