టి.మంత్రులకు బాధ్యతలేదా?
ఎంసెట్-2 పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణ ప్రభుత్వాన్ని కుదిపేస్తుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు హడలిపోతున్నారు. ఇప్పటికే మంచి ర్యాంకులు వచ్చినవారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు రాసిన తాము పరీక్ష రద్దయితే మళ్లీ ఒత్తిడి భరించలేమని ఆవేదన చెందుతున్నారు. దీనిపై నిర్ణయాన్ని ప్రభుత్వం రేపటికి వాయిదా వేసింది. అయితే నాలుగేళ్ల క్రితమే పీజీ పరీక్ష స్కాంలో కీలక సూత్రధారి రాజగోపాలరెడ్డి ముఠా ఇంత పనిచేస్తుంటే ప్రభుత్వం ఎందుకు కనిపెట్టలేకపోయింది? ప్రెస్‌లో వాటి ముద్రణకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసిన నాయకుడెవరు? అసలు ప్రభుత్వ పెద్దలు సంబంధిత శాఖల అధికారుల అండదండలు, మంత్రుల ఉపేక్ష లేకుండా ఇది జరిగేపని కాదన్న మాట అన్నిచోట్లా వినిపిస్తున్నది. విద్యామంత్రి కడియం శ్రీహరి, వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వంటివారిని తొలగించాలని విద్యార్థి సంఘాలు గట్టిగా అడుగుతున్నాయి. ఈ వ్యవహారంలో వందకోట్ల వరకు అవినీతి జరిగిందని అంటున్నారు. ఏదిఏమైనా ఇది ఆకస్మిక పరిణామం కాదు. లోతుగా పాతుకుపోయిన ప్రయివేటు శక్తులు, అవినీతి అధికారుల కుమ్మక్కు దీని వెనక ఉందనేది నిస్సందేహం. గతంలో కారణాలు అధికారికంగా చెప్పకుండా ఉప ముఖ్యమంత్రి డా. రాజయ్యను తప్పించిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పుడు వీళ్లను కూడా తొలగిస్తారని ,దాంతో తమకు పదవులు చిక్కుతాయని కొందరు టిఆర్‌ఎస్ నాయకులు ఆశపడుతున్నారు. సిఐడి నివేదిక అందినతర్వాత తుది నిర్ణయం అంటున్నా అందులో మంత్రుల పేర్లు ఉండవని అందరికీ తెలుసు. కనుక రాజకీయ నిర్ణయమే జరగాల్సి ఉంటుంది.
గాంధీ ఆస్పత్రిలో కరెంటు పోయి 30 మంది వరకు ప్రాణాలు కోల్పోవడం కూడా ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శలు వచ్చాయి. మంత్రి లక్ష్మారెడ్డి దీన్ని తేలికగా వివరించారు తప్ప తమ బాధ్యతను తీవ్రంగా గుర్తించిన దాఖలాలు లేవు. దానికి ముందు సరోజినీ కంటి ఆస్పత్రిలో చూపు పోయిన ఘటన సంచలనం కలిగించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వైద్యశాఖకు సంబంధించిన రెండు ముఖ్య వైఫల్యాలపై కెసిఆర్ ఏంచేస్తారో చూడాలి.
హైదరాబాద్‌లో రోడ్ల దురవస్థను మీడియా తీవ్రంగా ఎత్తిచూపుతున్నది. గుంతలమయమై కాస్త వానకే స్థంభించిపోతున్న మహా నగరం పరిస్థితికి మున్సిపల్ మంత్రిగా ప్రత్యక్ష బాధ్యత తీసుకున్న కెటిఆర్ పాత్ర ఉండదా? స్కైవేలు, మెట్రోలు వంటి భారీ కబుర్ల తర్వాత రోడ్ల ప్రయివేటీకరణ మంత్రం జపించారు. తీరా చూస్తే రహదారులు బాగుపడకపోగా నరకాన్ని తలపిస్తున్నాయి. ఇందుకు బాధ్యత ఎవరిదో చర్యలు ఎవరు ఎవరిపై తీసుకుంటారో తారకరాములకే తెలియాలి మరి!
