ఆప్‌ అపరిపక్వతతో అనర్థం

mann_2942407g
ఢిల్లీలో బిజెపి కాంగ్రెస్‌లను మట్టి కరిపించి ప్రజాదరణతో ప్రభంజనం సృష్టించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం కూడా అస్తవ్యస్తమైన స్వయంకృతాలతో ఆభిశంసనలు కొనితెచ్చుకుంటున్నారు. తొలిదశలో కొన్ని మంచి పనులు చేసినా నాయకుల తీరుతెన్నులు, అధికార నిర్వహణ అన్నిటిలోనూ విమర్శలు మోస్తున్నారు. వ్యర్థ వివాదాలకు కారకులవుతున్నారు. పలువురు ఎంఎల్‌ఎలు కేసుల్లో చిక్కారు. స్వయానా ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ చిన్న చితక వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఎంఎల్‌ఎలందరినీ పార్లమెంటరీ కార్యదర్శులుగా చేసేందుకు తెచ్చిన ఆర్డినెన్సు విషయంలో అవస్థలనెదుర్కొన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వారిపై కత్తికట్టిన మాట నిజమే గాని ఆప్‌ అపరిపక్వ రాజకీయాలు అరాటాలు కూడా అనర్థాలకు కారణమవుతున్నాయి. తన వ్యక్తిగత ప్రతిష్టను అతిగా అంచనా వేసుకుంటున్న కేజ్రీవాల్‌ శరవేగంగా జాతీయ నేతను కావాలని హడావుడి పడి అనవసరమైన అడ్వర్టయిజ్‌మెంట్లపై కోట్లు తగలేస్తున్నారు. కార్మికుల సమస్యలు పౌర సదుపాయాలపైనా ఉపేక్ష వహిస్తున్నారు. ఢిల్లీ తర్వాత నాలుగు పార్లమెంటు స్థానాలిచ్చిన పంజాబ్‌, గోవా, గుజరాత్‌ వారికి ముఖ్యమైనవి. ఈ మధ్యనే నవజ్యోతిసింగ్‌సిద్దూ చేరతాడన్న వార్త కూడా వారికి వూపు నిచ్చింది.ఇలాటి తరుణంలో ఆ పార్టీ ఎంపి భగవంత్‌ మాన్‌ పార్లమెంటు ప్రవేశాన్ని జీరో అవర్‌లో ప్రశ్నల ఎంపికను విడియో తీసి ప్రత్యక్ష వ్యాఖ్యానంతో ఫేస్‌బుక్‌లో పెట్టడం నిబంధనల ఉల్లంఘనే గాక భద్రతా ప్రమాణాలకు కూడా ముప్పు. గతంలోనే దాడికి గురైన పార్లమెంటు భవనం అంతర్గత విషయాలు గనక విడియోలకు ఎక్కితే దుష్టశక్తులకు ఉపయోగపడతాయి. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా సమర్థించుకోవడం పార్టీ ప్రతినిధి అసుతోష్‌ కూడా మొదట వంతపాడడం అర్థరహితం.ఈ దుస్సాహసాన్ని అన్ని పార్టీలూ ఖండించాయి. స్పికర్‌ సుమిత్రా మహాజన్‌ ముందు హాజరైన మాన్‌ తర్వాత సభలో అయిష్టంగానే క్షమాపణ చెప్పారు గాని సమస్య అంతటితో సమిసిసోదని ఆమె ప్రకటించారు. సిద్దూ బిజెపికి రాజీనామా చేయడం వల్ల కలిగిన రాజకీయ ప్రబావాన్ని మాన్‌ చర్య పూర్తిగా తుడిచిపెట్టేసింది.ఆప్‌ నేతలు బాధ్యతా రహితంగా వుంటారని ప్రచారం చేసే అవకాశం బిజెపికి లభించింది. అయితే ఆయన ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన తర్వాత రెండు రోజులకు గాని పార్లమెంటు వర్గాలు, నిఘా విభాగాలు ఈ అంశాన్ని గుర్తించలేకపోవడం కూడా ఆశ్యర్యమే.ఆంధ్ర ప్రదేశ్‌ ప్రత్యేకహౌదా విషయం దాటవేయడానికి దీన్ని వాడుకోవడం మరో విపరీతం. ఏమైనా ఇలాటి అవాంఛనీయ ధోరణులు ఆప్‌కు నష్టం చేయడమే గాక బిజెపినెత్తిన పాలుపోస్తాయి.సహజంగానే కేంద్రం వీటిపై వివాదాన్ని అంత తేలిగ్గా సమసిపోనివ్వదు. నిజంగానే లోతుగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలి కూడా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *