పుట్టినప్పుదు బట్ట కట్టలేదు…
పుట్టినప్పుడు బట్టకట్టలేదు.. పోయేటప్పుడు అది వెంటరాదు.. నడుమ బట్టకడితే నగుబాటు నాగరీకం ముదిరితే పొరబాటు.. వేదాంత సారం ఇంతేనయా.. అని నందామయ పాట పాడుతుంది నాయిక జీవన తరంగాలు చిత్రంలో. అక్షరాలా ఆ వేదాంతం నమ్మే జైన సాధువు తరుణ్ సాగర్ కేవలం గోచీ పెట్టుకుని వచ్చి దేశ రాజధాని సమీపంలోనే హర్యానా శాసనసభలో సందేశం దంచేశారు. విద్యారంగ కాషాయకరణ తక్షణావసరమని ప్రవచించిన ఆ రాష్ట్ర బిజెపి మంత్రి రామ్ విలాస్ శర్మ కడ్వే వచన్ (చేదు సూక్తులు) పేరిట ప్రవచనాలు చెప్పేందుకు ఆయనను సభకు పిలిపించారట.ఈ విధంగా ఒక రాజ్యాంగేతర వ్యక్తి శాసనసభలో ప్రసంగం అది కూడా వస్త్ర రహితంగా రావడం దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి. పైగా ఆయనకు గవర్నర్ ముఖ్యమంత్రి తదితరులకన్నా ఎత్తుమీద ఆసనం వేశారు. ఇంత అవకాశమిచ్చిన హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్‌ను ప్రధాని మోడీని ప్రశంసిస్తూ ప్రవచనం వినిపించారు తరుణ్ సాధువు. కాషాయీకరణ కాదు శుధ్ధీకరణ అని కితాబిచ్చారు.గురూజీకో కరియే వందన్ అంటూ ఆ సభలో కాంగ్రెస్ లోక్‌దళ్ సభ్యులు కూడా ఆయనకు భజన చరణాలు ఆలపించడం ఇంకా విశేషం.మహిళలకు సంబంధించిన సమస్యలపై మాట్లాడేందుకు ఆయనను పిలిపించామన్నారు గాని ఆయన రాజకీయాలను మహిళలను కూడా కించపర్చేలా మాట్లాడారు. ధర్మం(హిందీలో మతం) భర్త రాజకీయాలు భార్య అంటూ ధర్మం రాజకీయాన్ని రక్షించాలన్నారు. ఇది రాజ్యాంగ పరంగా తప్పు సామాజికంగానూ మరీ తప్పు. ఎందుకంటే భర్త గీసిన గీతల్లో భార్య నడుచుకున్నట్టు మతం శాసించినట్టు రాజకీయాలు నడవాలట. మతం రాజకీయాలశ్రీను రక్షించాలట. ఈ భావజాలం ఎంత తప్పొ వేరే చెప్పాలా? ఆడపిల్లలు లేని వారు ఎన్నికల్లో పోటీ చేయరాదని సాధువులు అలాటి ఇళ్లలో భిక్ష స్వీకరించరాదని చెప్పిన స్వామి భార్యాభర్తల పోలికతో తన అసలు స్వభావం బయిటపెట్టుకు
న్నారు. సాత్వికతను బోధించే జైన మతం పేరు చెప్పుకుని వచ్చినా ్ సైతాన్ కన్నా పాకిస్తాన్ దారుణమైందన్నట్టు వ్యాఖ్యలు చేసి ద్వేషం బయిటపెట్టుకున్నారు. ఇది ఇంతటితో ఆగదని మరింత మంది మత గురువులను పిలుస్తుంటామని స్పీకర్ ప్రకటించడం కొసమెరుపు.
మత భావాలు చెప్పించడం, అందులోనూ వస్త్రాలు లేని నగమూర్తిని ఆహ్వానించడం, సభా నియమాలు వుల్లంఘించడం పెద్ద తప్పులు కాగా వాటిని వదలిపెట్టి ఈ చర్యను విమర్శించిన వారిపై హర్యానా పోలీసులు కేసులు పెట్టారు. ఆప్ అభిమాని సంగీత దర్శకుడు విశాల్ దద్లానీ ఈ పద్ధతిపైన సందేశం పైన కూడా విమర్శనాత్మక ట్విట్ పెట్టారు. మాకరీ అన్న పదాన్ని కాస్త వ్యంగ్యంగా మాంకరీ(అంటూ సాధు) అని మార్చి పోస్లు చేశారు. దీనిపై దుమారం లేవదీసి కేసు దాఖలు చేశారు. తమ పార్టీకి ఇబ్బంది కలిగించరాదనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే నిజానికి ఆయన అంత అపరాధం చేసింది లేదని హిందూస్థాన్ టైమ్స్ ఒక వ్యాఖ్య ప్రచురించింది. మహిళల వస్త్ర ధారణపై నానా ఆంక్షలు విధించే వారు సాధువులు సన్యాసులను మాత్రం ఎలా వున్నా నెత్తినపెట్టుకోవాలంటారు.హతవిధీ!
