‘బెలూచీ గానం’ పాకిస్తాన్‌కు ఆయుధం

888 md

ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట బురుజులమీద నుంచి చేసిన మూడవ ప్రసంగం గత 70 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలోనే అతి పెద్దది. ఆయనకంటే ఎక్కువ కాలం పాలించిన వాళ్లు, ప్రసిద్ధులూ కూడా అంత సుదీర్ఘ ప్రసంగం చేసింది లేదు. అయితే అత్యధిక సమయం తీసుకోవడమే గాక ఇదివరకెన్నడూ ఎవరూ చెప్పని విషయం ఒకటి ఆయన ముందుకు తెచ్చారు. అది విదేశాంగ విధానానికి సంబంధించిన విపరీత వివాదంగా మారడం మోడీ శైలికి ప్రతిబింబం. అలాగే ఆయనను నడిపించే ఆరెస్సెస్‌ బిజెపి ద్వంద్వనీతికి దుందుడుకు తనానికి నిదర్శనం. ఇప్పటికే దేశమంతటా మీడియాలో చర్చకు దారితీసిన బెలూచిస్తాన్‌ ప్రస్తావన ఉపఖండంలో పరిస్థితిని ఒక్కసారిగా మార్చేస్తున్నది. కర్ఫ్యూలో మగ్గిపోతున్న కాశ్మీర్‌లో ఇప్పటికి అరవై మంది ప్రాణాలు కోల్పోయినా అదుపులోకి తేలేకపోతున్న మోడీ సర్కారు ఆక్రమిత కాశ్మీర్‌, బెలూచీస్తాన్‌ సమస్యలను లేవనెత్తడం ద్వారా పాకిస్తాన్‌ను దెబ్బకు దెబ్బ తీయొచ్చని బిజెపి చాలా కాలంగా ఉబలాటపడుతున్నది. ఆ విషయంలో దూకుడుగా లేనందుకు గత ప్రభుత్వాలపై విమర్శ కూడా చేసింది. ఇప్పుడు ఏకంగా ప్రధాని విధాన ప్రసంగంలోనే బహిరంగంగా దాన్ని ముందుకుతెచ్చి భారత పాక్‌ వివాదాల్లో కొత్త కుంపటి తెచ్చిపెట్టింది. కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన గురించి పాకిస్తాన్‌ తరచూ విమర్శలు చేస్తుంటుంది. అది తమ దేశానికి చెందాలంటూ అంతర్జాతీయ వేదికలపై వాదిస్తుంటుంది. కాశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమని భారత ప్రతినిధులు ఆ వాదనలు తిప్పికొడుతుంటారు.అయితే ఆ రాష్ట్రంలో మాత్రం వివిధ పాలక పార్టీల అవకాశవాద రాజకీయాల వల్ల, పక్కనున్న పాకిస్తాన్‌ కుట్రల వల్ల నిరంతరం చొరబాట్లు, తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతుంటాయి. ఏది ఏమైనా సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలన్నది భారత దేశ వైఖరిగా వుంటూ వచ్చింది.అయితే అదే సమయంలో అమెరికాకు మనం ఉపగ్రహంగా మారేకొద్ది పరోక్ష పద్ధతిలో ఏదో విధంగా కాశ్మీర్‌ ప్రస్తావన వస్తూనే వుంటుంది. పాకిస్తాన్‌కు సన్నిహిత స్నేహితురాలుగా వున్న చైనా కూడా ద్వైపాక్షిక పరిష్కారం జరగాలని చెబుతుంటుంది.
