హిందువులు జనాభా పెంచాలట!

mhnbhgvt111

దాచేస్తే దాగని సత్యంలా ఆరెస్సెస్‌ సంఘ పరివార్‌ నాయకుల అసలు రూపం వెల్లడవుతూనే వుంటుంది. వారి మౌలిక సిద్దాంతం హిందూత్వమే గనక ఏవేవో మెలికలతో దాన్ని వెళ్లగక్కుతుంటారు. భారత దేశం బహుమతాల విశ్వాసాల నిలయమనే వాస్తవాన్ని అంగీకరించడానికి మనసొప్పదు. పరివార్‌ అత్యున్నత నేత మోహన్‌ భగవత్‌ శనివారం నాడు ఆగ్రాలో విద్యా సంస్థల ప్రతినిధుల సమ్మేళనంలో నుడివిన వాక్కులే ఇందుకు నిదర్శనాలు. హిందువులు జనాభా పెంచకూడదని ఎవరు చెప్పారని ఆయన ప్రశ్నించారు. తమ శిష్య పరమాణువులే కేంద్రంలోనూ కొన్ని రాష్ట్రాలలోనూ అధికారంలో వుండి కుటుంబ నియంత్రణ లేదా సంక్షేమం గురించి చెప్పారన్నది పాపం మర్చిపోయారు. ముస్లిములు ఎక్కువ మంది పిల్లలను కనడంతో వారి జనాభా పెరిగిపోతుందనేది ఆరెస్సెస్‌ నిరంతర పల్లవి. నిజానికి వారి జనాభా ఆ స్తాయిలో పెరగడం లేదనీ, ఎప్పటికీ వారు ఈ దేశంలో మెజార్టి కాలేరని పదేపదే లెక్కలతో సహా నిరూపితమైంది. అయినా సరే మతాల మధ్య ఉద్రేకాలు పెరగాలంటే ఇలాటి మాటలు మాట్లాడాలి. దౌర్భాగ్యం ఏమంటే ఇస్లామిక్‌ తీవ్రవాదం ఐఎస్‌ఐఎస్‌ వంటి సంస్థలూ మజ్లిస్‌ వంటిపార్టీలు మాట్లాడే మాటలు కూడా ఇలా వాదించేవారికి బలం చేకూరుస్తుంటాయి. అందుకే మతోన్మాదాలన్నీ బొమ్మ బొరుసు వంటివే. అయితే భారత దేశం హిందూ దేశమనడానికి అభ్యంతరమేమిటని కూడా మోహన్‌ భగవత్‌ గట్టిగా వాదించారు. ప్రభుత్వంలో ఏమైనా సమస్యలుంటే మంత్రులతో మాట్లాడాలి గాని తనకు చెప్పొద్దంటూనే చేయగలిగింది చేస్తానని ముక్తాయించారు. అయితే తాను ప్రభుత్వ దూతను కాదంటూనే చాలా విషయాల్లో దాన్ని సమర్థించేట్టు మాట్లాడారు. ఉపాధ్యాయులందరూ ఆరెస్సెస్‌లో చేరితే విషయాలు తెలుస్తాయని ఆహ్వానించారు.
మరోవైపున జార్ఖండ్‌ ముఖ్యమంత్రి రఘువరదాస్‌ మాట్లాడుతూ భారత దేశం మన మాతృదేశమైతే ఆవు మన తల్లి అని నిర్వచనమిచ్చారు. భరత మాత అన్న భావనను గోమాత గా మార్చేశారు. ఆవులను కాపాడాలి గాని మానవులను హతమార్చడం సరికాదని ఈ మధ్యనే ప్రధాని మోడీ చెప్పిన మాటలకు విరుద్ధమైన పరిణామాలు ఈ వారం రోజులలోనూ చాలా సంభవించాయి. యుపిలో గోరక్షణ దళం అధినేత కూడా అరెస్టయ్యారు. బెదిరింపులు,డబ్బు గుంజడం,అసహజ శృంగారానికి యువకులను వేధించడం వంటి అనేక ఫిర్యాదులపై ఆయన ఆరెస్టయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *