గుజరాత్: మూల విరాట్టుకే ముప్పు

గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ రాజీనామా కేవలం ఇటీవలి పటేళ్ల ఆందోళనకు, దళితులపై దాడి ఘటనలకు పరిమితమై చూడటం పాక్షికత్వమే. నరేంద్ర మోడీ నాయకత్వంలో పదేళ్ల తర్వాత బిజెపి దేశాధికారం సంపాదించుకోవడానికీ పునాదిగా నిలిచిన గుజరాత్‌లో గెలుపుపైనే ఆత్మవిశ్వాసం కొరవడిన తీరుకు అది ప్రత్యక్ష నిదర్శనం. మోడీ మహత్తర పాలనలో అపురూపమైన నమూనాగా ప్రచారమైన గుజరాత్- దేశానికే ఆయన ప్రధాని అయిన తర్వాత ఇంత గడ్డు సవాలుగా ఎందుకు మారిందనేది కూడా ఆలోచించాల్సిన విషయం. అయితే షరా మామూలుగా మీడియాలో చర్చను తక్షణ మార్పులుఇటీవలి పరిణామాలకొ పరిమితం చేసి విస్త్రత రాజకీయాంశాలను దాటవేయాలని బిజెపి ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగానే అమిత్ షాను ముఖ్యమంత్రిగా పంపే అవకాశం గురించి కథలు వదలి తర్వాత వాటిని ఖండించి దృష్టి మళ్లిస్తున్నది. .
వరుసదెబ్బలు
ఆనందిబెన్ పటేల్ రాష్ట్ర మంత్రివర్గంలో మోడీ తర్వాతి నేతగా పేరొందిన మహిళ. ఆమెతో పోలిస్తే అమిత్‌షా బాగా జూనియర్. గుజరాత్‌లో క్షత్రియులు పటేళ్ల నమూనాతో అధికారం సంపాదించిన బిజెపి సమీకరణాలకు సరిగ్గా సరిపోయే వ్యక్తి. ఆపైన మొదటి మహిళా ముఖ్యమంత్రి కూడా. అందుకే మోడీ ఢిల్లీ వెళ్లగానే ఇక్కడ ఆమెను అధికార పీఠంపై కూచోబెట్టారు. పైన స్వరాష్ట్రానికి చెందిన ఇద్దరు శక్తివంతులైన అత్యున్నత నాయకులు వున్నప్పుడు ఆమె స్వంతంగా చేయగలిగింది పెద్దగా ఏమీ వుండదు. మోడీని మించి అమిత్ షా అడుగడుగునా జోక్యం చేసుకుంటూ వచ్చారనే అభిప్రాయం వుంది. అయినా ఆమె అడ్డు చెప్పగలిగింది కూడా లేదు. పరిపాలనా పరమైన అవకతవకలకు లోడు ఆమె కుమారుడు కుమార్తె కూడా ఆరోపణలకు గురవడంతో ప్రధాని పిలిపించి మందలించారు. తర్వాత పటేళ్ల ఆందోళన విషయంలో సరిగ్గా వ్యవహరించలేదని, ఇటీవల వున్‌లో దళితులను పరామర్శించడంలోనూ అలసత్వం ప్రదర్శించారని కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. అన్నిటినీ మించి రాజకీయంగా స్తానిక సంస్థల ఎన్నికలలో ఘోర పరాజయం కాంగ్రెస్ కోలుకోవడం పెద్ద ఎదురు దెబ్బగా మారింది. దాదాపు ఎనభై శాతం గ్రామీణ పట్టణ స్థానాలు కాంగ్రెస్ తెచ్చుకోగలిగింది. ఆఖరుకు మోడీ సభలకు కూడా ప్రజలు సరిగ్గా హాజరు కాని స్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆనందిని మాచ్చి మరో కొత్త మొహం తెచ్చుకుంటే తప్ప ఎన్నికలకు ఎదుర్కొలేమని నాయకత్వానికి బోధపడి ఇంటికి పంపిస్తున్నారు. ఆమెకు ఇష్టంలేని విజరు రూపానిని అమిత్ రాష్ట్ర పార్టీ అద్యక్షుడిగా నియమించారు.ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి కూడా ఆయన మొగ్గు అటే వుందంటున్నారు.మరోవైపున నితిన్ పటేల్ కూడా పొంచిచూస్తున్నారు. .వీరిలో ఒకరు కాకుంటే మరొకరు గద్దెక్కవచ్చు. ప్రధాని మోడీ బిజెపి అద్యక్షుడు అమిత్‌షా జోడీ వ్యూహ ప్రతివ్యూహాలు విఫలమై కొత్త నాయకుడిని కొత్త ఎత్తుగడలను అనుసరిస్తే తప్ప పరువు దక్కదనే అభద్రత ఆవరించడం దేశమంతటా బిజెపి భవితపై ప్రభావం చూపే అంశం.
మోడీ మార్కు రాజకీయం
ఇరవయ్యేళ్ల నుంచి ఈ దేశంలో బిజెపిని స్థిరంగా ఎన్నుకుంటున్న రాష్ట్రం గుజరాత్ ఒక్కటే కాంగ్రెస్ బిజెపిలు ముఖాముఖి తలపడే అయిదారు రాష్ట్రాల్లోనూ మిగిలిన చోట్ల ఫలితాలు అటూ ఇటూ అవుతున్నా ఇక్కడ మాత్రం ఎలాటి మార్పులేకుండా బిజెపి పాలన కొనసాగుతూ వస్తోంది. అది వారి ప్రయోగశాల. ఆ పార్టీలో అంతర్గత కలహాలు బాహాటంగా ప్రజ్వరిల్లి కేశూభారు పటేల్ ప్రభుత్వమే కూలిపోయినప్పుడు కూడా కాంగ్రెస్ కోలుకోలేకపోయింది. బిజెపినుంచి వచ్చిన శంకర్ సింగ్ వఘేలా ఇప్పుడు కాంగ్రెస్‌కు నాయకుడుగా వున్నారు.జనతా పార్టీ దేశవ్యాపితంగా రూపుదాల్చి 1977లో విజయం సాధించడానికి రెండేళ్ల ముందే 1975లోనే గుజరాత్‌లో జనతా ఫ్రంట్ ప్రయోగం జరిగింది.యుపి,బీహార్ వంటి చోట్ల జనతా పార్టీ వారసత్వాన్ని ఆలస్యంగానైనా జనతా దళ్,సమాజ్‌వాది,ఆర్జేడీ వంటివి అందిపుచ్చుకోగా గుజరాత్ మాత్రం బిజెపి వశమైంది. ఇందుకోసం ఆ పార్టీ మతతత్వ రాజకీయాలకు తోడు కులాల వారి సమీకరణలను పెంచిపోషించింది.ఆ క్రమంలో కేశూభారు పటేల్ వార్దక్యం ఆసమర్థత వంటి కారణాలు చూపి నరేంద్ర మోడీని ఆరెస్సెస్ దిగుమతి చేసింది. అంతకుముందు బిజెపి ఆరెస్సెస్‌ల మధ్య వున్నగీతను చెరిపేసింది. మొదట వివిధ ముఠాల మధ్య సమన్వయం పేరిట బిజెపి ప్రధాన కార్యదర్శిగా వచ్చిన మోడీ తర్వాత ఎల్‌కె అద్వానీ వంటివారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి కాగలిగారు. గద్దెక్కిన నాటి నుంచి తన పట్టుపెంచుకోవడమే ఏకైక లక్ష్యంగా పనిచేశారు. అందుకోసం ద్విముఖ వ్యూహంతో అటు మతతత్వ రాజకీయాలను ఇటు కార్పొరేట్ సేవలను కూడా తీవ్రస్థాయిలో అమలు చేశారు. 2002 మారణహౌమం పరాకాష్ట. అయినా అప్పుడు కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వమే వుంది గనక అలాగే జరిగిపోయింది.ఒక దశలో వాజ్‌పేయి ఆయన రాజధర్మం పాటించలేదంటూ పదవి నుంచి మార్చడానికి విఫలయత్నం చేశారు. అప్పట్లో అద్వానీయే మోడిని కాపాడారు. ఇంత మారణహౌమం జరిగినా మోడీ ఒక్కటంటే ఒక్క విచారణను కూడా ఎదుర్కొకపోవడం దేశంలో మారిన పరిస్థితులకు ప్రతిబింబం. రాష్ట్రం ఆ మారణహౌమం నుంచి బయిటపడకముందే ఏకపక్షంగా ఎన్నికలు జరిపించి మళ్ల్లీ విజయం సాధించారు మోడీ.అలా వరుసగా మూడుసార్లు గెలుపొందుతూ వచ్చారు.
సర్వం కుబేరార్పణం
మతతత్వం మార్కెట్ తత్వం ప్రపంచీకరణకు రెండు ముఖాలనుకుంటే ఈ రెంటికీ రంగస్థలంగా గుజరాత్‌ను మార్చడం వల్లనే మోడీ కార్పొరేట్లకు ప్రియసఖుడైనారు. వైబ్రంట్ గుజరాత్ పేరిట ఏటేటా భారీ వ్యాపార సమ్మేళనాలు జరిపి వారి కోర్కెలు నెరవేరుస్తూ వచ్చారు. అందుకే రిలయన్స్ అనిల్ అంబానీ ఆయనను గుజరాత్ ఇచ్చిన మరో గాంధీగా వర్ణించారు. వాస్తవానికి మానవాభివృద్ది సూచికల విషయంలో ఆ రాష్ట్రం వెనకబడి పోయింది. పౌష్టికాహార లోపం వెన్నాడుతున్నది.గ్రామీణ ఉపాధి హామీ అమలు లోపభూయిష్టం.పరిశ్రమలకు వ్యాపారాలకు విచ్చలవిడిగా భూములు ఇవ్వడంతో నిరాశ్రయులై బతుకుతెరువులేక 2003-11 16 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మోడీ నిర్వహించిన సదస్సులలో ఎఫ్‌డిఐలు 87,6000చకోట్లు వచ్చాయని ప్రచారం జరిగింది గాని వాస్తవంగా వచ్చింది 2,470 కోట్టు మాత్రమే. 2012-13లో దేశంలో 2.38 శాతం మాత్రమే. పక్కనే వున్న మహారాష్ట్రకు దాదాపు 40 శాతం వరకూ వచ్చాయి. ఈ విషయంలో గుజరాత్‌ది ఆరవస్థానం మాత్రమే. మరోవంక దారిధ్య్రం విషయంలో చాలా వెనకబడిన పరిస్థితి. ఇక పారిశ్రామిక వేత్తలకు వరాల వర్షం. టాటా నానో కంపెనీ 2,900 కోట్లు పెట్టుబడి పెడితే ప్రభుత్వం భూమి తదితర సదుపాయలు కలిగించడమే గాక నామకార్థపు వడ్డీతో 9,500 కోట్ల సొమ్ము సమకూర్చింది. ఇది ఇరవై ఏళ్లలో తీర్చుకుంటే చాలు. మోడీ ప్రియమిత్రుడైన అదానీ గ్రూపునకు విద్యుత్ ప్టాంట్లకు సంబంధించి 25 వేల కోట్లు అందించింది. ఎస్సార్, రిలయన్స్‌లకు కూడా ఇలాటి మేళ్లు జరిగాయి. రేవులు రోడ్లు విద్యుత్ వెంటివన్నీ పూర్తిగా ప్రవేటు పరం చేసింది. ఎవరైనా పరిశ్రVమ పెట్టాలంటే నేరుగా మోడీని కలుసుకోవచ్చని చెప్పేమాట వాస్తవానికి విపరీతమైన కేంద్రీకరణకు సంకేతం. ఈ కారణంగానే గుజరాత్‌లో లోకాయక్త నియామకమే జరగలేదు. కర్ణాటకలో తమ పార్టీ ముఖ్యమంత్రి యెడ్యూరప్పకు పట్టిన గతి చూసిన తర్వాత మోడీ లోకాయుక్త వద్దని నిర్ణయించుకున్నారు. గవర్నర్, హైకోర్టు వెంటపడినా వినలేదు.ఆర్‌టిఐ కింద వివరాలు బయిటకు లాగే వేగులపై దాదులకు గుజరాత్ పేరు మోసింది. దేశ జనాభాలో5 శాతం మాత్రమే వున్న గుజరాత్ వీరి హత్యల విషయంలో 22 శాతం, దాడుల విషయంలో 20 శాతం రికార్డు సాధించింది! తన మాజీ స్నేహితురాలిపై కూడా మోడీ, ఆయన హౌంశాఖ సహాయ మంత్రి అమిత్ షా నిఘా వేసిన ఉదంతం న్యాయస్థానా వరకూ వెళ్లింది. ఇవన్నీ కూడా మోడీ ప్రభుత్వం ఎంత నిరంకుశంగా ఏకపక్షంగా నడిచాయో తెలిపే ఉదాహరణలు. ఇప్పుడంటే ఆయన స్వచ్చ భారత్ అంటూ బహిరంగ మల విసర్జన గురించిన ప్రచారానికి వందల కోట్టు వెచ్చిస్తున్నారు గాని గుజరాత్‌లో ఈ దురవస్త 65 శాతం కుటుంబాలకు వుంది. మాతా శిశుసంరక్షణ కోసం పౌష్టికాహార కల్పనలో వెనకబడిపోయానని ఇటీవలనే ముఖ్యమంత్రి ఆనంది వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. మరుగుదొడ్ల నిర్మాణంలోనూ దేశంలో పదో స్థానంలో వుందని బాధపడ్డారు. నిజానికి ఆమెను బలిపశువును చేశారే తప్ప ఈ వైఫల్యాలు మోడీ పాలనకు కొనసాగింపేనన్నది నిపుణుల అభిప్రాయం. నివేదికలే అందుకు సాక్ష్యం.గుజరాత్ అస్మిత అంటూ వూదరగొట్టిన మోడీ నిజానికి విస్తార జనబాహుళ్లం అభివృద్ధికి చేసింది లేకపోగా కుబేర వర్గాల లాభార్జనకూ కుల మతతత్వాలకు మూలమైనారు. రాష్ట్రం అప్పు మాత్రం మోడీ హయాంలో 45,300 కోట్ల నుంచి 1,38 వేల కోట్లకు పెరిగింది.
ఇప్పుడు మార్చేస్తే చాలా?
దీర్ఘకాలం అధికారంలో వుండటమే కొలబద్ద అయితే పశ్చిమ బెంగాల్ వామపక్ష ప్రభుత్వం, ముఖ్యంగా జ్యోతిబాసు మోడీకన్నా చాలా అధికంగానే వున్నారు. కాని మోడీ విధానాలు మాత్రం సమతులాభివృద్ధికి గాక పేదల జీవితాలు ఆదివాసుల బతుకులు ఫణం పెట్టే ఏకపక్ష పోకడలకు కారణమైనాయి. వాటిని జాతీయంగా అమలు చేయించుకోవడానికి కార్పొరేట్ వర్గాలు వందల కోట్లు ప్రచారానికి వెచ్చింది ఆయనను ప్రధాని పీఠం వరకూ చేర్చాయి. అందుకే వచ్చిన రోజునుంచి ఆ తరగతుల లాభాల పెంపుదలకే ఆరాటపడుతున్నారు. భూ సేకరణ చట్టమైనా కార్మిక ఉద్యోగ భద్రతైనా Êప్రభుత్వ సంస్థల విక్రయమైనా వారి పక్షానే పనిచేస్తున్నారు. దీని ఫలితంగా అనేక చోట్ల పార్లమెంటు ఫలితాల నాటి ఓటింగు తగ్గిపోతున్నది. ఇక మొడటినుంచి ఈ కోవలో నడుస్తున్న గుజరాత్ సంగతి చెప్పేదేముంది? అక్కడ గనక ఓటమి పాలైతే మిగిలిన దేశంలో మొహం చెల్లే పరిస్థితి వుండదు. గుజరాత్‌లో దళిత వ్యతిరేక పోకడల వల్ల కలిగిన అపఖ్యాతి వారు మరింత అధిక శాతం వున్న యుపిపై పడుతుంది. గుజరాత్‌లో దళిత జనాభా 7 శాతం కాగా యుపిలో 20.5శాతం. పైగా అక్కడ మాయావతి ఒక ప్రధాన ప్రత్యర్థి. గోరక్షణ రాజకీయాలు మిగిలిన చోట్ల ఫర్వాలేదు గాని స్వంత గడ్డపై తలెత్తేసరికి మోడీ బృందం కంగుతినాల్సి వచ్చింది. అందుకే ఆనందిబెన్‌ను తప్పించి మరెవరినైనా ముందుంచుకుంటే కొంతలో కొంత మేలని మోడీ అమిత్ షా వ్యూహం. 2002 ఘటనల తర్వాత గుజరాత్‌లో ఎలాటి మత ఘర్షణలు లేవన్న కబుర్లు కూడా నిజం కాదు. మతపరమైన ఘటనలు జాతీయ సగటు కన్నా గుజరాత్‌లో 70శాతం ఎక్కువగానూ , ఈ ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 82 శాతం ఎక్కువగానూ వుందని లెక్కలు చెబుతున్నాయి.ఇప్పుడు దానికి దళితులపై దాడులు తోడవుతున్నాయి.కనుక చివరి నిముషంలో ముఖ్యమంత్రిని మార్చినంత మాత్రాన ఇన్నేళ బిజెపి పాలన పరిణామాలన్నీ మరుగునపడిపోతాయా?
నవతెలంగాణ, జులై5,2016