ఎవరి డైలాగులు వారికే!
గోరక్షణ పేరిట దళితులపై దాడులు వద్దని ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాదులో చేసిన హితబోధ ఎవరిని ఉద్దేశించిందో స్పష్టం చేయలేదు. ఆయన మాటలను బలపరుస్తూనే ఇదేదో తమకు సంబంధం లేని వారి పని అన్నట్టు ఆరెస్సెస్ ప్రతినిధి భయ్యాజీ జోషి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈలోగా ఆంధ్ర ప్రదేశ్‌లోని అమలాపురంతో సహా అనేక చోట్ల కొత్తగా దాడులు జరగడంతో ఈ హితబోధ లాంఛనమేనని తెలిసిపోయింది. ఈలోగా విహెచ్‌పి నేత ప్రవీణ్ తోగాడియా మోడీ వ్యాఖ్యలపై తీవ్రంగా ధ్వజమెత్తినట్టు వార్తలు వచ్చాయి. ఈ సమస్యపై సంఘ పరివార్‌లో అంతర్గత విభేదాలు నెలకొన్నట్టు ఇంగ్లీషు పత్రికలు ప్రముఖంగా శీర్షికనిచ్చాయి. అయితే గతాన్ని గుర్తు చేసుకుంటే ఇదంతా పరివార్‌కు అలవాటైన ప్రహసనమని స్పష్టమై పోతుంది. ఆరెస్సెస్ శతకంఠాల గురించి అందరికీ తెలుసు. అందులో ఎవరికి ఇచ్చిన పాత్ర వారు పోషిస్తుంటారు. భిన్న సంకేతాలతో ప్రజలను గందరగోళ పరుస్తూ తమ పని తాము కానిస్తుంటారు. ఎజినూరాని ఆరెస్సెస్ బిజెపిపై రాసిన పుస్తకానికి పని విభజన(డివిజన్ ఆఫ్ వర్క్) అని ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఈ క్రమంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలకు తోగాడియా పేరు మోశారు. అయితే ఆ మాటలు ఆయన వ్యక్తిగతమైనవి అనుకుంటే పోరబాటే. మూలవిరాట్టులు తనకిచ్చిన పాత్రనే ఆయన పోషిస్తుంటారు. అనుయాయులకు అఘాయిత్యాలు అపవద్దని సందేశం పంపిస్తారన్నమాట. మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి దీనిపై ఒకసారి తమాషాగా విశ్లేషణ చేశారు.బిజెపి ఆరెస్సెస్ కూటమిలో ఎవరు మధ్యేవాదులనేది మారుతుంటుంది. అద్వానీతో పోలిస్తే వాజ్‌పేయి మధ్యేవాది. తోగాడియాతో పోలిస్తే మోడీ మధ్యేవాది. మోడీతో పోలిస్తే ఉమా భారతి మధ్యేవాది. ఇలా సరిపెట్టుకునేలా చేస్తుంటారు. కనక విహెచ్‌పి నేత మాటలు సంఘాత్మను ప్రతిబింబిస్తున్నాయని తెలుసుకోవడం శ్రేయస్కరం. ఆ సంగతి తెలుసు గనకే గుజరాత్‌లోని ఉన్‌కు దళితులు తలపెట్టిన మార్చ్ యథాతథంగా కొనసాగుతున్నది.