అవకాశవాదాలతో కాశ్మీర్ అగ్నికి ఆజ్యం

జమ్మూ కాశ్మీర్లో మరోసారి రగిలిన జ్వాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవకాశవాద రాజకీయాల పర్యవసానాలను పట్టిచూపించే పరిణామం. హిజబుల్ తీవ్రవాది బుర్హన్ వానిని ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా ఈ పరిస్థితి ఏర్పడినట్టు కనిపిస్తున్నా అది ఆఖరి కారణం మాత్రమే. ఏళ్లతరబడి పేరుకుపోయిన అసంతృప్తి, ఆశాభంగం అశాంతి అంతకన్నా ముఖ్యంగా పనిచేస్తున్నాయని ప్రతివారికీ తెలుసు. గతంలో శాంతిగా వుంటాయని పేరొందిన చోట్ల కూడా ఇప్పుడు కల్లోలం రేగిందంటే కారణాలు లోతుగా వున్నాయని అంగీకరించకతప్పదు. కాశ్మీర్‌ను కాపాడే సత్తా సరైన విధానం తమకే వున్నాయని చెప్పుకునే బిజెపి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా అధికారం చేస్తున్నప్పుడు ఒక్కసారిగా పరిస్థితి ఇంత దిగజారడం ఆ గొప్పల పస ఏమిటో తెలియజేస్తూనే వుంది. ప్రతిపక్షంలో వున్నప్పుడు తీవ్రవాద స్వరం వినిపించి అధికారం కోసం ఒక్కసారిగా అన్ని వదలి బిజెపితో సర్దుబాటు చేసుకున్న పిడిపి నేత మొహబూబా మఫ్తి అధికారం చేపట్టాక మొదటి సవాలుకే చతికిల పడటం దాచేస్తే దాగనిసత్యంగా గోచరిస్తున్నది. అసలు బిజెపి పిడిపి కలయికే ఒక వైరుధ్యాల పుట్ట. కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని మించిన హక్కు కావాలనే పిడిపి అసలు దాన్ని కల్పించే 370 వ అధికరణాన్నే రద్దు చేయాలనే బిజెపి కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఒక వింత. అఫ్జల్ గురు పేరెత్తడమే నేరమైనట్టు విద్యార్థులను వేటాడింది బిజెపి కేంద్రమైతే ఆ గురునే గురువులా ఆకాశానికెత్తింది పిడిపి. ఈ ఇద్దరి కలయిక దేశ రాజకీయాల్లోనే అత్యంత విడ్డూరమైన ఒక అధికార అమరిక. ఇక కాశ్మీర్ నేపథ్యంలో ఇది మరింత తీవ్ర ప్రభావం చూపిస్తుందని ముందునుంచి అనుకుంటున్నదే. కాగా మొదట ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన ముఫ్తి మహ్మద్ సయ్యద్ మరణించితే మూడు మాసాలు పాటు మరో ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా మంతనాలతో మల్లగుల్లాలు పడిన కథ ఇటీవలదే. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లలో పరిస్థితులు దిగజారుతుంటే అంతర్జాతీయంగానూ ఐఎస్ఐఎస్ ప్రమాదం పెరుగుతుంటే కాశ్మీర్‌ను నెలల తరబడి తల లేకుండా వదలివేసిన బాధ్యతా రాహిత్యానికి ఉభయులూ కారకులే.ఇలాటి పోకడలే అక్కడ తాజాగా తీవ్రవాదం వేళ్లూనుకోడానికి కారణమైనాయి.
కేంద్ర నిర్వాకాలతోనే ముప్పు
చరిత్రను పరికిస్తే ఎప్పుడెప్పుడు ఢిల్లీ పాలకులు అవకాశవాదానికి పాల్పడ్డారో అప్పుడంతా అక్కడ పరిస్థితి దిగజారుతూ వచ్చింది. పాకిస్తాన్ దురాక్రమణ సైన్యాలను ఎదుర్కొని భారత దేశంతో నిలిచిన షేక్ అబ్దుల్లాను కాంగ్రెస్ ఒకటికి రెండుసార్లు అరెస్టు చేసి అస్థిరతకు బీజాలు వేసింది. 370 వ అధికరణాన్ని క్రమేణా తూట్లు పొడుస్తూ ప్రజల విశ్వాసాన్నిదెబ్బతీసింది. షేక్ అబ్దుల్లాను ఆఖరుకు విడుదల చేసినామళ్లీ ఆయన కుమారుడు ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని కూలదోసి కీలుబొమ్మ షాను గద్దెక్కించడం మొదటిసారిగా మనం చూస్తున్న తరహా తీవ్రవాదానికి బాటవేసింది. పాక్ చొరబాట్లకు ద్వారాలు తెరిచింది. అయినా తన అధికారం తప్ప అన్యథా ఆలోచన లేని కేంద్ర కాంగ్రెస్ కాశ్మీర్ కల్లోలానికి ఆజ్యం పోస్తూనేవచ్చింది.ఆ తర్వాత వచ్చిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం కూడా వివాదాస్పదమైన జగ్మోహన్ను కాశ్మీర్ గవర్నర్‌గా పంపించి ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వ రాజీనామాకు కారణమైంది.అప్పుడు కేంద్ర హొం మంత్రిగా వున్న ముఫ్తి పెద్దకుమార్తె (ప్రస్తుత ముఖ్యమంత్రి సోదరి) అపహరణనుంచి విముక్తి కోసం ఉగ్రవాదులను విడుదల చేయడం ఒక లొంగుబాటుగా మిగిలిపోయింది.ఇలా ఆయా దశల్లో అనాలోచితంగా అస్తవ్యస్తంగా వ్యవహరించిన కేంద్ర పాలకులు ఈ కాలమంతా కూడా అక్కడ సైనిక దళాలను అర్థ సైనిక బలగాలను పెద్ద సంఖ్యలో కొనసాగించడమే గాక వారి అత్యాచారాలను మితిమీరిన నిర్బంధాన్ని కూడా రివాజుగా మార్చారు. తొంభయ్యవ దశకంలో ఇది పరాకాష్టకు చేరింది. మిగిలిన దేశంలో బిజెపి పెరుగుదలతో మత విభజన మరింత పెరిగింది. మొత్తందేశంలోముస్లింలు మెజార్టిగా వున్న ఒకే ఒక రాష్ట్రం అండులోనూ పక్కనే పాకిస్తాన్ కుట్రలు వీటితో కాశ్మీర్ ఒక అగ్నిగుండంగా మారింది.ఎన్నికల నిర్వహించడమే సవాలుగా మారింది. అప్పుడప్పుడు ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు వచ్చినా ఆర్థికంగానూ సైనికంగానూ కేంద్రంపైనే ఆధారపడవలసిన పరిస్థితి. అందుకే ఢిల్లీలో ఎన్‌డిఎ యుపిఎ ఏది వున్నా నేషనల్ కాన్ఫరెన్స్ దాంట్లో భాగస్వామిగా వుండే పరిస్థితి. దేశభద్రత గురించి గంభీరోక్తులు పలికే బిజెపి నాయకత్వంలోని వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలోనే కార్గిల్ చొరబాటు తర్వాత సంఘర్షణకు దారితీసింది. . వాజ్‌పేయి మొదట చేసిన ప్రకటనలు కాస్త విశ్వాసం కలిగించినట్టు చెప్పినా తర్వాత అనుసరించిన విధానాలు స్థానిక ప్రజానీకాన్ని మరింత దూరం చేశాయి. ఉగ్రవాదం పెరుగుదలకే వూతమిచ్చాయి. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలోనూ ఉపశమన చర్యల గురించి చాలా చెప్పినా జరిగింది పూజ్యం. 2010లో ఇంతకంటే తీవ్రమైన కల్లోలాన్ని కావ్మీర్ చూసింది
వైరుధ్యాల పుట్ట
నేషనల్ కాన్పరెన్స్ స్థానాన్ని అక్రమించడం కోసం పిడిపి ఒక విధంగా తీవ్రవాదం వైపు ఆకర్షితులైన యువతకు అనుకూలమైన నినాదాలిచ్చింది. మెహబూబా స్వయంగా అందుకు ఆధ్వర్యం వహించారన్నది కాదనలేని నిజం.ఈ కృషిలో కొంతవరకూ కృతకృత్యమైన కారణంగానే ఒకసారి కాంగ్రెస్‌తో మరోసారి బిజెపితో కలసి అధికారం చేపట్టగలిగారు. కాన్ఫరెన్స్ రాజకీయ దివాళా కాంగ్రెస్ సంక్షోభం మరోసారి పిడిపికి కాస్త ఆధిక్యత ఇచ్చినా జమ్మూలో బిజెపి అధిక స్థానాలు సాధించడం క్లిష్టమైన సవాలుగా మారింది. కాశ్మీర్ అనగానే అక్కడి నుంచి పండితులను తరిమేశారని చెప్పి రెచ్చగొట్టడం బిజెపి విధానం.అంతేగాని అక్కడ దశాబ్దాల తరబడి నిరుద్యోగంతో సతమతమవుతున్న యువత గురించి గాని ఉపాధిలేని అసంఖ్యాక పేదల గురించి గాని ఆలోచన వుండదు. నిరంతరం సైనిక నిర్బంధం నిషేదాజ్ఞలు ఉగ్రవాద బెదిరింపులు కవ్వింపు ప్రచారాల నుంచి వారిని దూరం చేయాలంటే ఈ సమస్యల పరిష్కారం ముందు జరగాలన్న ఆలోచనే లేకుండా పోయింది. ఈసారి నైపుణ్య శిక్షణ వంటి మాటలు చెప్పినా అవి అమలులోకి రాలేదు. పైగా మోడీ ప్రభుత్వ హయాంలో గోవధ నిషేదం, జెఎన్‌యులో అఫ్జల్‌గురు పేరిట రభస, దాని ప్రభావంతో శ్రీనగర్‌లోని నిట్‌లో చిచ్చు వంటివన్నీ పరిస్థితిని ఇంకా దిగజార్చాయి. పాకిస్తాన్‌తో సంబంధాలలోనూ తీవ్రమైన ఒడుదుడుకులు సంభవించాయి. ఒకవైపున మోడీ నాటకీయ పోకడలూ ఆలింగనాలు మరోపక్క పఠాన్‌కోట దాడి వంటి ఘటనలు సరిహద్దు రాష్ట్రంపై విపరీతమైన ప్రభావం చూపించాయి. పాకిస్తాన్లో విశృంఖలంగా చెలరేగిన తాలిబాన్ తదితర తీవ్రవాద సంస్థల హింసాకాండ, ఐఎస్ఐఎస్ దుశ్చర్యలు ఇవన్నీ అనివార్యంగా అసంతృప్త యువతపై ప్రభావం చూపిస్తాయి.
సైన్యం కాదు- సహాయం అందాలి!
ఆఖరుగా బుర్హన్ వని ఎన్‌కౌంటర్‌తో ఇవన్నీ పరాకాష్టకు చేరాయి. తీవ్రవాద ప్రచారం చర్యలు నిజమే గాని అతను కూడా 22 ఏళ్ల యువకుడే. తన కుటుంబంలోనూ కొందరిని ఈ కాశ్మీర్ కల్లోలంలో పోగొట్టుకున్న వాడు. ఒక విధంగా అక్కడ పరిస్థితికి ప్రతిబింబం లాటి యువజనుడు. అప్పటికే ఘనీభవించిన అసంతృప్తి ప్రజ్వలనకు అతనో సంకేతంగా మారాడు గనకే వేలాది మంది అంత్యక్రియలకు హాజరైనారు. ఇలాటి వరవడి ప్రారంభించింది కూడా పిడిపినే అన్నది గమనార్హం. తన రాజకీయ అవసరాల కోసం మెహబూమా మారిపోవచ్చు గాని ఆ ప్రభావాలను గురైన అసంతృప్త యువత అణచివేతకు గురైన ప్రజానీకం ఎలా శాంతిస్తారు? అది జరగాలంటే వారికి మానవీయ స్పర్శ కావాలి. సహాయం ఓదార్పు లభించాయి. ఉగ్రవాదులను వీరోచితంగా ఎదుర్కొన్న సిపిఎం నేత యూసప్ తరగామి చెప్పినట్టు అక్కడకు వైద్యులు సహాయకులు వెళ్లాలి గాని సైనిక పటాలాలతోనే పరిష్కారం దొరకదు. అయినా తాజా ఘటనల తర్వాత కేంద్రం మొదట సైనిక దళాలతో అణచివేత అన్నదానికే ప్రాధాన్యతనిచ్చింది. ముఖ్యమంత్రి మెహబూబా అయితే ఎలాటి చొరవ చూపించకుండా స్తబ్దుగా వుండిపోయింది.గతంలో ఆమె అనుసరించిన వైఖరి రీత్యా కల్లోలిత ప్రాంతంలోకి వెళ్లి చెప్పగల నైతిక స్థయిర్యం లేకుండా పోయింది. ప్రధాని మోడీ విదేశాల నుంచి వచ్చి ఉన్నత స్థాయి సమావేశం జరిపిన తర్వాత అనివార్యంగా కేంద్రం వాస్తవాలుఅంగీకరించి ఉపశమన చర్యల గురించి మాట్లాడింది. సైనిక దళాలు సంయమనం పాటించాలని మోడీ చెప్పాల్సి వచ్చింది. అదే సమయంలో తీవ్రవాదులకు అమిత ప్రచారం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మెహబూబా ఇప్పటికీ రాజకీయ స్పష్టత లేకుండా ఇరువైపులా అన్వయించుకోవడానికి వీలుగా మాట్లాడుతూ పాత వైఖరిని రేఖామాత్రంగా కాపాడుకుంటున్నారు.
అంతర్జాతీయ కదలికలు
అఇదే అదునుగా పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మొదటిసారిగా ఐరాస ప్రధాన కార్యదర్శి బంకీ మూన్కూడా ఆందోళన వెలిబుచ్చడం సమస్య ఎంతవరకూ వెళ్లిందో చెప్పే ఉదాహరణ. ఇక అమెరికా మొదటిసారిగా కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని స్పష్టంగా అంగీకరించందంటూ విదేశాంగ శాఖ తెగ సంతోషపడుతున్నది. అమెరికా కూటమిలో జూనియర్ భాగస్వామిగా చేరేందుకు మనం సిద్ధమైనాము గనక వారు ఇలా మాట్లాడుతున్నారు.ఒకప్పుడు అదే అమెరికా అద్యక్షుడు క్లింటన్ కాశ్మీర్ తీవ్రవాదుల మానవ హక్కుల గురించి మాట్లాడ్డం లేఖలు రాయడం మర్చిపోరాదు. రేపైనా వారి ప్రయోజనాల మేరకు మాట్లాడేవారు తప్ప వాస్తవికంగా వుంటారనుకుంటే పొరబాటు.పైగా ఇప్పటికి వారే పాకిస్తాన్‌ను పోషిస్తున్నారు.ఇస్లామిక్ తీవ్రవాదంపై ఉమ్మడిగా పోరాటం చేస్తామని మనం అమెరికాతో కలవడం వారితో పాటు మనకూ శత్రువులను పెంచుతుంది.ఈ ప్రమాదం కాశ్మీర్లో ఎక్కువ హాని కలిగిస్తుంది. కనుక ఇప్పటికైనా ఒక సమగ్ర వ్యూహంతో స్థానిక ప్రజలను కలుపుకొనిపోయే విదంగానూ ఉపాధి కల్పన దిశలోనూ చర్యలు తీసుకోవడం ముఖ్యం. కాశ్మీర్ భారత్‌లో అంతర్బాగమని ఎంత గట్టిగా చెప్పామనేది కాదు, భారత్ మాలో అంతర్బాగమని కాశ్మీరీలు అనుకునేలా చేయడం ముఖ్యం. ప్రధాన పార్టీలు కేంద్రం కూడా గతం నుంచి పాఠాలు నేర్చుకుని అప్రమత్తంగా వ్యవహరిస్తేనే అక్కడ శాంతి నెలకొంటుంది.లేకపోతే నివురు కప్పిన నిప్పులానే మిగిలివుంటుంది.
నవతెలంగాణ, జులై14,2016.