అగ్రతారలకే అమెరికా అవమానాలు
బాలివుడ్ బాద్‌షాగా పేరు పొందిన షారుక్ ఖాన్‌ను లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో అకారణంగా నిర్బంధించడంపై దక్షిణాసియా బాధ్యురాలు నిశా బిస్వాస్ విచారం వెలిబుచ్చారు.అమెరికా రాయబారి రిచర్డ్స్, క్షమాపణలు కూడా చెప్పారు. భవిష్యత్తులో ఇలాటివి జరగకుండా చూస్తామని హామీ నిచ్చారు. షారుక్ ఖాన్ స్వయంగా దీనిపై తన బాధను ట్విట్టర్‌లో పంచుకున్నారు. కోట్లమందికి ఆరాధ్యులైన మీ పట్ట అనుచితంగా ప్రవర్తించడం సరికాదని రిచర్డ్స్ అంటున్నారు గాని ఇలా జరగడం ఇదే మొదటి సారి కాదుకదా! 2012లో , 2009లో కూడా షారుక్‌ను ఇలాగే నిలిపివేశారు. పేరులో ఖాన్ వున్న బాలివుడ్ నటులు కబీర్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్ వంటి వారందరికీ ఈ సమస్య తప్పలేదు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్, బిజెపి కురువృద్ధుడు ఎల్‌కెఅద్తానీ(అప్పుడాయన ఉపప్రదాని కూడా) మాజీ రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ వంటివారంతా ఈ నరకం చవి చూసినవారే. అక్కడ రాయబారిగా నియమితురాలైన నిరుపమా రావు చీర కట్టుకుందని ప్రత్యేకంగా తనిఖీ చేయాలని నిలిపేసిన ఉదంతం మర్చిపోలేనిది.మరోసారి అక్కడ పనిచేస్తున్న కోబ్రగాడేను ఏదో చిన్న ఆరోపణపై వేధించిన తీరు తీవ్ర వివాదమైంది. నిజానికి సిక్కులనూ ఇతరులనూ కూడా ఇలాగే అతిగా తనిఖీ చేసి ఆపేస్తుంటారు. అయితే అద్వానీ జార్జి వంటివారే తమపై జరిగిన ఘటనలను తక్కువ చేసి చెప్పారంటే మిగిలిన వారిని ఏమనగలం? షారుక్‌ను చాలా అభిమానించే నటుడు కమల్‌హాసన్ ఈ వుదంతాన్ని తాను పెద్ద తీవ్రంగా తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. తన పేరు కూడా ముస్లిం పేరులాగా వున్నందువల్ల కెనడాలో చాలా ప్రశ్నలతో సతాయించినట్టు చెప్పారు. ఆ మాటకొస్తే రెండు సార్లు అద్యక్షుడుగా చేస్తున్న బారక్ ఒబామా పేరు ముస్లిం పేరులాగా లేదా? బిన్‌లాడెన్ పేరుతో బారక్ ఒబామా అన్న పేరు దగ్గరగా వుండటం ప్రచారానికి కలసి వచ్చేఅంశమని అప్పుడు చెప్పారు. ఇంతకంటే ద్వంద్దనీతి ఏముంటుంది? ప్రతిఏటా ఆగష్టు 15 ముందు భారతీయ సెలబ్రటీలు అమెరికా ఎక్కువగా వెళుతుంటారట. ఈసారి ఐరాస ఎంఎస్ సుబ్బలక్ష్మి పేరిట ఏఆర్ రహ్మాన్ సంగీత కార్యక్రమం ఏర్పాటు చేసింది. ప్రత్యేక స్టాంపు కూడా విడుదల చేస్తున్నది.చాలామంది దానికోసం వెళుతున్నారు. కనుక ఇలాటి అనుభవాలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఈ మధ్యనే ప్రధాని మోడీ అమెరికా యాత్ర సందర్భంలో 2000 మంది భారతీయ ప్రముఖులను విమనాశ్రయాలలో వేధించకుండా ఒక ఒప్పందం అనుకున్నారట. అయితే అది అమలులోకి రావడానికి మరో పదకొండు నెలలు పడుతుందట. అయినా అవమానాలు ఆగుతాయన్న హామీ లేదు. ఆత్మగౌరవంతో మనం మాట్లాడలేనప్పుడు అమెరికా మాత్రం ఎందుకు ఖాతరు చేస్తుంది?
