కుబేరుల కోసమే కేంద్ర రాష్ట్రాల్లో కొత్త శాసనాలు
జిఎస్‌టి బిల్లును పార్లమెంటు ఆమోదించడం విప్లవాత్మక పన్నుల సంస్కరణ అని ఆకాశానికెత్తుతున్నారు. గత ఆరు మాసాలుగా ఈ బిల్లును రాజ్యసభలో ఆమోదింపజేసుకోవడమే ఎజెండాగా మోడి ప్రభుత్వం పని చేసింది. కాంగ్రెస్ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు చాలాకాలం అభిప్రాయం కలిగించింది. ఆ పార్టీని అనుకూలంగా మలుచుకోవడంపైనే మోడి ప్రభుత్వం కేంద్రీకరించింది. ఆ మేరకు మిగిలిన పార్టీలను, రాష్ట్ర ప్రభుత్వాలను ఖతరు చేయలేదనే విమర్శ కూడా వామపక్షాలు చేశాయి. అయినా ఆ రెండు పార్టీలు జిఎస్‌టిని గట్టెక్కించడానికే పనిచేశాయి. సమావేశాలకు ముందు నేషనల్ హెరాల్డ్, అగస్టా కుంభకోణం వంటి దుమారం రేగిన సమావేశాల్లో అవన్నీ పక్కకుపోయాయి. ఎప్పుడు దేనిపై రభస చేయాలో లేక పక్కనబెట్టాలో పాలకపక్షాలకు పూర్తి అవగాహన ఉంటుందని అర్థం చేసుకోవాలి. పార్లమెంట్‌లో జిఎస్‌టికి అన్ని పక్షాలు ఆమోదం తెలిపాయని అంటున్నా ప్రధాన బాధ్యత ఈ రెండు పార్టీలదే. కాంగ్రెస్ రూపొందించిన బిల్లును బిజెపి పూర్తి చేసింది. అప్పుడు వారు ప్రతిపక్షంలో ఉండి వ్యతిరేకిస్తే ఇప్పుడు వీరు కొన్ని అభ్యంతరాలు చెప్పి సర్ధుకున్నారు. జిఎస్‌టి సత్వర అమలును దేశవిదేశీ కార్పొరేట్లు బలంగా కోరుకోవడం ఇందుకు ఏకైక కారణం. ఇంతచేసి ఇప్పుడు ఆమోదించింది 122 వ రాజ్యాంగ సవరణ మాత్రమే. దీన్ని దేశంలో సగం రాష్ట్రాల శాసనసభలు బలపర్చాలి. తర్వాత జిఎస్‌టి యంత్రాంగం ఏర్పడాలి. పన్ను రేట్లపై అంగీకారం కుదరాలి. వాటికి మళ్లీ ఆమోదం తీసుకోవాలి. ఇటీవల ప్రతిదీ ద్రవ్యబిల్లు అంటూ దాటవేస్తున్న కేంద్రం ఆ ఎత్తుగడను దీనికి అన్వయించరాదని రాజ్యసభ సభ్యులు గట్టిగా కోరారు. దీనిపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టమైన హామి ఇవ్వకుండా దాటవేశారు. అయినా సరే కేంద్రం ఏకపక్షంగా అధిక పన్నురేట్లు నిర్ణయించేట్లయితే మళ్లీ దుమారం తప్పకపోవచ్చు. జిఎస్‌టి వల్ల జిడిపి 2శాతం పెరుగుతుందనే జైట్లీ అంచనా ఆధారంలేనిదే. ఉత్పత్తి, మార్కెట్‌ని బట్టి జిడిపి పెరుగుతుంది కానీ పన్ను రేట్లు బట్టీ కాదు. అదే నిజమైతే అమెరికాతో సహా చాలా దేశాలు ఎప్పుడో దీన్ని అమలు చేసి ఉండేది. అక్కడ సంయుక్త రాష్ట్రాలన్నీ వేర్వేరు సుంకాలనే అమలు చేస్తున్నాయి. యూరోపియన్ యూనియన్‌లో కూడా ఈ ప్రయోగం విఫలమైంది కనుకే బ్రెగ్జిట్ వంటి పరిణామాలు చూశాం.
ఆచరణాత్మక సమస్యలు
ఒకే దేశం, ఒకే పన్ను అన్న మాట వినడానికి బావుంది కానీ రాజ్యాంగరీత్య దేశం అనేక రాష్ట్రాల సముదాయం వాటి ఆదాయ వ్యయాలు, ప్రకృతి వనరులు, రాకపోకలు అన్నీ భిన్నంగా ఉంటాయి. తమ అవసరాల మేరకు ఆదాయం పెంచుకోవడానికి హేతుబద్ధమైన పన్నులు వేసుకునే హక్కు రాష్ట్రాలకు లేకుండా పోతే ఏమవుతుంది? ప్రజావసరాలు ప్రధానంగా రాష్ట్రాలే తీర్చాల్సి ఉంటుంది. వస్తువులు సేవల పన్ను ముందే నిర్ణయం చేస్తే వాటికి కలిగే నష్టాన్ని తట్టుకోవడం కష్టమవుతుంది. మొదటి దశలో ఈ లోటును తాము భర్తీ చేస్తామని కేంద్రం అంటున్నా దాన్ని ఎంతవరకు విశ్వసించాలో తెలియని పరిస్థితి. పైగా ఆదాయపు లోటు ఎంత ఉంటుందనేది కూడా ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. అందుకే ఆచరణలో ఇది సమస్యాత్మకంగా మారే సుదీర్ఘ ప్రక్రియ. కేంద్రానికి స్థిర ఆదాయం, కార్పొరేట్లకు ఒకే విధమైన పన్ను లెక్క ఉండడం మినహాయిస్తే ప్రజలకు, వినియోగదారులకు ప్రయోజనం శూన్యం. ఆవిధంగా ఆర్థికమంత్రి కూడా చెప్పింది లేదు. కాకపోతే ప్రచార విలువ తెలిసిన నరేంద్ర మోడి మాత్రం దీనివల్ల సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందని లోక్‌సభలో చెప్పడం విశేషం. 4 వేల కోట్లకు పైగా నష్టం కలుగుతుందని ఆంధ్ర ప్రదేశ్ , 7 వేల కోట్లు ఆదాయం తగ్గుతుందని తెలంగాణ ప్రకటించాయి. అసలు రాష్ట్రాలకు ఆదాయ భర్తీ ఎలా జరుగుతుందో అయోమయంగా ఉంటే ప్రజలకు భారం తగ్గుతుందని ప్రధాని పేర్కొనడం విడ్డూరమే. వామపక్షాలు కూడా బలపర్చాయి కదా అంటే మిగిలిన తతంగం పూర్తయ్యేలోగా న్యాయం కోసం పోరాడాలన్న లక్ష్మాన్ని ప్రకటించాయి. జిఎస్‌టిపై రాజ్యాంగ సవరణ మాత్రమే జరిగితే అంతా అయిపోయినట్టు హడావుడి చేయడాన్ని సీతారాం ఏచూరి విమర్వించారు. కేరళ త్రిపుర ప్రభుత్వాలు తమ అభ్యంతరాలతో లేఖలు రాశాయి. జిఎస్‌టి మౌలిక రేటు 18శాతం అంటున్నప్పటికీ అంతకంటే ఎక్కువగా 23-26 శాతం వరకు ఉండే అవకాశం ఎక్కువ. పైగా ఎప్పటికప్పుడు దాన్ని మార్చబోరని హామి లేదు. జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకుంటున్నప్పటికీ కార్పొరేటు సరళీకరణ బాటలో ప్రయాణించే ప్రభుత్వాలు ప్రజల కోణంలో ఆలోచించడం ఊహకందని విషయం.
రాష్ట్రాలలో మరిన్ని దుశ్సాసనాలు
ఒక జిఎస్‌టి బిల్లు మాత్రమే కాక చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి బిల్లులే ఆమోదించడం వెనుక కచ్చితమైన కార్పొరేటు ఒత్తిడిలున్నాయి. ఈ చర్యల ద్వారా మోడి ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలకు పూర్తిగా కట్టుబడి ఉందని రుజువవుతున్నట్లు అమెరికా- ఇండియా విధాన అంశాల అధ్యయన కేంద్రం ప్రతినిధి రిచర్డ్ ఎం రోసో వ్యాఖ్యానించారు. రాష్ట్రాలను కూడా రంగంలోకి దించకపోతే సరళీకరణ పూర్తి కాదని అంటారు. 1997, 1999 సంవత్సరాల్లో ఈ దిశగా చర్యలు తీసుకున్నా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు, కర్నాటకలో ఎస్‌ఎం కృష్ణ ( కేంద్రంలో వాజ్‌పారు) వంటి వారు ఓడిపోవడం వల్ల ఆ క్రమం వెనక్కు పోయిందట. ఆ రీత్యా మోడి ప్రభుత్వం ఏం చేస్తుందోనని సందేహాలు ఉన్నా ఆచరణలో అవన్నీ తొలగిపోయాయని రిచర్డ్ కితాబు ఇచ్చారు. రాష్ట్రాలు వ్యాపార సంస్కరణలు ఏ మేరకు అమలు చేస్తున్నాయో సమీక్షించేందుకై 98 అంశాలతో కూడిన ప్రశ్నావళి ఇందులో ముఖ్యమైంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ( సులభంగా వ్యాపారం) అంచనాలలో ముందుండాలని రాష్ట్రాలు పోటీ పడే పరిస్థితి ఏర్పడింది. వీటిని ఆయా ప్రభుత్వాలు బాగా ఉపయోగించుకుంటున్నాయని ఆయన మెచ్చుకుంటారు. విద్యుత్ రంగంలో వాణిజ్యకరణకు పట్టం కట్టే ఉదరు పథకం , ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీటి అయోగ్ తీసుకురావడం చాలా కీలక సంస్కరణలుగా అమెరికా భావిస్తున్నది. అయితే ఇండియా రాష్ట్రాల సమస్య గనుక అక్కడ కూడా ఇలాంటి శాసనాలు చేయించేందుకే మోడి ‘సహకార, పోటీ సమాఖ్య విధానం ‘ అనే మంత్రం జపిస్తున్నారని ఈ వ్యాసం చూశాక స్పష్టమవుతుంది. తన వాదనకు మద్దతుగా రిచర్డ్ అనేక రాష్ట్ర స్థాయి సంస్కరణలను ప్రస్థావించారు.
్న 2016 గుజరాత్ భూసేకరణ చట్టం సామాజిక ప్రభావం అంచనాను, మరికొన్ని పునరావస పథకాలను తొలగించింది.
్న 2016 మహారాష్ట్ర భూ రెవెన్యూ నిబంధనలు ప్రభుత్వ భూములను లీజుకు ఇవ్వడం గాక మొత్తంగా తెగనమ్మే వీలు కల్పించాయి.
్న 2015 మహారాష్ట్ర గుంత్వేరి చట్టం చిన్నతరహా ప్లాట్లను కూడా విభజించి అమ్ముకునే అవకాశమిచ్చింది.
్న 2015 ఆంధ్రప్రదేశ్ బిల్లు ప్రయివేటు సంస్థలకు ప్రభుత్వ భూముల లీజు వ్యవధిని 33 ఏళ్ల నుంచి 99 ఏళ్ల వరకు పెంచింది.
్న 2016 రాజస్థాన్ పట్టణ భూ బిల్లు కొనుగోలుదారులకు టైటిల్ డిడ్ గ్యారెంటీ చేసింది.
్న 2016 యూపి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టార్టప్ విధానం ప్రకారం కార్యాలయాల కోసం తీసుకున్న భూములపై పన్నులను, విద్యుత్ చార్జీలను ఐదేళ్ల పాటు మినహాయించింది.
్న 2015 యూపి రెవెన్యూ నిబంధనల సవరణ ఆర్డినెన్స్ 3.5 ఎకరాలలోపు భూమి కలిగిన దళితుల నుంచి కూడా భూములు కొనుక్కునేందుకు అనుమతినిచ్చింది.
్న 2015 గుజరాత్ కార్మిక చట్టం సమ్మెలు చేయడాన్ని జఠిలం చేసింది. కాంట్రాక్టు ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం ఒత్తిడి చేసే అవకాశాలను కుదించివేసింది.
్న 2016 కర్నాటక చిల్లర వాణిజ్య విధానం షాపులు రాత్రి వేళ కూడా తెరచి ఉంచడానికి ఎక్కువ స్టాక్ పెట్టుకోవడానికి అనుమతిచ్చింది. మహిళలతో రాత్రి వేళ కూడా పనిచేయించుకోవచ్చని ప్రకటించింది.
ఇవి చాలా గొప్ప మార్పు అని ఇలాంటివే ఇతర చోట్ల కూడా శాసనాలుగా రావాలని అమెరికా ప్రతినిధి హితబోధ చేస్తున్నారు. నిజానికి ఆయన ప్రస్థావించన మరింత కర్కష శాసనాలు కూడా మనకు తెలుసు. ఎపిలో భూ సమీకరణ తెలంగాణలో 123 వివాదం నడుస్తూనే వుంది. మొత్తంపైన చెప్పాలంటే జిఎస్‌టి బిల్లు నుంచి రాష్ట్రాల శాసనాల వరకు అన్నీ వ్యాపార, పారిశ్రామిక , కుబేరుల కోణం నుంచి తప్ప ప్రజల కోణం ముఖ్యం కాదని స్పష్టమవుతోంది. సులభ వ్యాపారం బదులు సులభ జీవితం కల్పించడం గురించి పాలకులు ఆలోచిస్తారా?
