ఎదురు షరతులతో సింగపూర్‌ ఛాలెంజి

asb-logoSembcorp-Industries-Logo-e1448608416823
అమరావతిలో సీడ్‌ క్యాపిటల్‌ నిర్మాణాన్ని సింగపూర్‌ కంపెనీ అసెండాస్‌ సింగ్‌బ్రిడ్జి-సెంబ్‌కార్ప్‌కు కట్టబెట్టేందుకు జరుగుతున్న స్విస్‌ చాలెంజి తతంగం మొత్తం తలకిందులుగా నడుస్తున్నది. అక్కడ వచ్చిన కన్సార్టియం చేస్తున్న ఛాలెంజి ఏమీ లేకపోగా వారి షరతులు గొంతెమ్మ కోర్కెలు నెరవేర్చడం ప్రభుత్వానికే ఛాలెంజి. వాస్తవంగా వారి ప్రతిపాదనలో కొన్ని విషయాలే బయిటపెట్టి కీలకమైనవి దాచిపెట్టి మిగిలినవారిని పోటీ పడమనడం వ్యాపార సూత్రాలకూ న్యాయసూత్రాలకు కూడా విరుద్ధం.మొదటి పోటీదారు ఆమోదించిన వివరాలన్నీ బయిటపెట్టి వాటిని మించి చేయడానికి సిద్ధంగా వున్న ఇతరులను తమ ప్రతిపాదనలతో రమ్మని ఆహ్వానించాలని సుప్రీం కోర్టు నిర్దేశించింది. కాని ఇక్కడ మొదటి సంస్థ కమిట్‌మెంట్లన్నీ గుట్టుగా అట్టిపెట్టి ఇతరులను చెప్పమంటున్నారు. తీరా ఇతరులు కోట్‌ చేసిన తర్వాత అవి లీక్‌ కావనే గ్యారంటీ లేదు. ఎందుకంటే మొదటివారి వివరాలు తెలియవు గనక అంతకన్నా కాస్తతగ్గించి తర్వాత బయిటపెట్టవచ్చు. పారదర్శకత లేనప్పుడు అలాటి అవకతవకలకు చాలా అవకాశం వుంటుంది వారు ఎంత పెట్టుబడిపెడతారో ఎప్పటిలోగా తీసుకొస్తారో తెలియదు. ఆదాయంలో వారి వాటా ఎంతో తెలియదు. పోటీకి సంబంధించిన కీలక అంశాలన్నీ ఖాళీలు పెట్టి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఉదాహరణకు వారికి 1690 ఎకరాల భూమి అప్పగించడమే గాక 5,500 కోట్ల ఖర్చుతో ఇన్‌ఫ్రా సదుపాయాలు కల్పించాలి. ఆ భూమి మొత్తం అమ్ముడయ్యే వరకు ఇతర చోట్ల అభివృద్ది చేసి అమ్మకూడదు.అనుకున్న ప్రకారం సీడ్‌ కాపిటల్‌ ప్రాంతంలో నివాసాల నుంచి శ్మశానాల వరకూ తొలగించి వారికి హస్తగతం చేయాలి.ఒకవేళ అనుకున్న ప్రకారం అమ్ముడై లాభాలు రాకపోతే బైబ్యాక్‌ పద్ధతిలో ప్రభుత్వమే తీసుకోవాలి. ఒప్పందంలో నిబంధనల గడువు నాటికి ఆ వసతులు కల్పించలేకపోతే ఎదురు నష్టపరిహారం ఇవ్వాలి.ఇవీ ఇలాటివి అనేక ఏకపక్ష షరతులు నోటిఫికేషన్‌లో వున్నాయి. అసలు స్విస్‌ చాలెంజి విధానమే తప్పని కేంద్ర ప్రభుత్వం నియమించిన కేల్కర్‌కమిటీ చెప్పింది. ఏవో అసాధారణ నిర్మాణాలకు మాత్రమే దాన్ని వినియోగిస్తారు. కాని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్విస్‌ చాలెంజి సూత్రాలను కూడా సరిగ్గా పాటించడం లేదు. .
ఈ విమర్శలన్నీ మీడియాలో వచ్చాక ప్రభుత్వం నష్టనివారణ(డామేజీ కంట్రోలు) మొదలు పెట్టింది. అగ్రశ్రేణిపత్రిక ఒకటి అసలు సీడ్‌ కాపిటల్‌ ఎందుకు ముఖ్యమో ప్రత్యేక కథనం ప్రచురించింది. ఒక్క అక్షరమైనా విమర్శనాత్మకంగా లేకపోగా ఇది ప్రాణవాయువు గనక కఠినషరతులు వుండొచ్చని వంతపాడే విధంగా రాసింది. అయితే ఈ ఛాలెంజిలు ప్రజల జీవితాలను మారుస్తాయి గనక ఖజానాకు భారాలు గనక రేపు రాజధాని నిర్మాణానికి గుడిబండలు గనక వివరాలు ముందే బయిటపెట్టాలని వెంటపడాల్సిందే. ఈలోగా సచివాలయ నిర్మాణంలో మరో ప్రాణం సామగ్రి రవాణాలో బలైపోయింది. కాని భద్రతా లోపాలు ఏలిన వారు గుర్తించడం లేదు. పైగా ఎదురుదాడిలోనే తలమునకలవుతున్నారు.డబ్బూ పోయి శనీ పట్టె నన్నట్టు భూమి ఇచ్చి వేల కోట్లతో సదుపాయాలు చేసి పెత్తనంకూడా వారికే ఇవ్వడం చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *