మరో బురిడీపై కేంద్రిం విన్యాసాలు?
ఆంధ్రప్రదేశ్‌కు తమ ద్వారా ప్యాకేజీ రాబోతుందని బిజెపి నేతలు చెప్పిన కథనాలు తర్వాత తాజా విదిలింపులతో ఎలా కుప్పకూలాయో చెప్పుకున్నాం. హౌదా కృష్ణార్పణం, ప్యాకేజీకి పిండ ప్రదానం పోస్టును వీక్షకులు బాగా స్వీకరించారు. అయితే తెలుగుదేశం నేతలు మాత్రం ఇప్పటికీ కేంద్రం ఏదో ఒరగబెడుతుందనే ఆశలో వున్నారు. నిజంగా ఆశపెట్టుకున్నారో లేక ప్రజలను భ్రమపెడుతున్నారో తెలియదు. ప్యాకేజీ రావచ్చని హౌదా కూడా పరిశీలనలో వుందని వారి వాదన. దీనిపై తెలుగుదేశం ప్రతినిధి ఒకరు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. వెంకయ్య నాయుడు ఇప్పటికి కేంద్రంలో వత్తిడి తెస్తున్నారట. ఏదో ఒకటి ఇయ్యకపోతే తనకు తెలుగు ప్రజల ముందుకు వెళ్లేందుకు మొహం చెల్లడం లేదని కావాలంటే ఆ రాష్ట్రాల నుంచి విడుడల చేయమని ఆయన అడిగారట. హౌదా వల్ల లాభం ఏమీ లేకపోయినా మాట ప్రకారం ఇచ్చేసి చేతులు దులిపేసుకుందామన్నది వెంకయ్య వాదనగా వుందని టిడిపి వర్గాలంటున్నాయి. బిజెపి అద్యక్షుడు అమిత్ షా కూడా ఈ వాదనను బలపరుస్తూ ఈ సమస్య ముగిద్దామని చెబుతున్నారట. మరో వైపున ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మాత్రం లాభం లేని హౌదా బదులు కాస్త కసరత్తు చేసి ఏదో ఒక ప్యాకేజీ ప్రకటిస్తే మంచిదన్నట్టు మాట్లాడుతున్నారట. ఈ కథను తెలుగుదేశం నాయకులు సీరియస్‌గా నమ్మడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజంగా అలాటి అవకాశమే వుంటే మొన్న 1976 కోట్లు విడిగా ప్రకటించేవారేనా? ప్యాకేజీలో కలిపి పెద్దగా చూపించాలనుకుంటారు కదా! అందువల్ల ఇంకా ఏదో అవకాశం వుందనే ఆశకు ఆధారమే లేదు. ఇక అరుణ్‌జైట్టీ హౌదాకు వ్యతిరేకం తప్ప ఏదో ఒరగబెట్టడం కోసం శ్రమిస్తున్నారన్నవి కూడా లేనిపోని కబుర్లే. హౌదా కుదరదనే వాదన కోసం ఆయన ఇవన్నీచెబుతుండొచ్చు. ఇంతకూ ప్రధాని మోడీ రెంటికి పెద్ద ఆసక్తిలేరన్నది నిజం. మొన్న చంద్రబాబు కలిసినప్పుడు కూడా ఆయన అంతా నాకు తెలుసంటూ పెద్దగా వివరణకు అవకాశం ఇవ్వలేదన్నది సమాచారం. కాబట్టి ఈ కథలన్నీ కూడా రాజకీయ ప్రచారం కోసమే ఉద్దేశించినవని చెప్పకతప్పదు.
