ఉన్‌లో దళిత శంఖారావం


ఈ రోజు తప్పక చెప్పుకోవలసిన అంశం ఒకటుంది. గోరక్షణ పేరిట దళితులపై దాడులు తగదని ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తమదైన శైలిలో హితబోధ చేశారు. మరోవంక విహెచ్‌పి నాయకుడు ప్రవీణ్ తోగాడియా వంటి వారు బహిరంంగానే ఆ మాటలను ఖండించారు. మాటలే గాక కొన్ని చోట్ల కొత్తగా దాడులు జరిగాయి కూడా. ఇవన్నీ ఎలా వున్నా జ్వలిత దళిత ప్రస్థానం ఉన్ చేరింది. ఈ మార్చ్ ప్రారంభం గురించి మనం చెప్పుకున్నాం. ఉన్ చేరకుండా వీరిని అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు జరిగాయని ఆర్గనైజర్లలో ఒకరైన ప్రతీక్ సిన్హా చెప్పారు. వేలాది మంది గుజరాత్ నుంచే గాక హర్యానా, యుపి, రాజస్థాణ్ తదితర చోట్ల నుంచి కూడా ఆటంకాలు ఆంక్షలు అధిగమించి ఉన్ చేశారు. విశేషమేంటే తన ఆత్మాహుతితో దేశంలో అలజడి సృష్టించిన హెచ్‌సియు స్లాలర్ రోమిత్ వేముల మాతృమూర్తి రాధిక వేముల అక్కడ జాతీయ పతాకం ఎగరేశారు.సంఘ పరివార్‌కు సవాల్‌గా మారి పార్లమెంటు చర్చకు కూడా కారకుడైన జెన్‌యు విద్యార్థినేత కన్నయ్య కుమార్, వల్జీ చౌహాన్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ యాత్రలో దళితులే గాక ముస్లిం మైనారిటీలు ఇతర వెనకబడిన తరగతుల వారు కూడా భారీగా పాల్గొనడం సంచలనం కలిగించింది. మోడీ అంతగా స్పందించడానికి గుజరాత్ ముఖ్యమంత్రినే మార్చివేయడానికి కారణమేమిటో ఈ సమీకరణ చూశాక అందరికీ అర్థమైంది. రాజకీయాలలో కొత్త సామాజిక సమీకరణకు సమరాలకు ఇది సంకేతం కావచ్చన్న వ్యాఖ్యలు వినిపించాయి.