ఓటుకు నోటు వచ్చే 29న తేలేనా?
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసిన ఓటుకు నోటు కేసు ఇంకా సజీవంగా వుందని ఈ రోజు ఎసిబికోర్టు ఆదేశాలను బట్టి అర్థమవుతున్నది. సెప్టెంబరు 29లోగా విచారణ పూర్తిచేసి నివేదిక నివ్వవలసిందిగా వైసీపీ ఎంఎల్‌ఎ రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన కేసులో కోర్టు ఆదేశాలిచ్చింది. ఓటుకు నోటు ఆరోపణపై టిడిపి ఎంఎల్‌ఎ రేవంత్ రెడ్డి అరెస్టు, తర్వాత వివాదం, చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టున్న టేపుల విడుదల ఆ తర్వాత ఆయన తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఆరోపించినా హైదరాబాదులో మకాం దాదాపు తగ్గించేయడం చాలా పరిణామాలు జరిగాయి. కెసిఆర్‌తో చంద్రబాబు రాజీకి రావడానికి ఇదే కారణమన్న ఆరోపణా తీవ్రంగానే వుంది. ఏది ఏమైనా టిఆర్‌ఎస్‌పట్ల చంద్రబాబు వ్యాఖ్యలు విమర్శలు ఆ తర్వాత పూర్తిగా తగ్గిపోయాయి. ఎంఎల్‌ఎలు దాదాపుగా టిఆర్‌ఎస్‌లో చేరిపోగా రేవంత్ రెడ్డి మాత్రమే ఎలాగో నెట్టుకొస్తున్నారు. ఈ క్రమంలో ఓటుకు నోటు కేసు మరుగున పడిపోయినట్టే భావించారు. మధ్యవర్తిగా చెప్పబడిన జెరూసలెం ముత్తయ్య పిటిషన్‌పై హైకోర్టు వ్యాఖ్యలను బట్టి కేసు ఇంకేమీ లేదని అతి ముఖ్యమైన నిందితులొకరు నాతో అన్నారు. ఆ తర్వాత ముత్తయ్య సుప్రీం కోర్టుకు వెళ్లి తనకు ఇద్దరు ముఖ్యమంత్రుల నుంచి ప్రాణహాని వుందని చెప్పడం విచిత్రంగా మారింది. అనేక కారణాల వల్ల ప్రధాన మీడియా సాధనాలు దీనికి ప్రాధాన్యత నివ్వలేదు . ఇప్పుడు కూడా ఎసిబి కోర్టు ఆదేశాల గురించి సాక్షిలో కథనాలు కొన్ని ఇతర కథనాలు భిన్నంగా వున్నాయి.చంద్రబాబును ముద్దాయిగా చేర్చకతప్పని స్థితిని కోర్టు కల్పించిందని సాక్షి కథనంగా వుంది. అయితే వార్త ప్రసారమైనప్పుడు విన్నా , సైట్‌లో చదివినా సమగ్రత లేదు. బహుశా అందుకే కొమ్మినేని శ్రీనివాసరావు సైట్‌లో కూడా సమాచారం వచ్చింది అంటూ అస్పష్టంగా ఇచ్చారు. ఎబిన్ ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం ఆర్కే పిటిషన్‌ఫై కోర్టు స్పందించలేదు. మామూలుగానే 29లోగా విచారణ పూర్తిచేయాలని ఆదేశించింది. ఏమైతేనేం- మరోసారి ఓటుకు నోటు వార్తల్లోకి వచ్చింది. రేవంత్ రెడ్డి తదితరులు ఎలాగైనా టిటిడిపి కార్యాకలాపాలు ముమ్మరం చేయాలని తంటాలు పడుతున్న సమయంలో ఈ తీగ కదలడం పరిస్థితిని మొదటికి తెచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి కూడా ఇది రాజకీయ పరీక్షే. ఎందుకంటే కేసులో గట్టిగా వ్యవహరించకపోతే లోపాయికారిగా రాజీ పడ్డారనే విమర్శ భరించవలసి వుంటుంది.
