‘నమస్తే’ కెటిఆర్‌.. అధికారులపైనే ఫైర్‌

HY24HYDERAGUDA_1123534fతెలుగులో ప్రముఖ పత్రికలు మీడియా సంస్థలు ఎప్పుడు ఏ వార్త ఎలా ఇస్తాయో ఎవరి ప్రయోజనాలు ప్రతిబింబిస్తాయో ఇప్పుడు మామూలు పాఠకులు కూడా గ్రహిస్తున్నారు. నాకు కూడా ప్రజాశక్తి వంటి పత్రికలతో చిరకాల సంబంధం వున్నా ఆ సమస్య రాలేదు. ఎందుకంటే అవి ప్రజల పత్రికలుగా ప్రకటించుకున్నవే తప్ప ఏ పాలకుల సేవకూ ఉద్దేశించినవి కావు. అందుకే ఒక విధంగా వామపక్ష పత్రికలే ప్రధాన స్రవంతి, మిగిలినవన్నీ ఆయా వ్యక్తిగత స్రవంతులని నేనంటుంటాను. ఆ చర్చ మరోసారి. తెలుగు పత్రికల్లో నమస్తే తెలంగాణ పత్రిక నేపథ్యం భిన్నమైంది కర్త కర్మ క్రియ టిఆర్‌ఎస్‌ అధినేత, అన్న వాస్తవాన్ని వారెప్పుడూ దాచుకున్నది లేదుగనక టిఆర్‌ఎస్‌ వైఖరినే ప్రతిబింబిస్తూన్నది. . అయితే ఆ విధంగా చూసినా సమర్థించుకోలేని స్థితిలో ఇటీవల సర్కారు గానం పొంగిపొర్టుతున్నది. తాజాగా చెప్పాలంటే మల్లన్నసాగర్‌ లాఠీచార్జి, గాలిలోకి కాల్పుల వార్త ఆ పత్రిక 25వ తేదీన మొదటి పేజీలో ఇవ్వనేలేదు.లోపల కూడా రెచ్చగొట్టడం రాళ్లు రువ్వడం వంటి శీర్షికతో ఇచ్చింది. అది వారి ఇష్టం అనొచ్చు గాని కారణం ఏదైనా బాదితులు తెలంగాణ ప్రజలే కదా? ఆ తర్వాత ప్రతిపక్షాలపై వరుస కథనాలు వచ్చాయి గాని ప్రజల వాదన ఒక్కటంటే ఒక్కదానికైనా సముచిత స్థానం కల్పించలేదు. ఆ తర్వాత వరసగా ప్రతిపక్షాలపై దాడులతో వ్యాస పరంపర ఇచ్చారు. అధికార భాషా సంఘం అద్యక్షులు దేవులపల్లి ప్రభాకరరావు ప్రతిపక్షాలు వెంటిలేటర్‌పై వున్నాయంటూ రాజకీయ వేత్తలను మించిపోయి రాసిన వ్యాసం(కాలమ్‌ పేరు మాత్రం ముక్తసరి) రాశారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టల్లా లెఫ్ట్‌న కమ్యూనిస్టులపైన రైట్‌న బిజెపిపైన ఏకబిగిన దాడి చేసే ఆ వ్యాసం అధికార పదవిలో వున్న ఒక సాహితీ వేత్త నుంచి రావచ్చునా అని సందేహం కలుగుతుంది.
పద్మవ్యూహం ఛేదించడమెలా అని హైదరాబాదు నగర సమస్యలపై సంపాదకుడు కట్టాశేఖర్‌రెడ్డి కట్టామీఠా కూడా వింత వాదనలే చేసింది.ఇటీవల ఈనాడు సిటీలోనూ పూర్తిపేజీ రోడ్ల దుస్థితిపై వ్యాఖ్య సహితంగా కథనం రావడంతో రాయకతప్పని స్థితి ఎలా ఏర్పడిందొ అందరికీ అర్థమైంది. నిజానికి ఈ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల తర్వాత రోడ్ల పరిస్థితి వంటివి మరింత దిగజారాయనే భావన పెరుగుతున్నది. మంత్రి కెటిఆర్‌ ప్రత్యక్ష బాధ్యత తీసుకున్నాక కొంత మెరుగుపడుతుందని ఆశించినవారికి కూడా నిరాశతప్పలేదు. ఇంత జరిగాక కట్టామీఠా పాలకులకు మీఠా, అధికారులకు గత పాలకులకు కట్టా అన్న తరహాలో నడిచింది. కెటిఆర్‌పై నమ్మకం వుందట కాని అంతా అధికారుల అలసత్వం అభ్యంతరాలు పెట్టే స్థలయజమానుల వైఖరి,సాంకేతిక సమస్యల వల్లనే ఇబ్బందులట. ”క్షేత్రంలో పనిచేసే అధికారులు నిజాయితీ పరులూ మంచివాళ్లూ కావాలి” అంటారు. కెటిఆర్‌ను పొగడొచ్చు గాని అధికారులందరినీ అవహేళన చేయడం న్యాయమేనా? పొగడ్తలు తప్పు లేదు గాని శ్రుతిమించితే విశ్వసనీయతకే విఘాతం. విజయాలకే కాదు , వైఫల్యాలకు కూడా నేతలకు బాధ్యత వుండదంటారా సంపాదక శేఖరులు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *