మళ్లీ ఖైదీని చేయాల్సిందేనా?
చిరంజీవిని మెగా స్టార్‌ను చేసింది ఖైదీ. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మెగాస్టార్ బిరుదు ఎప్పుడు ఎలా వచ్చిందని ఒక చర్చలో ఆయనతో చాలా చిత్రాలు తీసిన నిర్మాత కె.ఎస్. రామారావును అడిగితే ఖైదీ విజయం తర్వాత ఆ టైటిల్ పెట్టామని చెప్పారు. ఇంతకూ ఖైదీ కథ ఎలా వచ్చిందనేది మరో కథ. ఒక చిత్రం కోసం బయిలుదేరి ఆ క్యాసెట్ దొరక్క ఫస్ట్‌బ్లడ్ అనే మరో చిత్రం ఆధారంగా తీసుకుంటే ఈ సూపర్ డూపర్ విజయం దక్కింది. తర్వాత అసలు క్యాసెట్ దొరికి దాని ప్రకారం వేట తీస్తే బోల్తా కొట్టింది. అదంతా చరిత్ర. చిరంజీవి చరిత్రలో చాలా దశలు గడిచారు. విజయాలు చూశారు.రాజకీయాలూ చూశారు. ఇన్ని దశల తర్వాత తీసే సినిమాకు మళ్లీ ఆయనను ఖైదు చేయాల్సిందేనా? ఇంతకాలంలోనూ మారిన ప్రేక్షకుల ఆలోచనలు తరాల అభిరుచులు గమనంలో పెట్టుకుని మరింత భిన్నంగా ప్రయత్నించకూడదా? పరిశ్రమలో పేర్లకూ కొరత ఏర్పడిందా? అద్భుతమైన అందమైన తెలుగు భాషలో ఆయన పునరాగమనానికి తగిన పేరు తీసుకోకుండా సెంటిమెంటు ప్రకారం వెళ్తున్నారా?అది వారి ఇష్టమే గాని ఈ అతి జాగ్రత్త మాత్రం ఆయన అగ్రస్థానానికి తగినట్టు లేదని చెప్పక తప్పదు. నాయిక విషయంలోనూ ఒకింత ఆశ్చర్యకరంగా కాజోల్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. సరే ఎలాగూ వారికి ప్రాధాన్యత వుండదు. ఎన్టీఆర్ తన మనవరాలిగా వేసిన శ్రీదేవితోనే నటించిన దానికన్నా పెద్ద విశేషమేమీ కాదు కాని చిరంజీవి కేవలం కమర్షియల్ ఫార్ములాలనే నమ్ముకుంటే ప్రేక్షకులు సంతృప్తి చెందరు. ఖైదీ నుంచి ఖైదీ150 నాటికి తనలో వచ్చిన పరిణితిని చూపితేనే హర్షిస్తారు.
