అద్వానీ, ఏది నిజం
బిజెపి కురువృద్ధుడు ఎల్‌కె అద్వానీ దేశ ప్రధాని పదవి అధిష్టించే విషయంలో విఫలమనోరథుడిగానే మిగిలిపోయారు. అద్వానీ తన రథయాత్రతో మతతత్వం రగిలించి బిజెపిని అధికార శిఖరాల్లోకి తీసుకుపోయిన ఘనత దక్కించుకున్నా ప్రధానిగా వాజ్‌పారునే ప్రతిష్టించాల్సి వచ్చింది. తర్వాత ఉప ప్రధాని కావడమే గగనమైంది. 2004లో పార్టీ ఓటమి తర్వాత జిన్నాపై ప్రశంసల ఫలితంగా సంఘపరివార్ ఆగ్రహాన్ని కూడా చవిచూశారు. ఎట్టకేలకు 2009లో ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినా విజయావకాశాలు చేరువలో కూడా లేవని దేశమంతటకీి తెలుసు. నిజంగా అదే జరిగింది. ఇక 2013లో నరేంద్ర మోడిని ప్రధానిగా ప్రతిపాదించడం అద్వాని ఎప్పటికీ జీర్ణం చేసుకోలేని పరిణామం. తన అసంతృప్తిని ఆయన అనేకసార్లు వెళ్లగక్కారుకూడా. మోడిని ఎంపిక చేసిన కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరు కాకపోవడం చాలా ఊహాగానాలకు దారి తీసింది. వాస్తవంగా ఆయన వెళ్లాలని బయలుదేరితే కొంతమంది బలవంతంగా అడ్డుకున్నారా? అలా అడ్డుకోవడం వల్లనే ఆయన హాజరుకాలేదంటున్నారు. అద్వాని సన్నిహిత అనుచరుడైన విశ్వాంబర్ శ్రీవాత్సవ. అద్వానీకే సాత్ 32 సాల్ ( అద్వానీతో ముప్పైరెండేళ్లు) అన్న పేరిట విడుదలైన ఆయన పుస్తకం సభ సందర్భంలో ఈ విషయం చెప్పారు. జగడాల మారి సుబ్రమణ్యస్వామి, మోడి వ్యతిరేక సిద్ధాంతకర్త కెఎన్ గోవిందాచార్య ఢిల్లీలో ఈ పుస్తకం విడుదల చేశారు. దీనిపై వివాదం ముందే ఊహించిన అద్వానీ శిబిరం పుస్తకంతో సంబంధం లేదని ప్రకటించింది. ఆయనతో నిమిత్తం లేకుండా ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా శ్రీవాత్సవ పుస్తకం రాశారని ఒక ప్రకటన వెలువడింది. అయితే తన పుస్తకాన్ని అద్వానీ ముందే చూశారని శ్రీవాత్సవ చెబుతున్నారు. ఆయన సూచన మేరకు కొన్ని భాగాలు ఎడిటింగ్ చేశానని కూడా అంటున్నారు. మరి ఇందులో ఏది వాస్తవమో చెప్పాల్సింది వృద్ధ నాయకుడే. దేశంలో అత్యవసర పరిస్థితికి ముందున్న వాతావరణం కనిపిస్తోందని మోడి అధికారం చేపట్టాక అద్వాని వ్యాఖ్యానించడం కూడా సంచలనం రేపింది. ఆయన ఒక్కరే గాక మురళీమనోహర్ జోషి, యశ్వంత్‌సిన్హా వంటివారు కూడా అసంతృప్తి వెలిబుచ్చుతుంటారు. దీన్ని చల్లార్చడానికే ఒక సలహా మండలిని ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. బహిరంగ వేదికల మీద కూడా అద్వాని పెడమొహంగా ఉండడం అందరూ గమనించారు. మరి శ్రీ వాత్సవ ఆయన ఆశీస్సులతోనే ముందుకు వచ్చారా లేక అద్వానీని అడ్డం పెట్టుకుంటున్నారా?. అంటే ఈ ప్రశ్నకు రెండు రకాల సమాధానాలు లభిస్తున్నయి. అద్వానీ పుస్తకం చూడడమే కాక సంతకం కూడా చేశారని శ్రీవాత్సవ ఒక ఫోటో విడుదల చేశారు. అలాంటి వ్యక్తి నుంచి పుస్తకంతో సంబంధం లేదని ప్రకటన రావడం ఆశ్చర్యకరమన్నారు. ఇంతకు 2013 సెప్టెంబర్‌లో మోడి అభ్యర్థిత్వం ఖరారు చేయడానికి సమావేశమైన బిజెపి ప్రముఖులకు ఆయన ఒక లేఖ రాశారు. ఈ సంప్రదింపుల్లో తాను పాల్గొనకపోవడమే మంచిదని భావిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. అంటే ఇతరులు అడ్డుకోవడం నిజం కాదా? లేక పరువు కాపాడుకోవడానికి తర్వాత లేఖ రాశారా? చెప్పాల్సింది ఆయనే కదా!

