ఎపి ఓటింగుకు ఎగనామం- పుండుమీద కారం
అనుకున్నట్టుగానే ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హౌదా బిల్లుపై ఓటింగుకు అవకాశం లేదని అధికార పక్షం అడ్డుపడి ఆపేసింది. రాజ్యాంగం 110,168 అధికరణాల ప్రకారం ద్రవ్య బిల్లును రాజ్యసభలో ఓటింగుకు పెట్టకూడదని సభా నాయకుడు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సుదీర్ఘ వాదనలు చేశారు. ఒకవేళ బిల్లు స్వభావంపై సందేహాలు వస్తే తుది నిర్ణయం తీసుకోవలసింది 168వ అధికరణం ప్రకారం లోక్‌సభ స్పీకర్ తప్ప చైర్మన్‌కు ఏ అధికారం లేదని ఆయన నొక్కి చెప్పారు. ప్రత్యేకహౌదాపై దాటవేత ధోరణి కొనసాగిస్తూనే అన్ని విధాల ఆదుకుంటామని చెప్పామన్న పాత పల్లవి కొనసాగించారు. ఈ నేపథ్యంలో సభలో వాడివేడి వాదోపవాదాలు జరిగాక డిప్యూటీ చైర్మర్ కురియన్ సమస్యను లోక్‌సభ స్పీకర్‌కు నివేదిస్తున్నట్టు రూలింగ్ ఇచ్చారు. సభా నాయకుడే సందేహం లేవనెత్తినప్పుడు రాజ్యాంగ రీత్యానూ సభ రూల్స్ ప్రకారం కూడా చైర్మన్‌కు ఎలాటి అధికారం లేనందున తాను లోక్‌సభ స్పీకర్ అభిప్రాయం తీసుకోవడం తప్ప గత్యంతరం లేదని ఆయన వివరించారు.ఈ రూలింగ్‌తో విభేదించిన ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. రభస మధ్యనే మరో సభ్యుడి బిల్లుకు కురియన్ అవకాశమిచ్చారు. ఇది మనీ బిల్లు అవునా కాదా అనే అంశంపై చర్చ జరిగినప్పుడు కాంగ్రెస్ సభ్యులు జైరాం రమేష్, కపిల్ సిబాల్, సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరి తదితరులు సభలో ప్రధాని ఇచ్చిన హామీ గనక దాని అమలు పరిచేది లేనిది చెప్పాలని ఇందులో మనీ బిల్లు అవునా కాదా అనే మీమాంస లేదని చెప్పారు. తెలుగుదేశం సభ్యులు చర్చలో పాల్గొనకుండా వుండిపోయారు.బహుశా తమ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటన కారణంగా పాల్గొనలేకపోయామని వారు సమర్థించుకునే అవకాశం వుంది. విభజన చట్టంపై మొన్ననే దీర్ధంగా చర్చించామని కూడా అధికార పక్షం ప్రస్తావించింది. ఇవన్నీ పరిశీలిస్తే వ్యూహాత్మకంగానే చర్చను మరో రూపంలో చేపట్టి ఓటింగు లేకుండా నివారించినట్టు అర్థమవుతుంది. ప్రభుత్వ భాగస్వామిగా వుండి వ్యతిరేకంగా ఓటు వేసే బాధ టిడిపికి తప్పించడానికి మొన్నటి చర్చ ఉపయోగపడిందన్నమాట. ఇది మనీ బిల్లు అని తాము మొదటే చెప్పామంటూ సిఎం రమేష్ పరోక్షంగా ప్రభుత్వ వైఖరిని సమర్థించారు.పైగా ఇదే సమయంలో ప్రధానిని కలవడం వంటి తతంగాల వల్ల రాజ్యసభలో పాలకఫక్షం మొండి వైఖరిపై దృష్టికేంద్రీకరణ లేకుండా పోయింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆనాడు తాను అధికార హౌదాలో చేసిన ప్రకటనలోని హామీలను చదివి వినిపించడం, దాన్ని కాబినెట్ కూడా ఆమోదించిందని చెప్పడం కొసమెరుపు. ఆయన నోరు విప్పాడని గేళి చేసిన తెలుగుదేశం సభ్యులు ఇంతవరకూ నోరు విప్పని ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించకపోవడం విచిత్రం.
