రియల్ కంపెనీల దూతగా క్రిడా?

అమరావతిలో భూసమీకరణకు సహకరించిన రైతులకు . ఎట్టకేలకు ఆలస్యంగా నేలపాడులో ప్లాట్ట కేటాయింపు క్రిడా ప్రారంభించింది. అయితే ఈ భూములు మీరు డెవలప్ చేసుకోలేరు గనక పెద్ద కంపెనీలకు ఇవ్వడమే లాభం అని ఒప్పించే పని క్రిడా తన మీద వేసుకుంది. ఈ విషయంలో మెకన్సీ కంపెనీ ప్రతిపాదన మేరకు అభివృద్ది చేసిన ప్రాంతంలో రైతులకు 25శాతం, డెవలపర్లకు 75 శాతం దక్కే విధంగా వుంటుంది. అంటే ప్రతి ఎకరాకు 630 చదరపు అడుగులు స్థలం రైతులు వదులుకోవలసి వుంటుంది. మొత్తంగా చూస్తే పూలింగు ఏరియాలో రైతుల వాటా కింద వచ్చే 14,400 ఎకరాలలోనూ 90,72,000 చదరపు అడుగుల స్థలాన్ని బిల్డర్లకు అప్పగించాల్సి వుంటుంది. దీనిపై రైతు ప్రతినిధులు ఆందోళనలు ఆక్షేపణలు తెల్పినా క్రిడా అధికారులు సర్ది చెప్పి సరిపెట్టే ప్రయత్నంలో వున్నారు. రాజధాని ప్రాంతంలో భూముల ధరల పెరుగుదల వల్ల లాభం రైతులకే దక్కాలన్నది తన మనోభీష్టమని ముఖ్యమంత్రి నిరంతరం చెబుతూ వచ్చారు. .అయితే ఇప్పుడు క్రిడా నిర్వాకం చూస్తే ఆ సహాయం రియల్ ఎస్టేట్ కంపెనీల ద్వారా చేస్తామంటున్నారు! రైతులు తాముగా నిర్మాణాలు చేసుకుంటామంటే పెట్టిన నిబంధనలకన్నా బిల్డర్లకు ఉదారంగా ఎక్కువ విస్తీర్ణానాకి అనుమతి లభిస్తుంది. ఆ విధంగా వారు పెద్ద ఎత్తున రంగ ప్రవేశం చేస్తే స్థానికులు వ్యక్తిగతంగా కట్టుకునే పరిస్థితే వుండదు. ఈ 14 వేల ఎకరాలు ఇంచుమించుగా రియల్ కంపెనీలకే అప్పగించవలసి వస్తే నిజంగా కలిగే లాభం తగ్గిపోతుంది. ఇప్పుడు అక్కడున్న ధరల ప్రకారం భూములు అమ్ముకుంటే వచ్చే దానికన్నా ప్రస్తుత నిబందనల ప్రకారం డెవలప్‌మెంట్‌కివ్వడం వల్ల దక్కేది తక్కువగానే వుంటుంది. పైగా కట్టేకంపెనీలకే అదనంగా 900 ఫ్టాట్ట వరకూ దక్కుతాయి. ఇదంతా వ్యాపారులకు తప్ప భూములిచ్చినవారికి అదనంగా చేసే మేలు వుండదు. పైగా ఈ వలయంలో చిక్కుకున్న రైతులు వారిచుట్టూ తిరుగుతూ నిస్సహాయతలో పడిపోతారు. వారు పూర్తిచేసిఇచ్చే వరకూ వేచి వుండలేక మీరే ఎంతో కొంతకు తీసుకోండనే పరిస్థితి వస్తుంది. స్తోమత వున్న ఆసాములు ఎలాగూ ఆపనే చేస్తారు గనక పేద మధ్య తరగతి రైతులకు ప్రాణసంకటమవుతుంది. వుంటుంది.మామూలుగా అయితే పదేళ్ల పాటు ప్రభుత్వం కౌలు ఇవ్వాల్సి వుండింది. కాని నామకార్థంగా ప్టాట్టు కేటాయించడంతో ఆ బాధ్యత కూడా చేతులు దులిపేసుకుంది. రేపు బిల్డర్ల రూపంలో వచ్చేది కూడా పాలక పక్ష పెద్దలేనని అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పటికే వారి తరపు మనుషులు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. అంతిమంగా వారికి లాభాల వర్షం కురుస్తుంది. భూములిచ్చిన వారికి స్వల్ప లాభమే మిగులుతుంది! ఇందుకు సంబంధించిన చాలా వివరాలు లెక్కలు కూడా అందుబాటులో వున్నాయి.అవి మరోసారి చూద్దాం.