శ్రీకాంత్ కూడా బదిలీ.. సర్వం నారాయణీయమేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో కీలకమైన సిఆర్‌డిఎ (క్రిడా) కమిషనర్ శ్రీకాంత్‌ను ప్రభుత్వం బదిలీ చేయడం అంతుపట్టని లోపాయికారి నిర్ణయాలకు మరో తాజా ఉదాహరణ. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గానూ, సిఆర్‌డిఎ అదనపు కమిషనర్‌గా ఉన్న చెరుకూరి శ్రీధర్‌ను క్రిడా కొత్త కమిషనర్‌గా తీసుకొచ్చారు.క్రిడాను ఏర్పాటు చేసిన తరువాత తొలి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఇటీవల శిక్షణ కోసం పంపించారు. తిరిగొచ్చిన తర్వాతనేమో ఇప్పుడు సాధారణ పరిపాలనశాఖ పొలిటికల్ సెక్రటరీగా నియమించారు.రాజధాని ప్రక్రియ మొదలైనప్పటి నుండి ఇప్పటివరకూ ముగ్గురు కీలక అధికారులు మారిపోయారు. దొండపాటి సాంబశివరావు, గిరిధర్ ఆర్మానే, కమిషనర్ శ్రీకాంత్‌లు అలా మారిపోయారు. ఇప్పుడు రాజధాని నిర్మాణ ప్రక్రియపై మంత్రి నారాయణకు తప్ప మరెవరికీ అవగాహన లేని పరిస్థితి ఏర్పడింది. ఉరుములు మెరుపులు లేని వానలా కనిపించే ఈ మార్పు నిజానికి దగ్గరగా పరిశీలించేవారికి ఆశ్చర్యం కలిగించదు. రాజకీయ ఒత్తిళ్ల మధ్య తాను నలిగిపోతున్నట్టు క్రిడా కమిషనర్ అనేక సందర్భాల్లో ఆవేదన చెందుతున్నట్టు తెలిసింది. పైగా వివాదాస్పదమైన చాలా నిర్ణయాలు ఆయన అమలు చేయవలసి వచ్చింది. నిజానికి క్రిడాను 2014 డిసెంబర్‌లో ఏర్పాటు చేశాక కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్ మొత్తం ప్రాజెక్టు రూపకల్పన ప్లానింగ్, భూ సమీకరణ, పరిహారం తదితర విధివిధానాల రూపకల్పన అమలు ఆయనతోనే చేయించారు. సిఆర్‌డిఎ పరిధిలో జీవో విడుదల చేయాలంటే ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కమిషనర్‌ను సంప్రదించాలంటూ ప్రభుత్వం అత్యున్నత అధికారాలు కట్టబెట్టింది. గ్రామసభల నిర్వహణ, రైతులకు నచ్చజెప్పడం, ఉద్యోగులను పూర్తిస్థాయిలో పనిలోకి దించడం అన్నీ ఆయన పేరిటే జరిగాయి.. అయితే కీలకమైన ల్యాండ్‌ఫూలింగు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇదంతా మారిపోయింది. అధినేతల మాట ప్రకారం అత్యుత్సాహంతో పనిచేసే అధికారుల పట్ల చాలా మంది ముఖ్యమంత్రులు చేసినట్టే చంద్రబాబు నాయుడు కూడా చేశారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కావలసినవన్నీ చేయించుకున్నాక ప్రభుత్వ పెద్దలే ఆయనపై నోరుపారేసుకున్నారు. ఆయన వల్లే రాజధానిలో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని మంత్రులు వ్యాఖ్యలు చేశారు. తప్పులు సమస్యలు శ్రీకాంత్‌పైకి తోసేసి బదిలీ చేస్తారనే కథనాలు అప్పట్లోనే వెలువడ్డాయి. పరిహారం పంపిణీ విషయంలో అవకతవకలకు సంబంధించి కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. కొన్ని గ్రామాల్లో నిరసనలు వ్యక్తమైనప్పుడు రోడ్ల ప్లానింగ్‌లోనూ, మార్పులు, చేర్పుల్లోనూ శ్రీకాంతే స్వయంగా నిర్ణయం తీసుకున్నారని మంత్రులు తప్పుకున్నారు. గ్రామకంఠాలపై నిర్ణయం తీసుకోకపోవడానికి శ్రీకాంతే కారణమని మంత్రి స్వయంగా ప్రకటించారు.భూ సమీకరణ, గ్రామకంఠాల సమస్యల పరిష్కారం బాధ్యత ప్రస్తుత కమిషనర్‌గా నియమించిన శ్రీధర్‌కు అప్పగించారు. అసలు ే సమీకరణ ప్రక్రియ అనంతరం తుళ్లూరు నామమాత్రంగా మారిపోయింది.అంతా విజయవాడకు మారింది. రాజధాని విషయంలో ప్రభుత్వం అధికారులను, నిర్వహణ ప్రక్రియను పూర్తి నామమాత్రంగా మార్చేసింది. మొత్తం ఈ ప్రక్రియలో కీలకంగా వ్యవహరించిన అధికారులెవరినీ పూర్తి స్థాయిలో విధులు నిర్వహించనీయలేదు. ఇక ఇప్పుడు ప్రజల నుంచి వచ్చే విమర్శలకు సమాధానంగా కమిషనర్ మారిపోయారు కొత్తగా వచ్చిన వారికి సమయం కావాలి అనే సమాధానం మిగులుతుందని వేరే చెప్పాలా? వారు అవగాహనకు వచ్చేలోగా నారాయణ ఆధ్వర్యంలోనే కీలకమైన నిర్ణయాలన్నీ అమలులోకి వచ్చేస్తాయి.
