వారసుల నీరసంతోనే రీ ఎంట్రీ.. అయినా లిమిట్స్‌..

tollywood t20-cr-1276452416-2
వారసులను రంగంమీదకు తెచ్చి తాము ఒకింత విశ్రాంతి తీసుకుంటామని ప్రకటించిన సూపర్‌ సీనియర్స్‌ ఎందుకు మళ్లీ ఉధృతంగా ముందుకొస్తున్నారు? కుమారుల పక్కన నటించిన వారితో తామూ హీరోలుగా చేసేందుకు సిద్ధమై పోయారు? ఈ ప్రశ్నకు సినీ రంగ పరిశీలకులు ఒకే సమాధానమిస్తున్నారు. వారసులు వారనుకున్నంత ఆశాజనకమైన ఫలితాలు చూపించలేకపోయారు. కృష్ణ కుమారుడు మహేష్‌, మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్‌ మాత్రమే కొత్త బ్యాచిలో ఘన విజయాలు రికార్డు చేశారు. రామ్‌ చరణ్‌ తేజ కూడా మగధీర మినహాయిస్తే గొప్ప పలితాలు తేలేకపోయారు. అంతేగాక ఆ కుటుంబ వారసత్వం కోసం పోటీ ఎక్కువగా వుంది. మోహన్‌ బాబు కుమారులకు ఇంకా చెప్పుకోదగిన హిట్‌ రావలసి వుందని దాసరి వేదికపైనే వ్యాఖ్యానించారు. నాగ చైతన్య, అఖిల్‌ వంటి వారు ఇంకా బలమైన ముద్ర వేసింది లేదు. రానా కూడా హీరోయేతర పాత్రలతోనే ఎక్కువగా రాణించారు. ఇలా చెప్పుకుంటూ పోతే వాస్తవంగా పెద్ద హీరోల వారసులకు చిత్రాలు వచ్చాయి గాని విజయాలు దక్కింది చాలా తక్కువ. ఈ లోగా నానీ, శర్వానంద్‌ వంటి వారు ఒక ఇమేజి సంపాదించుకుంటున్నారు. వారసులకు ఇంకా చాలా భవిష్యత్తు వుందన్నది నిజమే గాని అస్పష్టమైన భవిష్యత్తుపై ఆశతో ప్రస్తుతం రంగాన్ని మరెవరికైనా అప్పగించేస్తే తర్వాత కష్టం. కనుకనే తమ స్లాట్‌ తాము కాపాడుకోవడానికి ప్రత్యక్షంగా రంగంలో వుండటమే మార్గం. పైగా ఈ చిత్రాలకు కుమారులు కుమార్తెలే నిర్మాతలుగా వుంటూ పరిశ్రమలో పేరు పట్టు పంచుకొంటారు.
మహేష్‌ కన్నా ముందు కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌ను పరిచయం చేశారు. అతనంత బాగా ఫలితాలు చూపించలేదని నిర్మాతను చేశారు. కుమార్తె మంజుల కూడా నిర్మాతగా చిత్రాలు అందించారు. మోహన్‌ బాబు సంతానం కూడా నిర్మాతలుగా చిత్రాలు తీశారు. ఆ మాటకొస్తే అక్కినేని చిత్రాలకు మొదట్లొ నాగార్జున పేరు కూడా నిర్మాతగా వేసేవాళ్లు. కె.రాఘవేంద్రరావు కుమారుడు హీరోగా బయిలుదేరి దర్శకుడుగా మారి అవార్డు చిత్రాలే తీశారు.చిరంజీవి 150 వ చిత్రం కూడా కుమారుడు చరణ్‌ నిర్మాతగా వున్నారు. ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్న పరిణామాలే. అల్లు అరవింద్‌ వంటి నిర్మాణ దక్షుడు లేకపోతే మెగా ఫ్యామిలీ ఇంతగా నిలదొక్కుకునేది కాదు. అయితే నిర్ణయాలు మెగాస్టారే తీసుకుంటారని సన్నిహితులకు తెలుసు. ఇప్పుడు రాజకీయ పర్వానికి సెలవిచ్చి సినిమారంగంలోకి రావడానికి కూడా చాలా కారణాలున్నాయి. అయితే ఎవరు ఎంత గొప్పవారైనా రీ ఎంట్రీకి పరిమితులుంటాయి. రజనీకాంత్‌ విషయంలో అవి స్పష్టంగా కనిపిస్తున్నాయి కూడా. ఆ సంగతి తెలుసుగనకే ఒక అభద్రత కూడా వెన్నాడుతుంటుంది. అక్కినేని ప్రేమాభిషేకం ఎంత పెద్ద హిట్‌ అయినా లేక ఎన్టీఆర్‌ బొబ్బిలిపులి అదరగొట్టినా వారు మళ్లీ పాత రోజుల్లో వలె చిత్రరంగాన్ని ఏలేసే పరిస్తితి వచ్చివుండేది కాదు. ఎందుకంటే మనుషుల వయస్సుకు పరిమితులుంటాయి. అమితాబ్‌ బచన్‌ వంటి లాంగ్‌ ఇన్నింగ్స్‌ నటులైనా సరే జంజీర్‌ షోలే యుగం మళ్లీ తీసుకురాలేరు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *