స్టార్ సల్మాన్ డీల్ 1000 కోట్లు!
సినిమాలు ఎలా వున్నాయో ఎలా వుండాలో విమర్శకులు(మాలాటి వారితో సహా) చాలా చెబుతుంటారు. ప్రేక్షకులు కూడా చాలా ఆశిస్తుంటారు. అయితే అది మౌలికంగా వందల కోట్ల వ్యాపారంతో ముడిపడిన రంగమని అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు హిందీ తారలతో టివీ ఛానల్స్ కుదుర్చుకునే ఒప్పందాల విలువ తెలిస్తే కళ్లు తిరిగిపోవలసిందే. ఉదాహరణకు సల్మాన్‌ఖాన్‌తో స్టార్ టీవీ 2013లో రు.500 కోట్లకు ఒప్పందం కుదర్చుకుంది. దీని గడువు 2017 డిసెంబర్ వరకూ వున్నా ఈ మధ్య రు.1000 కోట్లకు తిరగరాసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం సల్మాన్ సినిమాల శాటిలైట్ హక్కులు స్టార్‌కే విక్రయించాల్సి వుంటుంది. దాంతో పాటు ఆ ఛానల్‌లో అడపాదడపా కనిపిస్తుండాలి. అయితే చిక్కు ఎక్కడ వచ్చిందంటే సుల్తాన్ చిత్రం నిర్మించిన ఆదిత్య చోప్రా తమ సినిమాలన్నీ ఇంతవరకూ సోనీ కే ఇస్తున్నారు. కనుక సల్మాన్ ఒప్పందాన్ని గౌరవించి చిత్రం హక్కులు విక్రయించడానికి సిద్ధం కాలేదు. ఈ విషయమై స్టార్ ఏమీ మాట్లాడ్డం లేదు గాని ఏదో ఒక పరిష్కారానికి వస్తారనే అనుకోవాలి. సల్మాన్ నటించే మరో పది చిత్రాలు కూడా స్టార్‌కే వెళ్లాల్సి వుంటుంది. ఇదే కోవలో హృతిక్ రోషన్ 550 కోట్లతో, అజరు దేవ్‌గన్ 400 కోట్లతో వరుణ్‌దావన్ 300 కోట్లతో ఒప్పందాలు చేసుకున్నారట. వారందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.టీవీల నుంచి హీరోలకు వచ్చే మొత్తాలే ఇంత భారీగా వుంటే లాభాలు ఖర్చులు ఏ మోతాదులో వుంటాయో వూహించవలసిందే.ఈ విధంగా ముందే డీల్స్ కుదర్చుకోవడం వల్ల ఉపయోగం ఏమంటే ఛానళ్లకు హిట్ చిత్రాల ప్రసార హక్కులు లభిస్తే స్టార్లకు భారీ మొత్తాలు ముడుతుంటాయి. ఇంత డబ్బు మయమైన పరిశ్రమలో సమాజం సందేశం అంటూ నస పెడితే ఎక్కడో అరుదుగా తప్ప పట్టించుకునే పరస్థితి ఎక్కడుంటుంది? చెప్పాలంటే వినోదం ఇప్పుడు అతి ఖరీదైన వ్యాపారం. పరిశ్రమ మాత్రమే తప్ప కళ కాకరకాయ ఆ తర్వాతే! ఈ చిత్రాలు ఇంత మొత్తాలు పెట్టి తీసుకోవడమెందుకంటే వాటిమధ్యలో భారీతా యాడ్లు జొప్పించడానికేనని వేరే చెప్పాలా!