సిఎం సార్లూ, ప్రశ్నలపై నో గుస్సా
తెలుగు ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, చంద్ర శేఖర రావులు మీడియాతో మాట్లాడేప్పుడు ఇంకొంచెం సహనం చూపిస్తే బావుంటుందని చాలామంది అంటున్నారు. మరీ ముఖ్యంగా యువ మీడియా పర్సన్లు ముఖ్యమంత్రుల స్థాయిలో వారికి చెప్పలేక వారి ధోరణి తట్టుకోలేక బాధపడుతున్నారు. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి మీడియాతో చాలా సేపు గడుపుతూనే నచ్చని ప్రశ్నలు వచ్చినప్పుడు వెటకారం చేయడం లేదంటే మీ సంగతి తెలుసు అంటూ ఎగతాళి చేయడం చూస్తుంటాం. ప్రత్యక్ష ప్రసారంలో అవతలివారెవరో సామాన్యంగా చూపించరు గనక అడిగిన వారెవరోఅర్థం కాదు గాని ఆయన అయిష్టం అసహనం తెలిసిపోతుంటాయి. శనివారం కూడా మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు చెప్పేప్పుడు ఎవరో ప్రశ్న వేస్తే మీరు రాసి రాసి ఏం సాధించారు? అంటూ అతనే ప్రత్యర్థి అన్నట్టు ఆగ్రహంతో స్పందించారు. మీరు కూడా ఇలా చేయాలి అలా చేయాలి అంటూ మీడియాకు సలహాలిస్తారే గాని విమర్శనాత్మక ప్రశ్నలు వస్తే తట్టుకోలేకపోతున్నారు. సింధు విజయంపై మాట్లాడేప్పుడు ఎఎంజి అంటూ అప్పుడు తాను ఆటల సంస్థకు స్థలం ఇచ్చిన సంగతి చెప్పడం అసందర్భంగా వుంది. దానిపై చాలా విమర్శలు వివాదాలు రావడమే గాక కోర్టు కూడా ఆక్షేపించింది. సింధు విజయం సమయంలో ఆ వివాదాన్ని తీసుకురావడంలో రాజకీయం తప్ప రాజనీతిజ్ఞత కనిపించదు.
కెసిఆర్ విషయంలోనూ విలేకరులు ఇలాటి ఫిర్యాదులే చేస్తున్నారు. ఆయన బాగా ధారాళంగా మాట్లాడతారనేది నిజం. అయితే ఆ వూపులో విలేకరుల ప్రశ్నలపై విరుచుకుపడితే లేక ఎకసెక్కం చేస్తే ఎంత ఇబ్బంది? ఎప్పుకో కొద్దిసార్లు మాత్రమే మీడియా ముందుకు వచ్చే ముఖ్యమంత్రిని అడగాల్సిన అంశాలు చాలా వుంటాయి. ఉదాహరణకు శనివారం మీడియా గోష్టిలో ఎవరో విలేకరి నయీం గురించిన ప్రశ్న మొదలు పెట్టగానే నన్నడిగితే ఏం చెప్త? సిట్‌ను అడగాలి అంటూ అతనేదో తప్పు చేసినట్టు వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలు చూడటమే గాక రాష్ట్రాధినేతగానూ ఈ సంచలన విషయంలో సమాచారం ఇవ్వాల్సిన బాద్యత ఆయనపై వుంటుంది. సిట్‌ను రోజూ మీడియాకు ఎప్పటికప్పుడు విషయాలు తెలియజేయవలసిందిగా చెప్పానంటున్న సిఎం ప్రభుత్వాధినేతగా తనను అడగడంలోని సామంజస్యాన్ని ఎందుకు గుర్తించరో తెలియదు. తర్వాత ఇచ్చిన జవాబు కూడా బాధితులకు న్యాయం చేస్తాం అని తప్ప కేసు విస్త్రతి, ఇంత జాప్యం వంటి అంశాలపై ఆ స్థాయిలో స్పందించకపోవడం ఆశ్చర్యకరం. మొత్తంపైన ఉన్నతాధికారులు, రాజకీయ నేతలెవరికీ వచ్చిన ముప్పు లేదని ఈ మాటలతో స్పష్టమై పోయింది. ప్రతిపక్ష పార్టీ ప్రవేశపెట్టిన పవర్ పాయింట్ ప్రెజంటేషన్‌ను మన్ను మశానం అని తీసిపారేయడం వల్ల ఉపయోగం లేదు. ముఖ్యమంత్రి కోపగిస్తే మీడియా వరు నోరు మూసుకోవచ్చు గాని ప్రజల మనసులలోనూ మీడియావారిలోనూ వచ్చే సందేహాలు అలాగే మిగిలిపోతాయి.