అసంబద్ద ప్రస్తావన
పాకిస్తానన పాలకులు ముఖ్యంగా సైనిక నియంతలు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కాశ్మీర్‌లో తీవ్రవాదాన్ని ఎగదోస్తున్నట్టు నిరూపించే సాక్ష్యాలు అనేక సందర్భాల్లో దొరికాయి. 26/11 ముంబాయి తాజ్‌హౌటల్‌పైదాడితో సహా వందలాది దారుణ టెర్రరిస్టు చర్యల వెనక పాకిస్తాన్‌ హస్తం వుందని భారత్‌ వెల్లడించింది. ఇటీవలనే పఠాన్‌కోట సైనిక స్థావరంపై దాడి ఈ పరంపరలో ఒకటి మాత్రమే. ఇవన్నీ నిజమే అయినా దీనికి పరిష్కారం చర్చలద్వారా కనుగొనడం తప్ప ఉభయ దేశాల ఉద్రిక్తతలు పెంచుకోవడం కాదని చరిత్ర పాఠం నేర్పింది. మధ్య మధ్య అవాంతరాలు వచ్చినా ఇరుదేశాలు ఏదోరూపంలో చర్చలు పునరుద్ధరించుకుంటూ వస్తున్నాయి. ఆక్రమిత కాశ్మీర్‌ కూడా మనకే చెందాలని చెబుతున్నా ఆ విధంగా సమస్యను మరింత జటిలం చేయాలని భారత్‌ కోరుకోలేదు. ఇంకా చెప్పాలంటే . ఇలాటి నేపథ్యంలో ప్రధాని మోడీ ఒక్కసారిగా ఆక్రమిత కాశ్మీర్‌,గిల్టిట్‌ బటుస్తాన్‌, బెలూచీ స్తాన్‌ల గురించి అధికారికంగా మాట్లాడారు. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘనను ఖండిస్తూ వారికి భారత దేశం మద్దతు నిస్తున్నదని అందుకు వారు కృతజ్ఞతలు చెబుతున్నారని తెలిపారు. ఆక్రమిత కాశ్మీర్‌, దాంతో పాటే ప్రత్యేక సమస్యగా వున్న గిల్గిట్‌ల ప్రస్తావన ఎలా వున్నా పాక్‌లో అతి పెద్ద రాష్ట్రమైన బెలూచీస్తాన్‌ విషయం ఎందుకు మాట్లాడినట్టు? మనం వారి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నామనే పాక్‌ నిరంతర ఆరోపణకు ఆధారాలు సమకూర్చాలనుకున్నారా? తద్వారా కాశ్మీర్‌ సమస్యనూ బెలూచీ సమస్యను ఒకేగాట కట్టి అంతర్జాతీయ వివాదంగా రగిలించేందుకు పాకిస్తాన్‌కు మరో అవకాశం ఇవ్వదలచారా?
చారిత్రిక నేపథ్యం
చరిత్రను పరిశీలిస్తే కాశ్మీర్‌ రాజు దగ్గర 1934లో బ్రిటిష్‌ వారు 60 ఏళ్ల లీజుకు తీసుకున్న గిల్గిట్‌ను ఒక ప్రత్యేక ఏజన్సీగా వుంచారు. దేశ విభజనానంతరం దాన్ని వదిలేశారు. కాశ్మీర్‌ యుద్ధం సమయంలో దాన్ని స్వాధీనపర్చుకున్న పాకిస్తాన్‌ మిగిలిన ప్రాంతం( వారి భాషలో ఆజాద్‌ కాశ్మీర్‌, మన భాషలో పివోకె పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ )తో కలపకుండా ప్రత్యేకంగా అట్టిపెట్టింది. అంటే కాశ్మీర్‌ తమకే రావాలన్న వాదన చేయాలంటే ఇలాటి ప్రత్యేక ప్రాంతాలు వుండటం ఉపయోగమని భావించింది. గిల్గిత్‌, పివోకేలు మాకే రావాలని ఇండియా లాంచనంగా ఎప్పుడూ చెబుతూనే వుంది. అయితే దాన్ని ఒక ఘర్షణ వరకూ గాని అమీతుమీ తేల్చుకునే వరకూ గాని తీసుకెళ్లలేదు.చైనాతో అవగాహనకు వచ్చినట్టే పాకిస్తాన్‌తోనూ ఒక వాస్తవాధీన రేఖపై ఒప్పందానికి వస్తే మంచిదని కొన్నిసార్లు ఆలోచనలు చేసింది. దాంతో పోలిస్తే ప్రస్తుత ప్రవచనాలు మౌలిక మార్పుకు సంకేతాలు. ఇక బెలూచీస్తాన్‌ విషయంలోనైతే అలాటి సంబంధం కూడా లేదు. పాక్‌, ఇరాన్‌లలో కొన్ని ప్రాంతాలతో కూడిన బెలూచీలు చాలా కాలంగా స్వతంత్రత కోరుతూ పోరాడుతున్న మాట నిజమే. మరీముఖ్యంగా పాకిస్తాన్‌లో వారి కలయిక కూడా ప్రత్యేక పరిస్థితులలోనే జరిగింది. మహ్మదాలీ జిన్నా మొదట అక్కడ ఒక రాజుతో సంప్రదించి వారి స్వతంత్రాన్ని కాపాడుతామనే హామీతో లీనం చేసుకున్నారు. కాని కొద్ది కాలంలోనే ఆ హామీని వమ్ముచేసి తమ రాష్ట్రంగా మార్చుకున్నారు. విస్తీర్ణం రీత్యా పాక్‌లో సగం వుండే బెలూచీస్తాన్‌లో జనాభా తక్కువ గానే వుంటుంది. ప్రజలు బాగా వెనకబడి వుంటారు. అయితే అక్కడ చాలా విలువైన ఖనిజసంపదలుంటాయి. అందుకే పాక్‌ పాలకులు ఎప్పుడూ బెలూచీస్తాన్‌పై పూర్తి ఆధిపత్యం కోరుకుంటున్నారు. పక్కనున్న ఆఫ్ఘనిస్థాన్‌లో అంతర్గత కల్లోలాన్ని అస్థిరత్వాన్ని సాకుగా చూపి అక్కడ అణచివేత తీవ్రం చేశారు.బెలూచీ నేషనల్‌ మూమెంట్‌, మరికొన్ని సాయుధ సంస్థలు దీనిపై పోరాడుతున్నాయి. బెలూచీ రాజధాని క్వెట్టాలో వరుసగా జరిగిన మారణ కాండ ప్రపంచాన్ని కలవరపర్చింది. ఇదంతా కూడా పాక్‌పాలకులు సైన్యం నిరంకుశత్వం కారణంగానే జరుగుతున్న మాట యథార్థం. ఈ తిరుగుబాట్లకు భారత్‌ నుంచి మద్దతు లభిస్తుందని, గూఢచారి సంస్థ రా వీటిని సమన్వయం చేస్తున్నదని పాక్‌ నిరంతర ఆరోపణ. దీనికోసం తొమ్మిది శిక్షణా కేంద్రాలు నడిపిస్తున్నట్టు పాక్‌ ప్రతినిది అహ్మద్‌ సుభా భాషా తమ పార్లమెంటరీ సమావేశంలో నివేదికనిచ్చినట్టు వికీలీక్స్‌లోవెల్లడైంది. కాశ్మీర్‌లో పాక్‌ ఆయుధ ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు ఇండియా చేసింది లేదు. కాని మోడీ అనాలోచిత వ్యూహం లేదా దుస్సాహసిక విధానం ఆ ఫిర్యాదులకు మోతుబరి సాక్ష్యం లభించింది.
రాజకీయ లబ్దికోసమేనా.
