మోడీ,కెసిఆర్‌కు లేని అభ్యంతరం చంద్రబాబుకా?

naidu-modi-kcr
అధికారంలో వున్న వారు కీలక విషయాల్లో ప్రతిపక్షాలను కూడా విశ్వాసంలోకి తీసుకోవడం ప్రజాస్వామ్యంలో ప్రాథమిక సూత్రం. అందులోనూ అసాధారణ సమస్యలు ఎదురైనప్పుడు తమ మధ్య గాక మూడో పక్షం విషయంలో సమస్య ఎదురైనప్పుడు అందరూ కూచుని ఏం చేయాలని అనుకోవడం కద్దు. దీర్ఘకాలిక ప్రభావం చూపే నూతన నిర్ణయాలపై కూడా అలాగే అభిప్రాయాలు తెలుసుకుని అడుగు వేయడం పరస్పర ప్రయోజనకరంగా వుంటుంది. ప్రజలకూ స్పష్టత వస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు ఉద్రిక్తంగా వున్న  కాశ్మీర్‌సమస్య తీసుకుంటే కేంద్ర వైఖరిపై చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పటికి అక్కడ కర్ఫ్యూలు కాల్పులు కొనసాగుతూనే వున్నాయి. పార్లమెంటులోనూ వివరమైన చర్చ జరిగింది. ఆ సందర్భంగా అన్ని పార్టీలూ విమర్శలతో పాటు అభిప్రాయాలు చెప్పే అవకాశం కలిగింది. అయినా సరే సభ వెలుపల మరోసారి అఖిలపక్ష సమావేశం కూడా జరిపి సూచనలు సలహాలు తీసుకున్నారు. టెర్రరిజం విషయంలో రాజీ పడేది లేదని ప్రధాని ఎప్పటి మాటే చెప్పినా అందరితో చర్చించినట్టయింది. తెలంగాణలోనూ చాలా ముఖ్యమైన పాలనా నిర్ణయంగా జిల్లాల విభజన విషయంలో అందరి అభిప్రాయాల సేకరణ కార్యక్రమం జరుగుతున్నది. ఆగష్టు 18న అఖిలపక్ష సమావేశం జరిపి దసరా నాటికి తుది నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రకటించారు. ఇదే కోవలో చూస్తే ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా గడ్డుసవాలుగా మారింది. హామీనిచ్చిన హౌదా నిరాకరణపై తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. అన్నిపార్టీలూ హౌదా విషయంలో ఇచ్చిన హామీకి కేంద్రం కట్టుబడివుండాలని అన్ని పార్టీలూ కోరుతున్నాయి. దీనిపై అఖిలపక్ష సమావేశం జరపాలని కూడా నిరంతరం సూచనలు వస్తున్నాయి. కేంద్రం మొదట కాదని తర్వాత ఏదో పరిశీలన చేస్తానంటున్నది. నిజంగా ఏం జరుగుతున్నదనేదానిపై చాలా సందేహాలున్నాయి. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం అందరితో చర్చించేందుకు నిరాకరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మోడీ కెసిఆర్‌లు ప్రదర్శించిన వాస్తవిక కోణంలో అనుభవజ్ఞుడైన చంద్రబాబు ఎందుకు ఆలోచించడం లేదో అర్థం కాదు.ఛానళ్లలో చర్చలకు వచ్చే చాలామంది తెలుగుదేశం నేతలు కూడా అఖిలపక్షం జరిపితే బావుంటుందనే అంటుంటారు. ఒకరిద్దరు మంత్రులు కూడా అన్నారు. అయితే అక్కడ వైసీపీనేత జగన్‌ హాజరు కావడంలేదా ఆ పార్టీకి ప్రాధాన్యత లభించడం ముఖ్యమంత్రి అనుమతించదలచుకోలేదట. అందుకే ఇంతవరకూ రాజధానితో సహా ఏ సమస్యపైనా అఖిలపక్షం జరపలేదు. శాసనసభలో ప్రాతనిధ్యం లేని వారితో చర్చ అవసరం లేదన్న వైఖరి చంద్రబాబు గతంలోనూ తీసుకున్నారు. వున్న వైసీపీకి టీడీపీకి పడదు గనకనే ఈ ప్రతిష్టంభన. జాతీయంగా అందరి సహాయం అవసరమైనప్పుడు రాష్ట్రాలలో వాటి శాఖలను విశ్వాసంలోకి తీసుకోవద్దా? అఖిలపక్షంలో అధికార పార్టీకి సమన్వయ బాధ్యత వుంటుంది గాని ప్రతిపక్షం అభిప్రాయం చెప్పడం తప్ప చేయగలిగింది ఏముంటుంది? ఒకవేళ వారి సూచన మేరకు ఢిల్లీకి ప్రతినిధి బృందాన్ని తీసుకుపోయినా తన ఆధ్వర్యంలో తప్ప మరొకరికి పైచేయి ఎలా వస్తుంది? ఎందుకని చంద్రబాబు ఇందుకు నిరాకరిస్తున్నారు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *