గోరక్షకులు బిజెపి కుర్రాణ్ని చంపేశారు
>

గోసంరక్షణ పేరుతో సాగుతున్న అరాచకం అమానుష దాడులపై అనేకరోజులుగా ఆందోళన పెరుగుతున్నది. ఆఖరుకు ప్రధాని మోడీ కూడా వాటిని ఖండించారు. అయితే దాడులు చేస్తున్నదే బిజెపి సంఘపరివార్‌కు చెందిన వారైనప్పుడు ఈ ఖండనల వల్ల ఉపయోగమేమిటని అందరూ ప్రశ్నించారు. ఈ విపరీతం ఎంతవరకూ వచ్చిందంటే కర్ణాటకలోని ఉడిపి సమీపంలో ఏకంగా బిజెపి కార్యకర్త కూడా ఈ గోరక్షకుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. కజికె అనే గ్రామంలో ప్రవీణ్ పూజారి, అక్షరు అనే యువకులు వాహనంలో మూడు ఆవులను తీసుకుపోతున్నారు. ఈ సంగతి తెలిసి హిందూ జాగరణ్ వేదిక వెంటనే రంగంలోకి దిగి వారిపై దాడి చేసింది. ఎవరు ఎందుకు ఎవరివి వంటి విచక్షణ కూడా లేకుండా ఆవుల పేరిట మానవులను వేటాడటం అలవాటైన ఈ ఛాందస మూక ఆ కుర్రాళ్లిద్దరినీ విపరీతంగా హింసించింది. ఆస్పత్రికి తరలించగా స్థానిక బిజెపి కార్యకర్తగా వున్న పూజారి ప్రాణాలు కోల్పోయారు. దీనిపై 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు కూడా. సంఘ పరివార్ పెద్దలు దీనికేమంటారో. సమర్థించుకోవడానికి మరెన్ని వింత వాదనలు చేస్తారో!