అమరావతి చందరగోళం సింగపూర్ ి ఎకరా 4 కోట్లు, రైేతుల ఎకరా 5 లక్షలు
రాజధాని అమరావతి భూ సేకరణ ప్రహసనం కొత్త మలుపులు తిరుగుతున్నది. గతంలో భూ సమీకరణకోసం ప్రత్యేక చట్టం చేసిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ భూ సేకరణ ఎలా చేస్తుందని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అది అమల్లో వున్నంత వరకూ మరో చట్టం తీసుకురావడం కుదరదంటూ న్యాయస్తానంలో సవాలు చేయబోతున్నారు. ప్రధానంగా తాడేపల్లి మంగళగిరి మండలాల్లో 2400 ఎకరాలు సేకరించడానికి ప్రభుత్వం హుకుం జారీ చేసిన నేపథ్యంలో రైతులు కూడా కోర్టులకు వెళుతున్నారు. ఇది ఇలా వుంటే ఉద్దండరాయని పాలెం, లింగాయపాలెం గ్రామాల్లో భూ సేకరణ ప్రహసనం మరో విధంగా ప్రజాగ్రహానికి దారితీస్తున్నది. ప్రభుత్వం తరపున సామాజిక అధ్యయనం నిర్వహించిన సంస్థ అక్కడ భూమి ధర ఎకరాకు అయిదు లక్షలు వున్నట్టు నివేదించింది. సారవంతమైన భూమి అది కూడా రాజధాని ప్రాంతంలో ఇంత తక్కువకు వస్తుందని చెప్పడం సత్యానికి సమాధి చేయడమే. నిజానికి ప్రభుత్వం ఇప్పటికే అక్కడ సమీకరించి సింగపూర్ కన్సార్టియంకు అప్పగించిన భూమి ఎకరాకు నాలుగు కోట్ల రూపాయలు ధర నిర్ణయించారు. ఆ రేటుతో వారు వ్యాపారం చేసుకోవడానికి సిద్ధమైపోయారు. సమీకరణలో భాగంగా తమకు వచ్చిన భూమిని గాని లేక దాంతో నిమిత్తం లేకుండా గాని రైతులు భూములు అమ్ముకోవాలంటే అక్కడ కోటిన్నర, కోటి80 లక్షల వరకూ ధర పలుకుతున్నది. అలాటి చోట కేవలం అయిదు లక్షల పరిహారం ఇచ్చి తీసుకోవాలనుకోవడం ఎంత దారుణమని రైతులు ప్రశ్నిస్తున్నారు.పైగా ఆ భూములను వారు డెవలప్ చేసి లాభాలు పొందడానికి వీలుగా రైతుల క్రయ విక్రయాలపై నిషేధం విధించారు. అసలు స్టార్టప్ క్యాపిటల్ కింద ఎంపిక చేసిన ఉద్దండరాయని పాలం, లింగాయపాలెం అభివృద్ధి కావడానికి ఇరవయ్యేళ్లు పడుతుందని ప్రభుత్వం చెబుతున్నది. ఈ లెక్కనమొత్తం 29 గ్రామాలు అభివృద్ధి కావడానికి అవి విజయవాడ గుంటూరులతో అనుసంధానం కావడానికి మరెంత సమయం పడుతుంది?అప్పటి వరకూ చిన్నాభిన్నమై పోయే జీవితానికి రక్షణ ఎవరు? రైతుల నుంచి సేకరించిన భూమి ఇచ్చి ఇన్ఫ్రా సౌకర్యాల బాధ్యత కల్పించి కూడా ప్రభుత్వం కేవలం 42 శాతం వాటాతో సరిపెట్టుకోవడం ఎలాటి వ్యాపార సూత్రం? అందుకే అమరావతి అంటేనే అనుమానాల పుట్టగా అనౌచిత్యాల నిలయంగా మారిపోతున్నది. తాత్కాలిక సచివాలయంలోకి ఉద్యోగులే రాలేదని గురువారం ఒక ప్రముఖ ఛానల్ ప్రత్యక్ష కథనం ప్రసారం చేసింది. పుష్కరాలు పూర్తయ్యే వరకూ ఈ వైపు చూసే అవకాశమే కనిపించడం లేదు. దానికి తోడు పాత కమిషనర్‌ను మార్చేశారు గనక అన్నీ కొత్తగా పరిశీలించే పరిస్థితి.
