తక్షకుడితో ఇంద్రుడు.. బిజెపితో చంద్రుడు

ప్రత్యేక ప్యాకేజీ కింద కనీసం 20 వేల కోట్ల మేరకు బిజెపి నాయకుల ద్వారా ఒక ప్రకటన వెలువరించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని ఆ పార్టీ నాయకులు కలిసినప్పుడు చెబుతూ వచ్చారు. రాష్ట్ర పార్టీ అద్యక్షుని ఎంపిక పూర్తిచేసుకోలేని దుస్థితి నుంచి బయిటపడి ఆ ప్రకటన ఈ ప్రకటన కలసి వచ్చేట్టు చూస్తే కొంతైనా రాజకీయ ప్రయోజనం వుంటుందని లేకపోతే తెలుగుదేశం ప్రచారానికి పనిముట్టు అవుతుందని ఒక ప్రతినిధి చెప్పారు. బిజెపి ద్వారా బిజెపి కొరకు అని నిన్న అదే నేను రాశాను. ఇప్పుడు ఎలాటి హడావుడి లేకుండా రు.1976 కోట్లు విడుదల చేశారు. ఇందులో రెవెన్యూ లోటు కింద 1176, రాజధాని నిర్మాణానికి 450, వెనకబడిన ప్రాంతాలకు 350 కోట్లుగా విభజించారు. ఇవన్నీ నిజానికి దారుణమైన విదిలింపులే. రెవెన్యూ లోటు 16,079 కోట్లలో ఇచ్చింది ఇరవైశాతం కూడా కాదు. ఇక రాజధానికోసం రాష్ఠ్రం కోరింది 8000 కోట్లు కాగా గతంలో అన్ని కలిపి 1050 ఇచ్చి ఇప్పుడు 450 అంటున్నారు. వెనకబడిన జిల్లాలకు గతంలో 750 కోట్లు ఇచ్చి ఇప్పుడు జిల్లాకు 50 కోట్ల చొప్పున మరో 350 కోట్లు మాత్రమే జతచేశారు. రాయలసీమ ఉత్తరాంధ్ర సమస్యలతో పోలిస్తే ఇవి ఏ మూలకు చాలవు. అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన తాజా ప్యాకేజీ విలువే 6వేలకోట్లకు పైగా వుంది.
బిజెపిమీద ఆశలు వదులుకోని రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరుస్తుందో లేదో తెలియదు. ఈ ప్రత్యేక హౌదా కనీస నిధుల మంజూరు ప్రజలందరి సమస్యగా చేసి ప్రతిపక్షాలన్నిటినీ కలుపుకొని ముందుకు నడిస్తే కొంతైనా ఫలితం వుంటుంది. లేదంటే ఎప్పటి ప్రహసనమే అవుతుంది. భారీ ప్యాకేజీ గురించి వూరించి ఉస్సూరనిపించిన బిజెపి గనక నిజంగా ఇదే ఫైనల్ అనేట్టయితే ప్రజలు కాంగ్రెస్‌కు గతంలో చెప్పినట్టే ఇప్పుడు దానికి ఫినిష్ చెప్పడం తథ్యం.ఇక ముఖ్యమంత్రి, చంద్రబాబు నామకార్థంగా అస్పష్టత అని, అసంతృప్తి అని మీనమేషాలు లెక్కపెట్టడం వల్ల ఉపయోగం వుండదు. ఒక సామూహిక రాష్ట్ర వ్యాపిత ప్రజా కార్యాచరణ కదలిక వస్తేనే కేంద్రం కళ్లు తెరుస్తుంది. లేదంటే సర్పయాగంలో తక్షకుడితో పాటు ఇంద్రుడు కూడా హౌమగుండంలో పడాల్సివచ్చినట్లు బిజెపితో పాటు తెలుగుదేశం కూడా రాజకీయ మూల్యం చెల్లించవలసి వుంటుంది. విభజిత రాష్ట్రంలో క్షుభిత :ప్రజానీకం అంత సులభంగా ఎవరి మాటలూ నమ్మరు.