కెసిఆర్ సవాళ్లు,సత్యాలు
నదీజలాలపై మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందం చారిత్రాత్మకమని కెసిఆర్ ప్రభుత్వం తారస్థాయిన ప్రచారం చేస్తున్నది. ముఖ్యమంత్రికి ఘనస్వాగతం, ఎయిర్‌పోర్టులో రాజకీయ ప్రసంగం, సవాళ్లు ,బస్సు యాత్ర సంకల్పం చూస్తే ముందే వచ్చిన ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తున్నది. . నీళ్లు నిధులు నియామకాలనే నినాద త్రయం వినిపిస్తున్నదే. ే వీటికి నిజం, నిగ్రహం, నిష్పాక్షికత, తదితర ని లు మరికొన్ని కలపాల్సి వుంటుంది. దురదృష్టవశాత్తూ నిజాల నిర్ధారణ జరిగేలోగానే ప్రభుత్వం, పాలక పక్షంతీవ్రస్థాయిలో ఎదురుదాడి మొదలుపెట్టాయి. ప్రతిపక్షాలనూ కుట్రదారుల జాబితాలో చేర్చి వారి వల్లనే నీరు రాలేదని ప్రజల బుర్రల్లో ఎక్కించే ప్రయత్నం మొదలైంది. గత 60 ఏళ్లలోనూ కాంగ్రెస్ 43 ఏళ్లు, తెలుగుదేశం 17 ఏళ్లు పాలించాయి.విభజన పర్వానికి ముందు పదేళ్లు కాంగ్రెష్ పాలనే. కనుక ప్రాజెక్టుల నత్తనడకకు ఘోర నిర్ల్యక్ష్యానికి ఈ పార్టీలు బాధ్యత వహించవలసిందే. . టిఆర్‌ఎస్ ప్రభుత్వ పొరబాట్ల విమర్శ చాటున తమ ఘనతల కీర్తన మొదలుపెడితే సాగేది కాదు. అయితే ఈ రెండు వ్యవస్థలలోనూ కెసిఆర్ భాగంగా వున్నవారే. వాటిలో నీటిపారుదల శాఖ నిర్వహించిన వారు కూడా ఆయన మంత్రివర్గంలో వున్నారు. గతంలో జరిగినవాటితో తమకు సంబంధం లేదన్నట్టు మోట్లాడితే కుదరదు. కాంగ్రెస్‌వారే సర్వ నాశనం చేసిందనే వారు 2008 వరకూ ఆ ప్రభుత్వంలో వుండటమే గాక తర్వాతా లీనం చేసేందుకు సర్వసిద్ధమని చివరలోనూ ప్రకటించారు. ఇప్పుడు రాజకీయావసరాల కోసం విమర్శలు గుప్పిస్తే గతం మారిపోదు.
ప్రాంతీయ వ్యత్యాసాలకు సంబంధించి ఇప్పటికే చాలా చాలా చర్చలు రచ్చలు జరిగిపోయాయి. రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. గత జలసేతుబంధం నిరర్థకం. భౌగోళికంగానూ చారిత్రికంగానూ నీెటిపారుదలకు సంబంధించి రెండు ప్రాంతాల మధ్య తేడాలున్న మాట నిజం.. అది గమనించి ప్రత్యేకంగా ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడానికి నిజాం, బ్రిటిష్ పాలనలు ఒక కారణమైతే తర్వాత పాలకుల నిర్లక్ష్యం మరింత పెద్ద కారణం. . ఆర్థర్ కాటన్ పెంపొందించిన కృష్ణా గోదావరి డెల్టాను అటూ ఇటూ చేసి బతకడం తప్ప మన పాలకులు మౌలికంగా పెంపొందించిన వ్యవస్తలేమీ లేవు. కాటన్ రాయలసీమలో కెసికెనాల్, తెలంగాణలో ఇంచంపల్లి కూడా ప్రారంభించడం ఆయన సముతుల్యతకు ఒక నిదర్శనమంటారు. అయితే మనవడి మరణం వల్ల ఇంచంపల్లి పూర్తిగాకుండనే వెళ్లిపోయారు. తర్వాత కాలంలో నాగార్జున సాగర్;శ్రీశైలం వచ్చాయి. సాగర్, శ్రీశైలం కుడి ఎడమ కాల్వల మధ్య తేడాలపై కెసిఆర్ కన్నా ముందే నల్గొండ కమ్యూనిస్టు నేతలు పోరాడి రైతుల భారం తగ్గించిన మాట కూడా నిజం. మరోవైపున అపారమైన గోదావరి జలరాశులను సద్వినియోగం చేసుకోలేకపోతున్నామనే విమర్శ ఎప్పుడూ వున్నదే. శిశువుకు దక్కని స్తన్యంలా ప్రవహిస్తున్నాయి గోదావరి నీళ్లు అనికవులు పాడారు. ఇచ్చంపల్లి మాత్రమే పరిష్కారమని పుచ్చలపల్లి సుందరయ్య వంటి వారు పదేపదే చెబుతూ వచ్చారు. ముందు మంచినీరు, తర్వాత అన్ని ప్రాంతాలలో ఒక పంటకు నీరు ఇచ్చాకే రెండో పంట మూడో పంట మాట్లాడాలని సుందరయ్య బలంగా వాదించారు. ే వున్నచోటనీళ్లిచ్చి మెప్పించి ఓట్లు తెచ్చుకోవడం సులభం. ఈ క్రమంలో కోస్తా రాయలసీమ తెలంగాణ పాలక నేతలంతా తమ తమ వ్యక్తిగత, ముఠా ప్రయోజనాలు కాపాడుకున్నారు. అంతేగాని ఒక ప్రాంతం నేతలకు తమ ప్రజలపై ప్రేమ, మరో ప్రాంతం నేతలకు తమ వారిపై ప్రేమ లేకపోవడం అంటూ చెప్పడానికి ి లేదు. ప్రజలంటే పాలకవర్గాలకు ఎప్పుడూ చిన్నచూపే.
దిగువ రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్‌లోనే ప్రాజెక్టులు సకాలంలో సక్రమంగా కట్టివుంటే మిగులు నీరుి హక్కుగా మారేది. ఆలస్యం జరుగుతున్నకొద్ది ఎగువ రాష్ట్రాల ఎత్తులు జిత్తులు మారాయి. కెసిఆర్ అసెంబ్లీ పవర్ పాయింట్‌లో చూపించినట్టు ఎక్కడికక్కడ రిజర్వాయర్లు కట్టి నిల్వ చేసుకున్నాయి.ఇది పెద్ద కుట్ర అని ఆయనే చాలాసార్లు అన్నారు. కర్ణాటక మహారాష్ట్ర అవసరాన్ని మించిన రిజర్వాయర్లు కట్టుకుని నీటిని అడ్డుకుంటే ఎపి చేయగలిగిందేమిటి? ఈ జలజగడాలు చాలా సార్లు కోర్టు కేసుల వరకూ వెళ్లాయి. ్ పవర్ పాయింట్‌లో రెండు ప్రధానమైన పరిశీలనలు- పై రాష్ట్రాల రిజర్వాయర్ల గొలుసు, సమైక్య పాలకుల తెలంగాణ ప్రాజెక్టులంటే లేనిపోని ఆటంకాల అభ్యంతరాలు తెచ్చారనే వాదన.నిర్లక్ష్యం వేరు, నిరోదించడం వేరు. తెలంగాణలో మొదట కమ్యూనిస్టులు ,కాంగ్రెస్ ఆ తర్వాత తెలుగుదేశం గణనీయమైన స్థానాలు తెచ్చుకునేవి. కావాలని ప్రభుత్వాలు ప్రాజెక్టులను అడ్డుకుని వుంటే ఆ ఘోరమైన కుట్రలు కూడా అర్థం చేసుకోలేనంత అమాయకులా ప్రజలు? గులాబీ జండాతోనే సూర్యోదయమైందనేట్టయితే వైఎస్ హయాంలో ఉప ఎన్నికల ఘోర పరాజయానికి కెసిఆర్ రాజీనామా తతంగం ఎవరైనా మర్చిపోతారా? మొన్నటి మొదటి ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్‌కు ఇచ్చిన మెజార్టి ఎంత? ఫిరాయింపులతో పెరిగింది ఎంత? వరంగల్, జిహెచ్‌ఎంసి విజయాలే చూసి అంతకు ముందరి అసలైన ఫలితాలు మర్చిపోరాదు కదా! తెలంగాణ సాయుధ పోరాటం మొదలు ప్రాజెక్టుల వరకూ అన్ని విషయాల్లోనూ కమ్యూనిస్టులు ఇతర ప్రజాస్వామిక వాదులు తమ వంతు పాత్ర తాము నిర్వహించారు. సభలోనూ వెలుపలా పోరాడారు.. అంతా గులాబీ మహత్యమేననడం చరిత్రకు పాక్షికత పులమడమే అవుతుంది.
ఇదంతా చెప్పడమెందుకంటే చరిత్ర నిరంతర ప్రక్రియ. పార్టీలు మారొచ్చు, సరిహద్దులే మారొచ్చు. ప్రాధాన్యతలు మార్చుకోవచ్చు. మరింత శ్రద్దగా పూర్తిచేయొచ్చు. కాని పాత ఒప్పందాలు, అవగాహనలు వారసత్వంగా సంక్రమిస్తాయి. బ్రిటిష్ ఇండియా, నిజాం నాటి పత్రాలు కూడా విలువ కలిగి వుంటాయి. . నూతన రాష్ట్రం పాత విధానాలతో విడగొట్టుకోవచ్చు గాని పరంపర ఎలా మారుతుంది? గతంలో ఎపికి ఇప్పుడు తెలంగాణకు పరిధిలో వచ్చిన మార్పు ముఖ్యమంత్రి తేలిగ్గా ఒప్పందాలు పూర్తి చేసుకోవడానికి ఒక కారణం. అప్పుడు ఎపి ఆఖరు రాష్ట్రం. ఇప్పుడు తెలంగాణ ఎగువ రాష్ట్రం.
కొత్తరాష్ట్ర ముఖ్యమంత్రి మాతృరాష్ట్రమైన ఎపి పాలకులే పేచీలు పెట్టారనడం రాజనీతి కాదు. వారే పై రాష్ట్రాలను ప్రేరేపించి అభ్యంతరాలు వచ్చేలా చేశారన్నట్టు వ్యాఖ్యానించడం మహారాష్ట్రులకూ గౌరవం కాదు. . ఈ ఒప్పందాలన్ని గతం మీద మెరుగుదలలు, కొన్ని సర్దుబాట్లు సడలింపులు తప్ప ఎవరి స్వకపోల కల్పితాలూ కాదు. రేపు మరేమైనా సమస్యలు రావని చెప్పలేము గనక ఆచితూచి అడుగేయాలి. అక్కడ పాలకపక్షంగా వున్న బిజెపి తెలంగాణ అద్యక్షులే ఇది మహారాష్ట్రకు లొంగుబాటు అంటున్నారు. భూసేకరణ వ్యయం, నిర్మాణం నిర్వహణ ఖర్చు అనుమతులూ సమస్తం తెలంగాణ భరించి నీటిలో మాత్రం మహారాష్ట్రకు వాటా ఇవ్వాల్సి వుంటుంది. పూర్తి వివరాలు వెల్లడైతే నిపుణుల సమగ్ర వ్యాఖ్యలు అందుబాటులోకి వస్తాయి. ఈ లోగా సవాళ్ల కన్నా సంయమనం ముఖ్యం.
ప్రస్తుత పునరాకృతి అనబడే రీడిజైనింగ్‌లోనూ అనేక లోపాలున్నాయి. ఉంటాయి కూడా. ఒక్క పవర్ పాయింట్ ఇచ్చేసి అదే అంతిమ వాక్యం అంటే కష్టం. కాంగ్రెస్ వారి పవర్ పాయింట్ మన్నూ మశానం అని తీసిపోరేయొచ్చు. కాని వారిఅష్టాదశ మహాపాపాలు నిజమే అనుకున్నా అక్కడ ముందుకు తెచ్చినచాలా విషయాలు జవాబు కోరుతున్నాయి. పునరాకృతికి సంబంధించిన సాంకేతికాంశాలు ఆర్థిక భారాలు, అభియోగాలు పక్కకు పెట్టడానికి లేదు. గతం నుంచి వున్న మెగా కార్పొరేట్ కాంట్రాక్టర్లే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బిజెపి పాలిత ప్రదేశాల్లోనూ చక్రం తిప్పడం యాదృచ్చికమేమీ కాదు.. వైఎస్ రాజవేఖరరెడ్డి ప్రభుత్వం మహబూబ్‌నగర్ సభలో ప్రాజెక్టుల అవినీతిపై విమర్శలు చేసిన బి.వి.రాఘవులుపై పరువు నష్టం కేసు పెట్టి తర్వాత వెనక్కుతగ్గింది. ఇప్పుడు కెసిఆర్ కూడా కేసులు జైళ్లు చిప్పకూడు భాషలో హెచ్చరికలు చేయడం చరిత్ర పునరావృతిలా వుంది. తప్ప సమైక్య ప్రత్యేక రాష్ట్రాల తేడా ఏమీ లేదు! పిసిసి అద్యక్షుటు ి ముఖ్యమంత్రి సవాలును స్వీకరిస్తారో లేదో అది వారికి సంబంధించిన విషయం. కాని గతంలో మంత్రులనుంచి వచ్చిన బెదిరింపులను ఇప్పుడు అధినేతే ప్రతిధ్వనించడం ప్రజాస్వామిక స్పూర్తి కాబోదు. కెటిఆర్ మరో సందర్భంలో కెసిఆర్ చీఫ్ ఆర్కిటెట్క్ అన్నారు. నిజమే కావచ్చు గాని ప్రతిపక్షాలకూ ప్రజా సంఘాలకూ సంబంధిత బాధిత ప్రజలకూ కూడా ఈ క్రమంలో స్థానముంటుంది. తెలంగాణ ఈ రూపం కొత్గ గాని రాజకీయాలు కొత్తవికావు. వాగ్దానాలూ ఆర్భాటాలూ కూడా కొత్త కాదు. తెలంగాణలో పథకాల ప్రారంభం తప్ప ఫ్రభావం ఇంకా మొదలైందీ లేదు. కనుక ప్రజలూ ప్రతిపక్షం మీడియా కూడా ప్రశ్నించడం తప్పదు. ప్రభుత్వం జవాబులు చెప్పకా తప్పదు. అందరికీ అన్నిటికీ ఆఖరి కొలబద్ద ఆచరణే.
