రజనీ రహస్యాలు రెండు…

kabali-facebook_917465b8-4cd9-11e6-a5f1-138dd21979a8
కబాలి కథ అర్థమైన మేరకు గొప్ప కొత్తదనం లేదని తేలిపోయింది. నిజానికి ఈ విషయం విమర్శకులకన్నా ప్రేక్షకులకే ఎక్కువగా తెలుసు.అయినా సరే బాహుబలితో సహా గత రికార్డులన్నీ తిరగరాసేంత ఆదాయం ఎలా వస్తున్నది? రజనీ మానియా గురించి దేశంలో ప్రపంచంలో కూడా ఇన్ని కథలు ఎందుకు వస్తున్నాయి? మరి అదే రేంజిలో వుండాల్సిన తెలుగు అగ్రహీరోలు ఎందుకు అభద్రతతో అల్లాడుతున్నారు? ఆలోచించాల్సిన అవసరముంది. ఈ రోజు సాక్షి పత్రిక జీవనకాలమ్‌లో నట రచయిత గొల్లపూడి మారుతీ రావు రాసింది చదివితే కొంత సమాధానం లభిస్తుంది.
దానికన్నా ముందు అక్కినేని నాగేశ్వర రావు, ఎన్టీఆర్‌ల గురించిన ఒక అనుభవం చెబుతాను. ఒకసారి హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కార్యమ్రంలో అక్కినేని ముఖ్యఅతిధి కాగా నేను అద్యక్షత వహించాల్సి వుంది. దానికన్నా ముందు బయిటకూచున్నాము. ఆ సమయంలో పాత సినిమాల కబుర్లు చెబుతున్నారు. తను క్లాస్‌ హీరోకాగా ఎన్టీఆర్‌ మాస్‌ హీరో అంటూ ఆయన ‘ సినిమా హాలు దగ్గరకెళితే తెలిసిపోయేదండీ…అక్కడ కార్లు స్కూటర్లు వుంటే ఇక్కడంతారిక్షాలు సైకిళ్లు కనిపించేవి’ అన్నారు. గొల్లపూడి వ్యాఖ్యలోనూ అక్కినేని తన పరిమితులు తెలుసుకుని మసులుకున్నారని చెప్పారు. సినీ మోఘల్‌ రామానాయుడు కూడా అమితాబ్‌ లాంటి హీరోలు సన్నివేశానికి అవసరమైతే తామే వెళ్లి మట్టిపూసుకుని వస్తారని మన హీరోలు ఫ్యాన్స్‌ బాధపడతారని ఆలోచిస్తారని ఒక సమావేశంలో చెప్పడం నేను విన్నాను.
నిజజీవితానికి సినీ జీవితానికి మద్యన వున్న తేడాను అర్థం చేసుకుని అభిమానుల ఆత్మీయత చూరగొనడమే రజనీ వంటి వారి మొదటి రహస్యం. గొల్లపూడి రాసినట్టు ఆయన నిజజీవితంలో మూమూలు మధ్యతరగతి నడిమి వయస్కుడిలా వుండటానికి ఏ మాత్రం సంకోచించరు. సినిమాల్లోనూ స్టైల్‌ కొట్టినప్పుడు కేవలం ఇది నటనేనని తెలిసేట్టు వ్యవహరిస్తారు తప్ప పుట్టుకతోనే అలా వున్నట్టు అనిపించనివ్వరు. అంటే మన వాడే నటిస్తున్నాడని అనుకోవాలన్నమాట. ఎన్టీఆర్‌ కూడా ఈ జాగ్రత్త తీసుకునేవారంటారు. అక్కినేని నటించిన పాత్ర ఫెయిలవొచ్చు గాని నటుడుగా ఆయన ఫెయిలవడు. ఎన్టీఆర్‌ నటుడుగా ఫెయిలవొచ్చు గాని ఆయన పాత్ర ఫెయిలవదు అని ఒకసారి కొడవటిగంటి కుటుంబరావు వారిద్దరి నటనల మధ్య తేడాను విశ్లేషించారు. ఇదే తేడా బహుశా కమల్‌ హాసన్‌ రజనీకాంత్‌ల మధ్య వుండని చెప్పొచ్చు. అంటే ఆయన వాస్తవికంగా వుంటారని కాదు, అవాస్తవంగా వున్నానని తెలిసేట్టు చేస్తారు. ఇదే జనానికి నచ్చుతుంది.
రెండో రహస్యం విపరీతమైన మార్కెటింగ్‌. మూడేళ్ల పాటు నిర్మాణం చేసుకున్న బాహుబలి విషయంలోనూ మార్కెటింగ్‌ పాత్ర చాలా వుంది. రజనీ కాంత్‌ దాన్నిమించిపోయి అటు ప్రచారం ఇటు వ్యాపారం కూడా చేసుకోగల వ్యవస్థ సృష్టించుకున్నారు. గత రెండు చిత్రాలు దెబ్బతిన్నా మళ్లీ ఆ వ్యవస్థ రంగం మీదకు వచ్చేసి ఇమేజిని కాపాడుతుంది. హీరోలే బిక్కుబిక్కుమంటూ తీస్తే మార్కెట్‌ శక్తులు మరింత జంకుతాయి. కనకనే కబాలి విడుదలకు ముందే ఇంత హడావుడి. ఒక గొప్ప విజయంలో తామూ పాలుపంచుకోవాలనే కాంక్ష ప్రేక్షకులలో వుంటుంది. రాజమౌలి దాన్ని బాగా ఉపయోగించుకోగలిగాడు గనకే ఆయన చిత్రంలో నటుల రేంజిని మించి ప్రభంజనం సృష్టించారు. రజనీకి అలవాటైన విద్య గనక ఆయన రేంజి అత్యధికం గనక దాన్ని దాటేయగలిగారు.
ఈ సినిమా కోసం విమానాల మీద కూడా పబ్లిసిటీ చేయడం విదేశాల్లో గతం కన్నా ఎక్కువ క్రేజీ తీసుకురావడం అంతర్జాతీయ సినీ మార్కెట్‌ సూత్రాల అములులో భాగమే. కొన్ని కంపెనీలు సెలవులు ఇచ్చాయంటే అది కూడా మార్కెట్‌ మంత్రజాలమే. ఫైవ్‌స్టార్‌ హౌటళ్లలో వేస్తామని ప్రతిపాదించి విరమించుకోవడం కూడా ప్రచారానికి పనికివచ్చేదే. ఇంత జరిగాక సినిమా ఓపెనింగ్స్‌తోనే అద్బుతం జరిగి పోతుంది. ఆ తర్వాత ఆడినా ఆడకపోయినా ఫికరుండరు. మొదటివారమే కలెక్షన్లు వూచ్చేస్తుంది. కావాలంటే ప్రయత్నించండి- టికెట్టు అయిపోయివుంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *