హౌదాపై చేతులెత్తేసిన పవన్

ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా విషయమై జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ మరింత వెనక్కు తగ్గినట్టే చెప్పొచ్చు. కేంద్రం నుంచి హౌదా దాదాపు తిరస్కరణకు గురైన నేపథ్యంలోనూ ఆయన చాలా సంధిగ్ధంగా మాట్లాడారు. దానిగురించి ఆలోచనలు వున్నా స్పష్టత లేదన్నట్టు ఆచితూచి స్పందించారు. ఇంతమంది ఎంపిలు
రాజకీయ పార్టీలు చేయలేనిది ఒక్క వ్యక్తి వల్ల అవుతుందని నేను అనుకోను అంటూ తనమీద భారం వేసుకోకుండా జాగ్రత్త పడ్డారు.
గొడవల వల్ల ప్రత్యేక హౌదా రాదంటూ పరోక్షంగా ఆందోళనలపట్ల విముఖత వ్యక్తం చేశారు. ప్రతిపక్ష వైసీపీ ఏం చేస్తుందో చూడాలన్నారు. హౌదాపై మూడు పార్టీలు(బిజెపి టిడిపి,జనసేన) హామీనిచ్చాయి కదా అని మీడియా విలేకరులు ప్రశ్నించినప్పుడు మధ్యలో అడ్డుపడి.. ముగ్గురు కాదు, కాంగ్రెస్ బిజెపి కలిసి ఇచ్చాయని సవరించారు. అయితే ఎన్నికల ప్రచారంలో చెప్పారు కదా అంటే వారు ఇస్తామన్నారు గనక అడిగామని సమర్థించుకున్నారు. మరి ఇవ్వడం లేదు కదా అంటే వారు చెప్పాలి కదా.. చూద్దాం ఇవ్వం అంటే అప్పుడేం చేయగలమో మాట్లాడదాం అంటూ ముక్తాయించారు. గత వారం రోజులలోనూ హౌదాను దాదాపు భూస్థాపితం చేసినట్టే కేంద్రం మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్ ఇంకా ఆశలు వున్నట్టు చెప్పడం విచిత్రం. ఏది ఏమైనా హౌదా విషయమై గట్టిగా పోరాడ్డం సంగతి అటుంచి మాట్లాడ్డం కూడా ఆయనకు ఇష్టంలేదని తేలిపోయింది. వెండితెరపై ఆరడుగుల బుల్లెట్ కావచ్చు గాని రాజకీయ జీవితం వేరే కదా ఎవరికైనా!