నరకం పక్కనే భారతదేశం
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని సామెత. ప్రధాని నరేంద్ర మోడీ ఆగష్టు 15 ప్రసంగంలో అసందర్భంగా బెలూచీస్థాన్ ప్రస్తావన చేసి భారతదేశంపై ఆరోపణలకు అవకాశమిస్తే ఆయన మంత్రివర్గ సహచరులు వూరుకుంటారా? అందులోనూ గోవానుంచి ఏరికోరి తెచ్చుకున్న రక్షణ మంత్రిమనోహర్ పరిక్కర్ వివాదాస్పద వాగాడంబరానికి పేరు మోశారు. ఆగష్టు 16న హర్యానాలోని రివారిలో బిజెపి సభలో మాట్లాడుతూ ఆయన పాకిస్తాన్‌ను నరకంతో పోల్చారు. అక్కడకు వెళ్లడమంటే నరకంలోకి వెళ్లడమేనన్నారు. ఆరుగురు చొరబాటుదార్లను పట్టుకుని పాకిస్తాన్‌కు తిరిగి పంపడం గురించి ప్రస్తావించినప్పుడు అది నరకంతో సమానమని మాట జారారు. తర్వాత మీడియా ప్రశ్నించినప్పుడు అది ప్రసంగమే గాని ప్రభుత్వ అధికారిక విధానం కాదని తప్పించుకున్నారు. ఏదో పొరబాటుమాట్లాడితే మీడియా దాన్నే పట్టుకోవడమెందుకు అని ఎదురు దాడి చేశారు.
గోవా ముఖ్యమంత్రిగా బాగా పనిచేశారని చెప్పే పరిక్కర్ మాటలు ఎప్పుడూ మంటలు పుట్టిస్తున్నాయి. టెర్రరిస్టులను టెర్రరిస్టుల ద్వారానే ఎదుర్కొవాలని గత ఏడాది అన్నారు. అమీర్ ఖాన్‌పైనా అలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి తర్వాత సర్దుకున్నారు. గణేష్ విగ్రహాలు కూడా మేకిన్ చైనావి వస్తున్నాయని మరోసారి మాట్లాడారు. ప్రత్యేకసైనికాధికారుల చట్టంపై విమర్శలు వస్తుంటే సైన్యాన్ని పంపిన తర్వాత బుల్లెట్ట భాషే మాట్లాడాలి అని సమర్థించారు. ఇలాటివాటి గురించి నిలదీసిన మీడియా ప్రతినిధులతో మీ జీతాలెంత మహాఅయితే 15,20 వేలుంటాయి. మీరేమైనా మహా మేధావులా అని అవమానకరంగా మాట్లాడారు. ఇక ఇప్పుడు ఏకంగాపొరుగుదేశాన్ని నరకంతో పోలిస్తే ఏమనాలి? ఇదే సమయంలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సార్క్ సమావేశాలకు గాను పాకిస్తాన్ వెళ్లవలసిన పర్యటన విరమించుకోవడం కూడా ఈ వ్యాఖ్యలను బలపర్చేదిగా వుంది. పాకిస్తాన్ కుట్రలు కుటిల వ్యూహాలు నిజమైనా రాజకీయ దుస్సాహసంతోనూ అనాలోచిత వ్యాఖ్యలు వ్యూహాలతోనే వారికే మేలు జరుగుతుందని ఫ్రభుత్వ నేతలు తెలుసుకోరా?
