ఫిలిం సిటీపై మా చర్చలో కెసిఆర్ ఏమన్నారు?
ఓం సిటీ భూముల గురించిన పోస్టు చదివాక చాలామంది గత విషయాలు ప్రస్తావించారు. ఫిలిం సిటీలో భూమిని దున్నిస్తానని ప్రస్తుత ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యమ కాలంలో అన్నారా లేదా అనేది పెద్ద వివాదంగా వుంది. తాను అలా అన్నానని నిరూపించాలని ఆయన సవాలు చేశారు కూడా. పదాలు ఏమైనా సరే ఒక టీవీ షోలో ఆయన ఇలాటి వ్యాఖ్యలు ఆయన చేసినప్పుడు నేను పాల్గొన్నాను. అది కెసిఆర్ భూముల కోసం పోరాటం చేపట్టిన కాలం. టీవీ9లో రజనీ కాంత్ నేను చర్చిస్తుండగా కెసిఆర్ ఫోన్‌లైన్‌లో వచ్చారు. అప్పట్లో ఆయన ఉద్యమం వేడిని కాపాడేందుకు అలా జోక్యం చేసుకోవడమే గాక చాలాసేపు ఓపిగ్గా మాట్లాడేవారు. బాగో జాగో అన్న నినాదం వంటివి మంచిది కాదని నేనన్నాను. అయితే మీరు వామపక్ష యోధులుగా భూ స్వాధీన ఉద్యమాన్ని బలపర్చాలని కెసిఆర్ అన్నారు. గతంలో వైఎస్ హయాంలో కమ్యూనిస్టుల భూపోరాటం జరిగినప్పుడు మీరు బలపర్చలేదు కదా అని నేను ప్రశ్నించాను. ముదిగొండ కాల్పుల తర్వాత మృతుల పరామర్శకు వెళ్లిన మొదటి నాయకుణ్ని తానేననిసీనియర్ జర్నలిస్టు మీకు తెలియకపోతే ఎలా అని ఆయన విమర్శ చేశారు.నిజానికి నా ఉద్దేశం అంతకు ముందు పరిస్థితి అయినా ఆయన ముదిగొండ వెళ్లిన మాట నిజమేగనక వాదించలేదు. సరే ఇంతలో రజనీ కాంత్ అయితే రామోజీ ఫిలిం సిటీ భూమిపై కూడా ఆరోపణలున్నాయి కదా దాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని పోరాడతారా అని ఆయన అడిగారు. అక్కడ నిజంగా కబ్బా జరిగినట్టు నిరూపించే మొనగాడుంటే తప్పక చేస్తామని తనదైన శైలిలో కెసిఆర్ ఫోన్‌లోనే ప్రకటించారు. ఒకటికి రెండు సార్లు ఆయన ఇదే మాట అంటుంటే నేను దానిగురించి అడగలేదండీ అని చెప్పబోయాను. నేను మీతో మాట్లాడ్డం లేదు ఎందుకు ఉలిక్కిపడతారని ఆయన కాస్త అసహనంగా అన్నారు. ఫిలిం సిటీపై ఆరోపణలు నిరూపిస్తే తాను రంగంలోకి దిగుతానన్నట్టు స్పష్టంగా చెప్పారు. వాస్తవంగా జరిగింది ఇది. తర్వాత కూడా ఇలాటి తరహాలోనే వ్యాఖ్యలు చేశారు. అయితే ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం ఆ తరహా విచారణలు పరిశీలనలు పెట్టుకున్నట్టు లేదు. ఫిలింసిటీ సందర్శించడమే గాక అక్కడ దాదాపు ఒక పూట గడిపి ప్రశంసలు కురిపించి వచ్చారు. ఫిలింసిటీ నగరానికి ఆభరణమన్నట్టు మాట్టాడారు. గొప్ప వ్యవస్థ గనక పొగడొచ్చు గాని అంతకు ముందు మాట్లాడిన వాటిని నిజానిజాలు నిర్ధారించవలసింది ఎవరు? ఏవైనా చిన్న చిన్న సమస్యలుంటే ప్రభుత్వమే సర్దుబాటు చేస్తుందని కూడా హామీ నిచ్చారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్ల వారి వార్తల ప్రచురణ పట్ల ఈనాడు సంస్తల వైఖరి కూడా కనిపిస్తూనే వుంది. కనుక 3000 ఎకరాలు ఓం నమశ్శివాయ అనుకోవచ్చు.
