జిఎస్‌టి ఆమోదం- రాష్ట్రాలకు నష్గం-ప్రజలకూ భారం!
రాజ్యసభలో సరుకులు సేవల బిల్లు(జిఎస్‌టి) 122వ రాజ్యాంగ సవరణను ఆమోదించడం చారిత్రాత్మక పన్ను సంస్కరణ అని ప్రచారం మార్మోగిపోతున్నది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆయనకు పూర్వం ఆ బాధ్యత నిర్వహిచిన చిదంబరంసహా చాలా మంది మాట్లాడారు. నరేంద్రమోడీ నాయకత్వంలో బిజెపి ఎన్‌డిఎ ప్రభుత్వం 2015 నుంచి ఈ బిల్లును రాజ్యసభలో గట్టెక్కించుకోవడంపైనే దృష్టి పెట్టింది. ప్రతిపక్షంలో వున్నప్పుడు బిజెపి ఈ బిల్లును వ్యతిరేకించిందని ఇక్కడ గుర్తు చేయాలి. గత ఆరుమాసాలుగా కాంగ్రెస్ రాజ్యసభలో ప్రధాన అడ్డంకిగా వుందని ప్రభుత్వం విమర్శించింది. ఎట్టకేలకు కార్పొరేట్ శక్తుల జోక్యంతో ఇరుపార్టీలకూసయోధ్య కుదిరడంతో బిల్లు ఆమోదం చకచకా జరిగిపోయింది. అయితే ఈ క్రమంలో ఇతర పార్టీలను విస్మరించడాన్ని సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరి గట్టిగా ఆక్షేపించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎందుకంటే జిఎస్‌టి బిల్లు ఇప్పుడు కాదు అప్పుడు అమలులోకి రావాలని జాతీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఆతృతగా వున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దేశం రాష్ట్రాల సమాఖ్య గనక ఎవరికి వారు పన్నుల రూపంలో ఆదాయం పెంచుకోవచ్చు. అది సరికాదంటూ ఏకరూప పన్ను విధించి తద్వారా ఈ దేశాన్ని ఒక ఏకీకృత మార్కెట్‌గా ప్రపంచ మార్కెట్‌లో లీనం చేయడం ప్రపంచీకరణ శక్తులకు చాలా అవసరం. కనుకనే మరే బిల్లుకు లేనంత ప్రాధాన్యత ప్రచారం దీనికి లభించాయి. మేము దీనికి వ్యతిరేకం కాదు అని కాంగ్రెస్ ఒకటికి రెండు సార్లు చెప్పుకున్నది! అన్నాడింఎకె వ్యతిరేకిస్తూ వాకౌట్‌తో సరిపెట్టింది. బిల్లు అమలుకు వచ్చేప్పుడు వివరంగా చర్చించాలని సిపిఎం కోరింది.
ఇప్పుడు ఒకే విధమైన సరుకులపై మూడు రకాల పన్నులు వేర్వేరు రేట్లలో వుండటం వల్ల గజిబిజి అని జిఎస్‌టి ప్రతిపాదకులు వాదిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం విధించే పన్ను, కేంద్రం వేసే పన్ను, రాష్ట్రాల మధ్య రవాణాలో పడే పన్ను విభిన్నంగావుంటున్నాయి. మూలసరుకుమీద తదుపరి ఉత్పత్తిమీద పన్ను వేయడం వల్ల రెండుసార్లు చెల్లించనట్టవుతుంది. దానికి బదులు అదనంగా కలిసిన విలువ మీద వాల్యూ యాడెడ్‌మీద పన్ను వేస్తే సరిపోతుంది. రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించడం కోసం పోటీ పడి పన్నులు తగ్గించే అవకాశం వుండకుండా చేయొచ్చు- ఇవీ జిఎస్‌టికి అనుకూలంగా వచ్చిన మూడు ప్రధాన వాదనలు. వీటికి తోడు జిఎస్‌టి బిల్లు వల్ల జిడిపి రెండు శాతం పెరుగుతుందని చెప్పడం అత్యంత అసంబద్దం. అదే నిజమైతే ప్రపంచ దేశాలన్నీ దీన్ని విధించి జిడిపి పెంచుకుని వుండేవి. అన్నిటికీ ఆదర్శంగా చూపే అమెరికాలో కూడా జిఎస్‌టి లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పన్నులు విధించినా అక్కడ ఏకీకృత మార్కెట్ పేరుగుదలకు ఆటంకం లేకపోయింది. మన దేశం రాష్ట్రాల సమాఖ్య గనక తమ ఆదాయాల పెంపు ప్రజా సౌకర్యాల కల్పన ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చునని రాజ్యాంగం చెబుతుంది.దీన్ని నియంత్రించేందుకు జిఎస్‌టి కౌన్సిల్ అంటూ ఒకటి ఏర్పాటు చేయడమంటే రాజ్యాంగేతర వ్యవస్థను సృష్టించడమే. చర్చలో సీతారాం ఏచూరి చెప్పినట్టు కేరళలో బర్గర్లపై ఫ్యాట్‌టాక్స్ వేశారు. లేదా తప్పయినప్పటికీ మమతా బెనర్జీ ప్రభుత్వం శారదా చిట్‌ఫండ్ బాధితులను ఆదుకోవడానికి సెస్ వేసింది. మహారాష్ట్రకు వచ్చే ఆక్ట్రారు పన్ను చాలా రాష్ట్రాల మొత్తం బడ్జెట్ కంటే ఎక్కువగా వుంటుంది.ఈ తేడాలు అనుకూల ప్రతికూలాలే సమాఖ్య విధానం విలక్షణతలు. వీటన్నిటినీ ఏకరూపంలోకి తేవడమంటటే రాష్ట్రాల హక్కులను హరించడమే.
అదే విధంగా వినియోగదారుల కోణంలోనూ ఈ బిల్లు చాలా భారం తెచ్చిపెడుతుంది. 18శాతం వుంటుందని ఇందులో 9 శాతం కేంద్రానికి 9 శాతం రాష్ట్రాలకూ వస్తుందని చెబుతున్నా దానికి గ్యారంటీ లేదు.రెెవెన్యూ న్యూట్రల్ టాక్స్‌రేట్(ఆర్ ఎన్‌ఆర్) 27 శాతం వరకూ వుండొచ్చని ప్రభుత్వ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం ప్రవచించారు. తర్వాత దాన్ని 18 శాతానికి తగ్దించారు. అలా చూసినా విద్యుత్‌పై ఇప్పుడున్న 15 శాతం పెరిగిపోతుంది. పైగా ఈ శాతాన్ని ఎప్పటికప్పుడు పెంచే అవకాశం వుంటుంది. ఆ రీత్యా వినియోగదారుడిపైనా భారం పెరుగుతుంది. ఏకరూప పన్ను వల్ల రాష్ట్రాలకు కలిగే నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలనే దానిపై స్పష్టత లేదు. అయిదేళ్ల పాటు కేంద్రం భరిస్తుందని చెబుతున్నా లెక్కలు తేల్చడం సులభం కాదు. ఏతావాతా అటు రాష్ట్రాలకూ ఇటు ప్రజలకూ కూడా జిఎస్‌టి భారాలు పెంచుతుంది. ఎటొచ్చి ప్రపంచ వ్యాపారులకు మాత్రం సరుకులు అమ్ముకోవడం లాభాలు ముందే లెక్కవేసుకోవడం తేలికవుతుంది. సేవలు ఖచ్చితంఆ మరింత భారం అవుతాయి. ఇప్పుడు ఈ బిల్లు మళ్లీ లోక్‌సభకు వెళ్లవలసి వుంటుంది. మళ్లీ తదుపరి దశలవారీగా చర్చ జరగాల్సి వుంటుంది. అయితే ఆర్థిక విషయం గనక ద్రవ్య బిల్లు పేరుపెట్టి రాజ్యసభకు పాత్ర లేకుండా చేయొద్దని సభ్యులందరూ సూచించారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మాత్రం రాజ్యాంగం ప్రకారం వెళ్తామని సరిపెట్టారు.