కాల్‌మనీ ఓకే.. విద్యార్థులపైనే లాఠీ
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఒకేసారి నిరసనకారులపై దారుణ లాఠీచార్జీ జరగడం యాధృచ్చికం కాదు. తెలంగాణలో మల్లన్నసాగర్ భూ సమస్యపై రాస్తారోకో తలపెట్టిన రైతులు తదితరులపై పోలీసులు దారుణంగా లాఠీలు ప్రయోగించారు. పైగా ఈ ఆందోళన ప్రతిపక్షాల కుట్ర అని మంత్రులు ఎదురుదాడికి దిగారు. మరోవైపునా ఆంధ్రప్రదేశ్‌లో ఇదే సమయంలో ఇంచుమించు విద్యార్థులపై లాఠీచార్జి జరిగింది. అందులోనూ చదువు కోసం సంక్షేమ హాస్టళ్లలో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులు పోలీసు దాడికి గురయ్యారు. సంక్షేమ హాస్టళ్లను మూసివేయడానికి నిరసనగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విజయవాడలో మహాధర్నా, ప్రదర్శన జరిగాయి. ముఖ్యమంత్రి, మంత్రులు ఎవ్వరూ స్పందించకపోగా క్యాంపు కార్యాలయానికి బయలుదేరిన విద్యార్థులపై దారుణమైన లాఠీచార్జి చేశారు. అమ్మాయిలను కూడా విచక్షణ లేకుండా కొట్టారు. పైగా విద్యార్థుల దీక్షా శిబిరాన్ని కూడా ధ్వంసం చేశారు. కాల్‌మనీ వ్యవహారాలు, ఇసుక దందాలు వంటి వాటిలో చిటికెన వేలు కదల్చని ప్రభుత్వం, పోలీసులు హాస్టళ్ల కోసం కడుపునిండా తిండి, కనీస సదుపాయాల కోసం ఉద్యమించిన పిల్లలపై ఇంత ప్రతాపం చూపించడమేనా ప్రజాస్వామ్యం?
