శబరిమలైలో మహిళలకే ఎల్‌డిఎఫ్‌ మద్దతు

SabarimalaRush2010

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలని కేరళలో మరోసారి అధికారం చేపట్టిన ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఇటీవల మహారాష్ట్రలోని శనిసింగాపూర్‌, నాసిక్‌ తదితర చోట్ల ఆలయాల్లోకి మహిళలను రానివ్వకపోవడం పెద్ద నిరసనకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ పోరాటం ఫలించింది కూడా. ఇదే రీతిలో శబరిమలలో కూడా వ్యక్తురాళ్లయిన స్త్రీలను అనుమతించాల్సిందేనని చాలా కాలంగా సుప్రీం కోర్టులో వ్యాజ్యం నడుస్తున్నది. పూర్వపు ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం కూడా ఈ వాదనను బలపరుస్తూ అఫిడవిట్‌ దాఖలు చేసింది. అయితే తరువాత అధికారం చేపట్టిన యుడిఎఫ్‌ దాన్ని వెనక్కు తీసుకుంది. తరతరాల సంప్రదాయం ప్రకారం ఈ ఆలయంలోకి మహిళలను అనుమతించ రాదని వాదించింది. మొన్నటి ఎన్నికల తరువాత ఈ కేసు విచారణకు వచ్చింది. నూతన ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం గత వైఖరి మార్చుకున్నట్టు, యుడిఎఫ్‌ వాదననే సమర్థించినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. కొన్ని పత్రికలు మార్కిస్టులపై విమర్శలు చేస్తూ సంపాదకీయాలు కూడా రాశాయి. అయితే ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం తన పాత వైఖరికే కట్టుబడి ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియారి బాలకృష్ణన్‌ ఒక ప్రకటన చేశారు. యుడిఎఫ్‌ హయాంలో వేసిన అఫిడవిట్‌ను వెనక్కు తీసుకుని కొత్తది దాఖలు చేస్తామని కూడా తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది ఇందుకోసం సమయం కోరడం వల్లనే అవాస్తవ కథనాలు వచ్చాయని వివరించారు. మహిళలు వయస్సుతో, శారీరక స్థితితో నిమిత్తం లేకుండా ఆలయంలోకి అనుమతించాలన్నదే ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ అభిప్రాయమని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *