అమిత్ అభీష్టమే రూపాని ఎంపిక-ఆనంది ఆగ్రహం
గుజరాత్ ముఖ్యమంత్రిగా బిజెపి రాష్ట్ర అద్యక్షుడు విజరురూపాని ఎంపిక ఏమాత్రం ఆశ్చర్యం కలిగించదు. కాని మధ్యాహ్నం వరకూ మంత్రి నితిన్ పటేల్ పేరు ఖాయమైనట్టు వార్తలు రావడమే ఆశ్చర్యం. ఆయన అధికార హౌదా వచ్చేసినట్టు విధానపరమైన సంకేతాలు కూడా ఇవ్వడం ప్రారంభించారు. బిజెపి అద్యక్షుడు అమిత్‌షా విధేయుడు రూపాని అందరికీ తెలుసు. చివరకు ఆయననే ఎంపిక చేశారు. ఈ సందర్భంగా దిగిపోతున్న ఆనందిబెన్ పటేల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మొదటి దఫా ఎంఎల్‌ఎ అయిన విజరు రూపానికి ముఖ్యమంత్రి పదవికి అనుభవం అవగాహన చాలవని ఆమె వాదనగా చెబుతున్నారు. ఆమె సమావేశం నుంచి కూడా బయిటకు వచ్చారట. ఇక నితిన్ పటేల్ కూడా తన అయిష్టాన్ని దాచుకోలేదు. ఏం జరిగిందో దేవుడికే తెలుసు అని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. అమిత్ షా చక్రం తిప్పిన తర్వాత రూపాని గాక మరొకరు పీఠం ఎక్కే పరిస్తితే ఇప్పుడు బిజెపిలో లేదు. పైగా ఆయన ఆ రాష్రం నుంచి వచ్చిన వారే.మోడీ సరేసరి. ఉభయుల కోర్కె మేరకే రూపానికి పట్టం కడుతున్నారు. పటేళ్ల ఆందోళన జరుగుతుందగా స్వతహాగా జైన్ అయిన రూపానిని ఎంపిక చేయడంలో తమ మతసామరస్యం వుందని బిజెపి అప్పుడే ప్రచారం ప్రారంభించింది. నిజానకి ఇస్లాం క్రైస్తవం తప్ప మిగిలిన మతాలన్ని హిందూ మతం కిందకే వస్తాయన్నది బిజెపి వాదన.పటేళ్లకు పదవి ఇచ్చినా హార్దిక్ పటేల్ ఆందోళనను సర్దుబాటు చేయలేకపోయారు గనక మరో విధంగా ప్రయత్నం చేయాలని బిజెపి అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు. గతంలో ఇక్కడ తలెత్తిన ముఠాతగాడాలు గుర్తు చేసుకుంటే రూపాని పరిస్థితి కూడా భిన్నంగా వుండకపోవచ్చు.