బెలూచీ ప్రస్తావన ఇదే మొదటి సారి కాదన్నది కూడా నిజమే. 2005,06,09 సంవతసరాల్లో ప్రభుత్వం పార్లమెంటులో ప్రశ్నలకు సమాధానంగా ఇలాటి సమాచారం ఇచ్చింది. 2009లో ఈజిప్టులో అలీన దేశాల సమావేశం సందర్బంగా ప్రధాని మన్మోహన్‌ పాక్‌ ప్రధాని జిలాని విడుదల చేసిన సంయుక్త ప్రకటనలోనూ ఈ అంశం మరో రూపంలో వచ్చింది. ‘ బెలూచీస్తాన్‌లో ఉగ్రవాద చర్యల గురించి సమాచారం వున్నట్టు పాకిస్తాన్‌ పేర్కొనది అని మాత్రమే ఆ ప్రకటనలో వుంది. ఆ మాత్రం ప్రస్తావించినందుకే అప్పుడు బిజెపి విపరీతంగా విమర్శించింది. కాని ఇప్పుడు తానే అధికారంలో వుండి ఆ ఉగ్రవాదాన్ని మేమే బలపరుస్తున్నామని ఏకపక్షంగా ప్రకటించింది. ఇది పాక్‌ను మాత్రమే గాక పివోకెలో దాని భూభాగాలు తీసుకుని నిర్మాణాలు చేస్తున్న చైనాను కూడా ఇరకాటంలో పెడుతుందని మోడీ సలహాదారులు చెబుతున్నారు. గిల్గిట్‌లో చైనా నిర్మిస్తున్న పెద్ద రోడ్డును చైనా పాక్‌ ఎకనామిక్‌ కారిడార్‌(సిపిఎసి) అంటున్నారు. భారత పాక్‌ సంబందాలు మెరుగుదలకు దోహదం చేసి తన ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలన్నది చైనా ఆలోచనగా కనిపిస్తుంది తప్ప ఘర్సణాత్మక వైఖరి తీసుకోలేదు. కాని మోడీ ప్రకటన తర్వాత వాషింగ్టన్‌ పోస్టు కూడా ఇది ఇండియాకు నష్టమేనని విశ్లేషించింది. ఇక పాక్‌ మీడియా అయితే భారత్‌పై ఒంటికాలితో లేస్తున్నది. మన దేశంలోనూ హిందూ హిందూస్తాన్‌టైమ్స్‌ తదితర పత్రికలన్నీ ప్రదాని వ్యాఖ్యలు ఇబ్బంది కలిగిస్తాయని తేల్చిచెబుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ ఉదయం విమర్శించి సాయింత్రం స్వాగతించి గందరగోళాన్ని వెల్లడించుకుంది. ఈ ప్రకటనలు పాకిస్తాన్‌ ఫిర్యాదులకే బలం చేకూరుస్తాయని సిపిఎం విమర్శించింది.బిజెపి ఆరెస్సెస్‌లు కూడా ఇంత వరకూ గట్టిగా సమర్థించుకున్నది లేదు. గుజరాత్‌ యుపి ఎన్నికల దృష్ట్యా కావాలనే ఉద్రేకాలు రెచ్చగొట్టడానికి ఈ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం బలంగావుంది.
విజ్ఞత లేని విపరీతం
ఒక్క బంగ్లాదేశ్‌ మినహా ి ఇరుగుపొరుగుదేశాలతో మన సంబందాలు ఈ ప్రభుత్వంలో అంతంతమాత్రంగానే వున్నాయి. నేపాల్‌, శ్రీలంక, బర్మా,చైనా అన్నిటి విషయంలోనూ తీవ్రమైన ఒడుదుడుకులున్నాయి. ఈశాన్య తీవ్రవాదులను తరిమికొట్టే పేరిట మైన్మార్‌ సరిహద్దుల వరకూ వెళ్లడం విమర్శలకు దారి తీసింది. ఒక దశలో నేపాల్‌తోనూ ఉద్రిక్తత ఏర్పడింది. ఇవన్నీ ఎప్పుడు ఎలా పరిష్కారమవుతాయనేది చూడాల్సింది పోయి కొత్త సమస్యలు రగిలించుకోవడం ఆందోళనకరం. ముందు కాశ్మీర్‌లో పరిస్థితిని చక్కబర్చుకోవడానికి బదులు బెలూచిస్తాన్‌పై పేచీకి అవకాశమివ్వడం విపరీతం. విదేశాంగ అంశాలు అందునా ఇరుగుపొరుగుతో సంబంధాలు సాధ్యమైనంత సానుకూలంగా మల్చుకోవడం విజ్ఞత కాని కోరి వివాదాలకు అవకాశమివ్వడం వీరత్వమేమీ కాదు.దాని హనికర ఫలితాలు దీర్ఘకాలం వుంటాయి. (నవ తెలంగాణ, ఆగష్టు 18, 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *