కేజ్రీవాల్‌పై జంగ్ గెలిచిన గవర్నర్

ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రజలు తనకిచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని చేయగలిగిన పనులపై కేంద్రీకరిస్తే మరింత ముందుకు పోయేవారు.కాని ఆయన వ్యూహాత్మకంగానో దుస్సాహసంతోనో కోరి వివాదాలు తెచ్చుకుని భంగపాటుకు గురవుతుంటారు. రాజ్యాంగం 239 అధికరణం ప్రకారం ఢిల్లీ పాలనా వ్యవహారాలు లెఫ్టినెంట్ గవర్నర్ ఆధిపత్యంలోనే వుంటాయని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ కోణంలో చాలా తీవ్రమైంది. 1991లో 239ఎఎను జోడించడం ద్వారా నేషనల్ క్యాపిటల్ టెరిటరీగా ఢిల్లీకి శాసనసభను , ముఖ్యమంత్రిని ఏర్పాటు చేసినా అధికారాలు మాత్రం మిగిలిన కేంద్ర పాలిత ప్రాంతాలకు వున్నట్టే వుంటాయని చీఫ్ జస్టిస్ రోహిణి నాయకత్వాన గల ధర్మాసనం స్పష్టం చేసింది.విద్యుచ్చక్తి బోర్డు, అవినీతి నిరోధక శాఖ, దర్యాప్తు కమిషన్ ఇవన్నీ గవర్నర్ ఆమోదం లేకుండా అమలు కావని తేల్చిచెప్పింది. కేజ్రీవాల్ ప్రభుత్వంపై కేంద్రం రాజకీయ కక్ష అందుకోసం గవర్నర్ నజీబ్ జంగ్‌ను వుపయోగించుకోవడం అన్ని చర్యలకూ అడ్డుపడ్డం నిజమే. అయితే ఆ పరిమితిని గుర్తించి వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనా వుండింది. అలాగాక వివాదం నడిస్తే మంచిదన్నట్టు సంచలనం కోసం ప్రయత్నించడం వల్ల ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ఈ తీర్పు తర్వాత ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్టు ప్రకటించింది. న్యాయపోరాటం కొనసాగించినా దైనందిన పాలన దెబ్బతినకుండా ఎదురుదెబ్బలు తగలకుండా చూసుకోవలసిన బాధ్యత ముఖ్యమంత్రిపై వుంది. తమ పరిధిలోని అనేక ప్రజా సమస్యలుపరిష్కరించకుండా ఆప్ అధినేత ప్రధాని పదవిపై దృష్టిపెట్టినట్టు కనిపిస్తుంది. అదే ముఖ్యమైతే అప్పుడు మరొకరికి ఈ బాధ్యత అప్పగించి పంజాబ్ గుజరాత్‌లలో కేంద్రీకరించవచ్చు. బిజెపి కేంద్రం కూడా గొప్ప విజయంసాధించిన ఆప్‌పై కక్ష సాధింపు ప్రజలు మెచ్చరని గుర్తించకపోతేమరోసారి దెబ్బతినడం అనివార్యమే అవుతుంది.