గొడ్డు మాంసం గొప్పబలం: బిజెపి ఎంపి ఉదిత్ రాజ్
నైరుతి ఢిల్లీ బిజెపి ఎంపి ఉదిత్ రాజ్ మాటలు ఆ పార్టీని సంఘ పరివార్‌ను పదేపదే ఇరుకున పడేస్తున్నాయి. స్వతహాగా ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఈ దళిత ఎంపి నిస్సంకోచంగా మాట్లాడటమే అందుకు కారణం. హిందూ మతానికి మత మార్పిళ్ల వల్ల గాక తామే సంరక్షకులమంటూ తిరిగే వారి వల్లనే ముప్పు వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దళితులపై దాడులు చేస్తూ వివక్షత చూపిస్తుంటే మతం ఎలా పైకి వస్తుందని ప్రశ్నించారు. చాలా ఆగ్వేయాసియా దేశాల్లోనూ హిందూమత విశ్వాసులు క్షీణించిపోతున్నారని విశ్లేషించారు. ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా దళితులపై దాడులు ఆగడం లేదని సంఖ్యలోనే కాస్త తేడా వుంటుందని కూడా అన్నారు.
ఇక ఇంతకంటే తీవ్రంగా పరరివార్ను ఇబ్బందిలో పడేసింది ఆయన గొడ్డుమాంసంపై చేసిన వ్యాఖ్య. జమైకాకు చెందిన ఉసేనా బాల్ట్ సమృద్దిగా గొడ్డు మాంసం తినడం వల్లనే ఒలింపిక్స్‌లో తొమ్మిది పతకాలు సాధించగల సత్తా వచ్చిందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆమె పేదమ్మాయి గనక కోచ్చెప్పినట్టు రెండు పూటలా గొడ్డు మాంసం తిన్నట్టు తెలిపారు. దీనిపై పరివార్ దుమారం రేపడంతో కాస్త సర్దుకుని సరైన సదుపాయాలు లేకపోతే క్రీడా విజయాలు కష్టమని చెప్పడానికే తాను ప్రయత్నించానని ఆయన వివరణ ట్వీట్ చేశారు.
ఈ లోగా సోషల్‌మీడియాలోనూ కొన్ని పత్రికల వెబ్సైట్లలోనూ వ్యాఖ్యాతలు ఉదిత్ రాజ్ వెనక్కు తగ్గనవసరం లేదని తన జాతి తరపున మాట్లాడే హక్కు వినియోగించుకోవాలనని సూచిస్తున్నారు. సంఘ పరివార్ దళిత వర్గాల జీవిత వాస్తవాలు గమనించకుండా గోరక్షణ గొడ్డుమాంసం పేరిట దాడులు చేయడం తగదని కూడా వారు హితవు చెబుతున్నారు.
