మోడీ దళిత గీతకు రివర్స్ ఎఫెక్ట్
దళితులపై దాడులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ తన టౌన్‌హాల్ ప్రసంగంలోనూ తర్వాత హైదరాబాదులోనూ నాటకీయమైన వ్యాఖ్యలు చేశారు. కావాలంటే నన్ను కాల్చండి, దళితులపై కాదని ప్రకటించారు. హిందూత్వ సంస్థ ల ప్రతినిధులే గోరక్షణ పేరిట సాటి మనుషులను మరీ ముఖ్యంగా దళితులను హింసిస్తుంటే మరెవరో దానికి కారణమైనట్టు హితబోధలు చేశారు. ఆయన మాట్లాడిన తరుణంలోనే ఆరెస్సెస్ ప్రతినిధి భయ్యాజీ జోషి కూడా ఈ దాడులు చేస్తున్నవారు సంఘ వ్యతిరేక శక్తులంటూ కొత్త వాదన వినిపించారు. అంతేగాని రెచ్చిపోయిన తమ వారి చేతలపై ఆత్మ విమర్శ చేసుకోలేదు. గుజరాత్‌లోని ఉన్‌లో చనిపోయిన ఆవు చర్మం వలుస్తున్న దళితులపై దాడి గురించి మనం ముందే చెప్పుకున్నాం. ఆ తర్వాతనే బిజెపి ఇరకాటంలో పడి ప్రధాని ఏదోఒక రూపంలో ఖండించాల్సి వచ్చింది. విచిత్రమేమంటే అదే గుజరాత్ ముఖ్యమంత్రి విజరురూపాని మాత్రం ఇదంతా రాజకీయ ప్రత్యర్థుల ప్రచారమని కొట్టిపారేశారు. రాజకీయ ప్రాబల్యం గల పటేళ్ల సమస్యపై చాలా జాగ్రత్తగా మాట్లాడారు గాని దళితుల సమస్యను తేల్చిపారేశారు. బిఎస్‌పి వారంతా తమ పార్టీలోకివచ్చేశారు గనక యుపిలోనూ గెలవడం ఖాయమని ఎన్నికల లెక్కలు చెప్పారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజదానిలో మోడీ ఈ మాటలు చెప్పిన ఫలితమా అన్నట్టు ఆ మరుసటిరోజునే అమలాపురంలో దళితులపై దారుణమైన దౌర్జన్యానికి పాల్పడ్డారు. అన్నిటినీ మించి లోక్‌సభ చర్చలో హౌం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా దళిత సమస్యను రాజకీయం చేయొద్దని విరుచుకుపడ్డారు. కాబట్టి మోడీ బృందం దళితులపై మాట్లాడిన వన్నీ ఇతరులను విమర్శించడానికి తప్ప తమ వారికి కాదని తేలిపోయింది. హెచ్‌సియులో రోహిత్ ఆత్మాహుతితో మొదలు పెట్టి అమలాపురం ఘటన వరకూ మోడీ సభ నుంచి లోక్‌సభ వరకూ జరుగుతున్నది చూస్తుంటే అలాగే అనుకోవలసి వస్తుంది మరి!
