ఒకే బాణిలో ఆ రెండు పత్రికలు!

66666నయీం ఉదంతంపై లేదా అంతంపై ఆంధ్రజ్యోతి ఆర్కే కొత్త పలుకు, ౖ నమస్తే తెలంగాణ శేఖర్‌రెడ్డి కట్టామీఠా ఒకే తరహాలో వుండటం ఆసక్తి కలిగించింది. ( నిజానికి ఈ రెండు పత్రికలు కొంతకాలం పరస్పరం కత్తులు దూసుకునేవి.) నయీం పెరుగుదలకు సంబంధించి కట్టామీఠాలో సమైక్య రాష్ట్ర దశను వివరంగా విమర్శిస్తే కొత్త పలుకులో నయీంపై చర్చకు దారితీసిన పరిస్థితులను పేర్లను పోలీసు వ్యవస్థ అంతర్గత అంశాలనూ ప్రస్తావించారు. ఏమైనా నయీంను ఎనౌకౌంటర్‌ చేయడం ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఘన విజయంగా అందుకు ప్రజలు హారతులు పడుతున్నట్టుగా రాశారు. హైదరాబాదులో రౌడీయిజం వేరైనట్టు, కోస్తాజిల్లాలలోనే మాఫియా తరహా వున్నట్టు ఆర్కే విశ్లేషించారు. వాస్తవం చెప్పాలంటే మహానగరంలో మాపియాలకు వుండాల్సిన లక్షణాలు ఇక్కడా వున్నాయి దాదాలు పహిల్వాన్లు ప్రజా ప్రతినిధులు కావడం చాలా ముందే మొదలైంది. అదలా వుంచితే ఆంధ్రజ్యోతిలోనే వార్తగా ప్రత్యేకంగా ఇచ్చిన సోరాబుద్దీన్‌ ఎనౌకౌంటర్‌ గురించిన ప్రస్తావన లేదు. ఉమా మాధవరెడ్డి దినేష్‌ రెడ్డి వంటివారి ప్రతిస్పందనలూ ఉభయులూ పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చాక కూడా ప్రజా ప్రతినిధులూ మంత్రులూ గగ్గోలు పెడితే తప్ప జోక్యం చేసుకోని ఆలస్యానికి అలసత్వానికి కారణాలేమిటనే ప్రశ్నలు లేవు. వాస్తవం చెప్పాలంటే ఈ విషయంలో నమస్తేలో వ్యాఖ్యానమే కాస్త ముక్తసరిగా వుంది. కొత్తపలుకులో కొత్త పొగడ్దలు పెరిగాయనిపించింది. ప్రత్యేకహౌదా విషయంలోనూ వుండాల్సినంత విమర్శ కొరవడుతున్నది. తెలుగుదేశం వైఖరికి లేని పదును ఆపాదించే వార్తలు కాస్త తేలిపోతున్నాయి.మల్లన్న సాగర్‌ విషయంలోనూ ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు సర్దుబాటు ప్రయత్నాల వార్తలకు ఆంధ్రజ్యోతి నమస్తే కన్నా ముందుగా అధికంగా ప్రచారమిస్తున్నది. దీనికి కొంత నేపథ్యముంది గాని అదిక్కడ అనవసరంఅన్ని అభిప్రాయాలకూ వేదికగా ఆంధ్రజ్యోతికి ఒక ప్రత్యేకత పాటిస్తుందనే పేరుంది.నేనూ ఆంధ్రజ్యోతిలో దీర్ఘకాలంగా కాలమిస్టునే.ఆర్కే విమర్శించడానికి విమర్శలు స్వీకరించడానికి వెనుకాడరు గనక ఇలా రాస్తున్నాను. ఇప్పటికే చప్పబడిన అగ్ర తెలుగు పత్రిక తరహాలో మూడు ప్రభుత్వాలనూ కాచుకోవడం కర్తవ్యమైతే పాఠకులలో దమ్ము ఇమేజ్‌ దెబ్బతింటుందేమో ఆలోచించాలి మరి! అంతకంటే కూడా కొన్ని సత్యాలు మరుగునపడిపోతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *