పాతికేళ్ల సరళీకరణ- సోత్ర పాఠాలూ, గుణపాఠాలు

manmohan-singh-narasimha-rao_79d33b4a-3c9f-11e6-86cd-639e2418d1d4

1991 జులై 24న ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌ ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్‌తో భారత దేశం సరళీకరణ లేదా సంస్కరణల యుగంలోకి ప్రవేశించిందని మీడియా పండుగు చేసుకుంటున్నది. ప్రత్యేక కథనాలూ సంచికలు వ్యాసాలతో హౌరెత్తిస్తున్నది. దీనికి కర్త ఎవరనేదానిపైనా రకరకాల విశ్లేషణలూ పోటాపోటీలు నడుస్తున్నాయి. నాటి ప్రధానిగా పి.వి.నరసింహారావుకే ఈ ఘనత దక్కాలని కొందరు రాస్తుంటే కాదు ఇదంతా మన్మోహన మహత్యమేనని మరికొందరు కీర్తిస్తున్నారు. అంతకు ముందు ఆపద్ధర్మ ప్రభుత్వంలో(చంద్రశేఖర్‌ ప్రధానిగా) తాను తయారు చేసిన బడ్జెట్‌ ప్రసంగం అచ్చుగుద్దినట్టు మన్మోహన్‌ బాణీలోనే వుందంటున్నారు అప్పుడు ఆ తర్వాత వాజ్‌పేయి హయాంలోనూ ఆర్థిక శాఖ నిర్వహించిన యశ్వంత్‌ సిన్హా. పివి ప్రశంసకులు, మాజీ మంత్రి జైరాం రమేష్‌ వంటివారు దీనిపై పుస్తకమే రాశారు. మాంటెక్‌ సింగ్‌ అలూవాలియా కూడా చాలా ఇంటర్వ్యూలలో ఈ ప్రక్రియ విపిసింగ్‌ ప్రభుత్వ హయాంలోనే ఎలా మొదలైందో ప్రస్తావించారు. తర్వాత కాలంలో ఆయన మన్మోహన్‌తోనే వున్నారు.1985-89 మధ్య సోవియట్‌ యూనియన్‌లో గోర్బచెవ్‌ నాయకత్వం చేపట్టిన తర్వాత వర్ధమాన దేశాలకు సహాయపడే విధానం మారిపోయినందువల్ల ప్రపంచ బ్యాంకు బాట పట్టడం జరుగుతూ వచ్చింది. 1991లో అది విచ్చిన్నమైపోయిన తర్వాత ఇది పరాకాష్టకు చేరడమే గాక పూర్తిగా అమెరికా కూటమి ఆధ్వర్యంలోని ఐఎంఎప్‌ ప్రపంచబ్యాంకు వ్యవస్థలతో ముడిపడిపోయింది. అప్పటికే సులభ రుణాల అవకాశం తగ్గిపోవడం ఒకటైతే భారత దేశంలోని పాలక,పారిశ్రామిక వర్గాలు అలీన విధానం పేరిట అమెరికా సోవియట్‌ శిబిరాల మధ్య దోబూచులాడే అవకాశం కోల్పోవడం ఇందుకు ముఖ్య కారణం. ఆ దశలో ప్రధానంగా సోవియట్‌ సహాయంతో తమ పెట్టుబడులు లేకుండా పెంచుకున్న ప్రభుత్వ రంగ సంస్థల పునాదిని యంత్రాంగాన్ని స్థలాలను కూడా అప్పనంగా స్వంతం చేసుకోవడం వారి వ్యూహంగా మారింది. అప్పటి వరకూ ఆ సంస్థలకే అనుబంధంగా ఉప కాంట్రాక్టర్లుగా పనిచేసిన వారు ఆ వ్యవస్థల స్థానాన్ని ఆక్రమించి దేశ విదేశీ గుత్తపెట్టుబడులతో చేయి కలిపి విస్తరించాలని భావించారు. అంతకుముందు అత్యున్నత శిఖరాల్లో(కమాండింగ్‌ హైట్స్‌)లో వుంచుతామన్న ప్రభుత్వ సంస్థలు ఇప్పుడు నిరర్థకంగా కనిపించాయి. సైద్ధాంతికంగానూ సోవియట్‌ అనంతర ప్రపంచంలో సంక్షేమ పథకాలు మౌలిక ప్రజా బాధ్యతలను నెరవేర్చవలసిన అవసరం లేకుండా పోయింది. ఈ కారణంగానే సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ అనబడే ఎల్‌పిజి విధానాలు వచ్చాయి. అంతకుముందు పేద దేశాల తరపున ప్రాతినిధ్యం వహించిన మన్మోహన్‌ సింగ్‌ ఇందుకు కూడా సూత్రధారి అయ్యారు. అందుకు పీవి ఆశీస్సులు లభించాయి అనేకంటే అందుకోసమే ఆయనను తీసుకొచ్చారని చెప్పడం వాస్తవానికి దగ్గరగా వుంటుంది.అప్పటి వరకూ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పేరిట ప్రధానంగా పెట్టుబడిదారీ భూస్వామ్య వర్గాల ప్రయోజనాలు నెరవేరుస్తూనే ప్రజాపంపిణీ వ్యవస్థ విద్యా వైద్య రంగాల్లో కొంత కృషి ప్రాజెక్టుల వంటివి నిర్వహిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు అవన్నీ అవసరం లేదని తేల్చేసింది. ప్రభుత్వమంటే ధర్మశాల కాదు అన్నది పివి వువాచ. కీన్స్‌ సిద్ధాంతం ప్రకారం కమ్యూనిజానికి సమాంతర ప్రయత్నంగా తీసుకొచ్చిన సంక్షేమ విధానాల సమాప్తికి అది సంకేతం. స్వావలంబన స్వయం పోషకత్వం వంటి మాటలు ఆ తర్వాత అదృశ్యమై పోయాయి. వామపక్షాలు కార్మిక సంఘాలు ప్రజా పక్ష ఆర్థిక వేత్తలు మేధావులు ఈ విధానాల ఫలితాలు ఎలా వుంటాయో ముందే చెప్పగలిగారు. పెట్టుబడులను ఆహ్వానించడం సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవడం తప్పని వారెప్పుడూ చెప్పలేదు.ఏం చేసినా దేశీయ సంపదలు ఉత్పత్తి పంపిణీ మెరుగుదలకు దారి తీయాలి తప్ప శత కోటీశ్వరులు విదేశీ సంస్థల కోణంలో జరక్కూడదని మాత్రం హెచ్చరించారు. ఆర్థిక రంగంలో మొదలైన అమెరికా కూటమి ప్రాబల్యం ఉత్తరోత్తరా విదేశాంగ విధానాన్ని కూడా ఆక్రమించడం ఖాయం అని వివరించాయి. తెలుగులో కూడా నేను రాసిన ‘స్వాతంత్రానికి చేటు తెచ్చే నూతన ఆర్థిక విధానాలు’ అన్న చిన్న పుస్తకం యాభై వేల ప్రతుల వరకూ ప్రజలకు చేర్చారు. ఇదంతా కరుడు గట్టిన సిద్ధాంత ప్రభావమని అప్పుడు అపహాస్యాలు చేశారు. తర్వాత నెమ్మదిగా అనేక దుష్ఫలితాలు అర్థమవుతూ వచ్చాయి. ఆఖరకు పివి కూడా సరళీకరణతో తాను ఆశించిన ప్రయోజనం నెరవేరలేదని ప్రజలకు ఫలితాలు అందలేదని వాపోయారు. మన్మోహన్‌ ప్రధానిగా వుండగా మానవాభివృద్ధి నివేదిక విడుదల చేస్తూ దేశంలోని బాలబాలికల్లో యాభైశాతం మందికి పైగా పౌష్టికాహారలోపంతో కునారిల్లిపోతున్నారని బాధపడ్డారు. దేశీయ ఉత్పత్తి పెరుగుదలకు దారితీయని క్రోనీ క్యాపిటలిజం(ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం) హానికరమని సరళీకరణ పితామహుడే హెచ్చరించారు.
