ఎంపి శశికళను జయ కొట్టారా? ఆ ఎంపినే శివను కొట్టారా?

ఇదే ఇప్పుడు పార్లమెంటును కుదిపేసిన ప్రశ్న. విపరీత వివాదాలకు దౌర్జన్యాలకు పెట్టింది పేరైన తమిళనాడులో కూడా అంతుపట్టని తగాదా. ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలైన శశికళ పేరు కలిగివున్న శశికళ పుష్ప రాజ్యసభ సభ్యురాలు. ఇటీవల విమనాశ్రయంలో ఆమె డింఎంకె ఎంపి తిరుచి శివను కొట్టినట్టు ఆమే చెప్పారు. తమ నాయకురాలు జయలలితను ఆయన దుర్భాషలాడటం భరించలేక చేయిచేసుకున్నానని తెలిపారు. దీనిపై జయలలిత ఆమెనూ లోక్‌సభ ఉపసభాపతి తంబిదురైని పిలిచి విచారించి పంపించారు. మరోవంక డింఎంకె నాయకత్వం తమ వాళ్లను పిలిపించి విచారించింది. ఈలోగా సోమవారం నాడు శశికళ పుష్పను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు గాను బహిష్కరిస్తున్నట్టు ప్రకటన వెలువడింది. ఆ తర్వాత ఆమె రాజ్యసభలో తనకు రక్షణ లేదంటూ విలపించారు. శివ తిరుచ్చి మంచి మనిషి అని తను చేసిన పనికి ఆయన తనను క్షమించాడని ఆమె అన్నారు. అయితే తమ పార్టీ అధినేత తనపై చేయిచేసుకున్నారని ఆరోపించడం సభ అవాక్కయింది. తన ప్రాణాలకు ముప్పు వున్నందున రక్షణ కల్పించాలని ఆమె కోరారు. మీరు చైర్మన్ అన్సారీకి లేఖ రాయొచ్చని ఉపాద్యక్షుడు కురియన్, మంత్రి వెంకయ్య నాయుడు చెప్పగా ప్రాణహాని వుందంటే ఎవరికో లేఖ రాయమంటారా అని ఆమె గొడవ చేశారు. చివరకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తానని చెప్పింది.అసలు వారిద్దరి మధ్య పాత తగాదాలు వున్నాయని అందుకే ఘర్సణ పడ్డారని మరో కథనం. ఇంతకూ ఈ ఇద్దరు ఎంపిలు ఒకేచోటికి వెళ్లవలసి వుందట. విమానం చిన్న విమానం ఒక్కటే వుండటంలో ఇద్దరికీ దాంట్లోనే సీట్టు ఇచ్చారు. అయితే ఆమెతో పాటు తాను ప్రయాణం చేయబోనంటూ శివ దిగిపోయారు. అది భరించలేక శశికళ అందరూ చూస్తుండగానే ఆయనను కొట్టారట. అదీ కథ. అయితే ఈ దశలో డిఎంకె నాయకులు ఎలాటి ప్రత్యారోపణలు గాని వివాదం గాని చేయకపోవడం ఆసక్తికలిగించింది. తమిళనాడు రాజకీయాల్లో ఏదైనా సంభవమే మరి!