ఇ.క్యు. లెక్కలు సరే, నిజాయితీ పరులా? జిత్తులమారులా?
మనుషుల జయాపజయాలకు బుద్ధికుశలత కంటే ఉద్వేగ సూచిక(ఇక్యు) కీలకమని వింటుంటాం. చేసే పని ఏదైనా సరే ఇక్యు సరిగ్గా వున్నవారే విజయాలు సాధిస్తారని కోటిఅనుభవాలను అధ్యయనం చేసిన తర్వాత ఒక కంపెనీ ప్రకటించింది. దాని లోతుపాతులు ఎలా వున్నా – మీ విజయానికి ఇక్యు ఒక్కటే సరిపోదు. ఇక్యు ఎంత వున్నా మీ చుట్టూవున్నవారు ప్రధానంగా మీ నిజాయితీపై ఆధారపడి స్పందిస్తారు. మీరు ప్రదర్శించే ఉద్వేగాలు సహజమైనవా తెచ్చిపెట్టుకున్నవా తెలుసుకోగలుగుతారని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన క్రిస్టినా ఫాంగ్ చెబుతున్నారు. నిజాయితీ పరులైన నాయకులు తమ అనుచరులకు ప్రేరణ నివ్వడం సులభమనీ, ఎందుకంటే వారిపై నమ్మకం ప్రేమ ప్రశంస మిన్నగా వుంటాయని ఆయనంటారు,. కనుక ఉద్వేగాలు ఎంత వరకూ వాస్తవికమైనవా లేక ప్రదర్శనా మాత్రమైనవా అనేదాన్ని బట్టి మీకు లభించే సహకారం ఆధారపడి వుంటుంది. దానిపైనే జయాపజయాలు లభిస్తాయి.
మామూలుగా మనం చాలా ప్రశ్నలు చూస్తుంటాం గాని ఈ డజను అంశాలు వాస్తవాలకు దగ్గరగా వున్నట్టు అనిపించింది. ఎవరికి వారు తమను గురించి సానుకూల దృక్పథమే కలిగివుండటం సహజం. అయినా సరే ఒకసారి ఈ దర్పణంలో చూసుకొంటే మరింత మెరుగుపర్చుకోవచ్చు లోటుపాట్లు దిద్దుకోవచ్చు కూడా….
1.నిజాయితీ పరులైన వారు తామేమిటో అలాగే వుంటారు. తాము కొందరికి నచ్చుతామని మరికొందరికి నచ్చబోమని వారికి తెలుసు. వారిని కూడా మెప్పించడం కోసం తమ సహజ ప్రవృత్తికి భిన్నంగా ప్రవర్తించరు. నిజంగా అవసరమైనప్పుడు కాస్త ప్రతికూలంగా కనిపించే నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనుకాడరు. ఇతరులను ఆకర్షించడం వారికి ముఖ్యం కాదు గనక లేనిపోని హంగామాలకు పాల్పడరు. తాము విశ్వాసంతో సూటిగా నిర్దిష్టంగా మాట్లాడితే అందరినీ ఆకట్టుకోగలమని వారికి తెలుసు. మనుషులు మీ వైఖరి ఏమిటో త్వరగానే తెలుసుకుంటారు. మీ పలుకుబడి ఆకర్షణ ఎంత అనేది వారు పెద్దగాపట్టించుకోరు.
2.నిజాయితీపరులైనవారు ఏ విషయంలోనూ ముందస్తు అభిప్రాయాలతో మెదడు తలుపులు మూసుకోరు.అంతకుముందే ఒక నిశ్చయానికి వచ్చి వినడానికి సిద్ధపడని వారిపట్ల ఎవరికీ ఆసక్తి వుండదు. కొత్త భావాలు ఆలకించడానికి బాగుంటే ఆచరించడానికి సిద్ధంగా వుంటేనే ఎవరైనా వచ్చి మాట్లాడాలనుకుంటారు.మీరు వారు చెప్పేదాన్ని పాటించాలని బలపర్చాలని లేదు. కాని ముందుగానే తీర్పునిచ్చేసి కూచుంటే అవతలివారి ఆలోచనలు అస్సలు వినిపించలేరు. ముందస్తు తీర్పులు ప్రకటించకపోవడం నిజాయితీ పరుల లక్షణం.
3.మీరు చిత్తశుద్ధి కలిగిన వారైతే ి మీ సంతోషం సంతృప్తి ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడి వుండవు.తామేమిటో వారికి తెలుసుగనక మరోలా ప్రవర్తించే అవసరమే రాదు.ఇతరులు మెచ్చుకోవడం కోసం లేనిపోని పనులు చేయరు. ఒప్పుకోలేనివి ఒప్పుకోరానివి ఒప్పుకోరు
4.నిజాయతీపరులు సాధారణంగా ఆర్ద్ర హృదయులై వుంటారు.తమ జ్ఞానాన్ని గాని ధనాన్ని గాని లేక ఇతర వనరులను గాని ఇతరులతో పంచుకోవడానికి వెనుకాడరు.తమవి ఇతరులకు పంచితే తమను మించిపోతారన్న భయం సంకోచం వారికి వుండదు. మీరు బాగా చేస్తే వారూ ఆనందిస్తారు తప్ప దానివల్ల తమ వన్నె తగ్గిపోతుందనే ఆందోళన వారికి వుండనే వుండదు. చెప్పాలంటే మీ విజయం తమ విజయంగానే పరిగణిస్తారు.
5.నిజాయితీపరులు అందరితోనూ ఒకే విధంగా మర్యాదగా వుంటారు. అతిసంపన్పుడైనా పేరు ప్రఖ్యాతులు గలవారైనా లేక తాము చెప్పినవి తెచ్చిపెట్టే బేరర్ అంటెండర్ అయినా సరే గౌరవంగానే చూస్తారు. ఇతరులపె లేనిపోనిౖ ఆధిక్యత ప్రదర్శించడం తమకు గొప్ప కాదని తమ విలువనే తగ్గిస్తుందనీ వారికి తెలుసు.తమ గురించి తమకు ఎలాటి భ్రమలు లేవు గనక తాము చాలా గొప్పవాళ్లమని అనుకోవడం లేదు గనక అందరిపట్ట సహజంఆనే గౌరవంగా వుంటారు.
6.నిజాయితీపరులు సంతోషంగా వుండటానికి భౌతిక వస్తువులు పటాటోపాలు తళుకుబెళుకలు అక్కరకు రావు. అంటే మంచి వస్తువులు కొనుక్కొవడం మంచి దుస్తులు ధరించడం పొరబాటని కాదు. వాటివల్ల తమ హౌదా ఏమిటో అర్థమవుతుందని కూడా వారికి తెలియదని కాదు. అయితే వాటివల్లనే సంతోషం వస్తుందని వారనుకోరు. ఎందుకంటే వారికి సంతోషం అంతరంగం నుంచి వస్తుంది తప్ప బాహ్యాంశాలను బట్టి కాదు. స్నేహితులు కుటుంబం నిర్దేశిత లక్ష్య సాధన వంటివాటివల్లనే జీవితం సుసంపన్నమవుతుందని వారు గట్టిగా నమ్మడమే గాక అప్పటికే ఆస్వాదిస్తుంటారు. .మరో ఆరు అంశాలు తర్వాత.. (హఫింగ్టన్‌పోస్ట్‌లో వ్యాసానికి అనుసరణ)