20వ శతాబ్డిలో లాటిన్‌ అమెరికా దేశాల దివాలా; ఆ శతాబ్ది చివరలో ఆసియా పులులు అనబడే దేశాలు సంక్షుభితం కావడం, 2008లో లేమాన్‌ బ్రదర్స్‌ కుప్పకూలడం వంటివన్నీ ఎల్‌పిజి విధానాల వినాశకర ఫలితాలను తెలియజెప్పాయి. లాటిన్‌ అమెరికా గాక అసలు అమెరికాలోనే ఆకుపై వాల్‌స్ట్రీట్‌లాటి ఆందోళనలు రగిలాయి. యూరప్‌లోనూ గ్రీస్‌ల వంటివి గాక- ఇక నిన్నటి మహాసామ్రాజ్య కేంద్రమైన బ్రిటన్‌లో ప్రజలే ప్రపంచీకరణ పంజరం లాటి యూరో కూటమి నుంచి వైదొలగాలని అత్యంత ప్రజాస్వామికంగా ఓటింగ్‌ ద్వారా నిర్ణయించారు. ఇక చివరగా దీనంతటికి ఆగ్రపీఠంలో వున్న అమెరికా అద్యక్ష అభ్యర్థి ట్రంప్‌ కూడా తాను గెలిస్తే ప్రపంచీకరణ వలయం నుంచి దేశాన్ని బయిటకు తెస్తానని ప్రకటించారు.పైగా కావలసింది ప్రపంచవాదం కాదు అమెరికా వాదం అని బల్లగుద్ది చెప్పారు.
ప్రభాత్‌ పట్నాయక్‌ సిపిచంద్రశేఖర్‌ వంటి ప్రజాపక్ష ఆర్థిక వేత్తలు సరే మొదటి నుంచి ఈ విధానాలపై విమర్శన చేస్తూనే వున్నారు. వారికి సైద్ధాంతిక కోణం ఆపాదించి అవతలపెటొచ్చు. కాని ఈ సమయంలో కొందరు బడామీడియా వ్యాఖ్యాతలు రాసింది చూసినా వాస్తవం తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సంపాదకుడు ప్రభుచావ్లా ఈ రజతోత్సవంతోనైనా సంస్కరణలకు స్వస్తి చెప్పాలని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన ఇలా రాశారు: సహజంగానే తలుపులు తెరిచివుంచినా భారత దేశం ఎఫ్‌డిఐల రాకలో పదో స్థానంలోవుంది. ప్రపంచ పెట్టుబడుల సూచిక లెక్కల ప్రకారం మనస్థానం చైనా బ్రెజిల్‌ తర్వాతనే. ఇతర చోట్ల కల్లోలాలు వచ్చినా సరే భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడో స్థానంలోకి వచ్చింది.గత పాతికేళ్లలోనూ మహా కుబేరుల సంఖ్య 10 రెట్లు పెరిగింది. వ్యక్తిగత విమనాలు 500 శాతం పెరిగాయి… విదేశాల్లో చదువుకుంటున్న బారతీయ విద్యార్థులు ఏటా 700 కోట్ల డాలర్లు అంటే మన మానవ వనరుల శాఖ బడ్జెట్‌కన్నా ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. … మిరుమిట్టు గొల్పే ఈ విజయాల మధ్య కొన్ని ప్రశ్నలు మరుగునపడిపోయాయి. ఎందుకు మన విదేశీ రుణం పెరిగింది? ఎందుకు భారతీయ బ్యాంకులు దివాళా దశకు చేరాయి? ఎందుకు దేశంలో లక్షలాది నిర్మిత గృహాలు కొనేదిక్కు లేక అఘోరిస్తున్నాయి? ఎందుకు ఏడులక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు దండగమారి ఆస్తుల కింద వుండిపోయాయి? ఏ బడా కంపెనీ అధినేతను తీసుకున్నా వారి కంపెనీలు రుణాలుఎగవేయడం వ్యక్తిగత ఆస్తులు మాత్రం అపారంగా పెరగడం ఎలా సంభవమైంది?…. 25 ఏళ్ల కిందటితో పోలిస్తే భారత దేశ రుణం పది రెట్లు పెరిగింది. ప్రతిపౌరుడి తలపై 43,000 అప్పువుంది. మానవాభివృద్ధి సూచికల్లో ఇండియా 133/180వ స్థానంలో వుంది. తలసరి విద్యుత్‌ వినియోగంలో ఇండియాది 154వ స్థానం. మనకు ప్రపంచస్థాయి ఆస్పత్రులున్నాయి గాని ఆ మేనేజిమెంట్లు భారీబిల్లులు చెల్లిస్తేగాని మృతదేహాలను స్వాధీనంచేయవు. గ్రామీణ భారతంలో సగం ఇళ్లకు మంచినీరు మరుగు వసతి వుండవు. కనుక ఈ రజతోత్సం సమయంలో ఇవ్వదగిన గొప్ప బహుమానం ఏమంటే కొంతమందికి మేలు చేసి అత్యధికుల నోళ్లుకొట్టే ఈ ఆర్థిక నమూనాను భూస్థాపితం చేయడమే-
స్వతహాగా బిజెపిని బలపర్చే ఈ సీనియర్‌ సంపాదకుడు చెప్పిన దానికిది క్లుప్తీకరణ మాత్రమే. లైసెన్స్‌ రాజ్‌పోయిందని సంతోషం వెలిబుచ్చిన శంకర్‌ అయ్యర్‌ కూడా సంస్కరణల ఫలితాలు మిశ్రమంగా వున్నాయని తేల్చిచెప్పారు. గంటకు వందమంది పిల్లలు సరైన ఆహారం లేకుండా చనిపోవడం పట్ల ఆవేదన వెలిబుచ్చారు.ఇప్పటికీ పేదలు విద్య వైద్యం కోసం భరించలేని ఖర్చు మోయవలసి వస్తుందన్నారు. జిడిపి విదేశీ మారక నిల్వలు సెన్సెక్స్‌ ధగధగల కన్నా ప్రజలజీవితాలలో ప్రతిబింబిస్తున్న ఈ కఠోర వాస్తవాలను బట్టి పాతికేళ్ల సంస్కరణలపై తీర్పు నివ్వాల్సివుంటుంది.దీనికి మూలం ఎక్కడుందో ప్రొఫెసర్‌ ప్రభాత్‌ పట్నాయక్‌ స్పష్టంగా పేర్కొంటారు. ప్రభుత్వం తన పాత్ర తగ్గించుకోవడంగా దీన్ని చూడటం సరికాదని సామాన్య ప్రజలను బక్కమనుషులను వదిలేసి బడా కార్పొరేట్లకు సేవలు రక్షణ అందించే బాధ్యథ రాజ్యాంగ బద్దంగా చేపట్టడమే సరళీకరణ అని ఆయన వివిరిస్తారు. (వ్యాపారం సులభతరం- ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అనేది ఇప్పుడు తిరుమంత్రం) ప్రజలకుతిండి పెట్టడం పని చూపించడం అనేవి ప్రభుత్వ బాధ్యతలు కాదు గనకే 2005-2010 మధ్చ జిడిపి పెరుగుదల చాలా ఎక్కువగా వున్నా ఉపాధికల్పన 0.8శాతమే వుంది. ఉద్యోగు కార్మికులకు ఉన్న రక్షణలు పోయాయి.వ్యవసాయాన్ని కుప్పకూల్నడంతో లక్షలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసి వచ్చింది. ఆఖరుకు పంటలు బాగా పండినా సంపదలు పెరిగినా ప్రజలు తీసుకునే ఆహారం క్యాలరీలు బాగా తగ్గాయి. ఇదేదో ఆలవాట్ల మార్పుగా చెప్పడం అసంబద్దం.ప్రకృతి వనరులను ప్రజల ప్రయోజనాలను ప్రైవేటు శక్తులకు కట్టబెట్టే ఈ ప్రక్రియ విషమించేకొద్ది మిగిలిన దేశాల్లో వలెనే ఇక్కడా ప్రజల ఆగ్రహం పెల్లుబుకడం అనివార్యమే. సరళీకరణ అంటే జీవిత భారాలు తగ్గించాలి తప్ప దోపిడీని సులభతరం చేయడం కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *