మోడీ సర్కారుకు సుప్రీం లెసన్స్

ఒక ప్రభుత్వం అందులోనూ కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో వరుసగా మొట్టికాయలు వేయించుకోవడం రాజకీయ గుణపాఠమే. నరేంద్ర మోడీ సర్కారుకు పదే పదే అదే అనుభవం తప్పడం లేదు. కొంత కాలం కిందట ఉత్తరాఖండ్‌లో రావత్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఆ క్రమంలో దాని కారణంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా అభిశంసన వ్యాఖ్యలు భరించాల్సి వచ్చింది. నిజానికి ఉత్తరాఖండ్ కన్నా ముందే పెద్ద రాజకీయ చదరంగం అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగింది.నాబాం తుకి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారును ఫిరాయింపులతో కూల్చి కాలికోపాల్ ను ముఖ్యమంత్రిగా ప్రతిష్టించింది కేంద్రం. ఈ విషయంలోనూ సుప్రీం మొదట విమర్శలు చేసింది. అయితే మధ్యంతరంగా దొరికిన అవకాశాన్ని తీసుకుని హడావుడిగా కలికోపాల్‌నుకూచోబెట్టారు. ఈ మొత్తం తతంగంలో గవర్నర్ జెపిరాజ్‌కోవా కీలక పాత్ర వహించారు. 60 మంది వున్న శాసనసభలో 47 బలం గల కాంగ్రెస్ నుంచి 21 మంది ఫిరాయించారు. 26 మంది మిగిలారు, వారిలో 19 మందిపై అప్పటి స్పీకర్ వేటు వేశారు. కాని గవర్నర్ లేని అధికారాలు తీసుకుని దాన్నికొట్టివేయడమే గాక జనవరి 14న జరగాల్సిన శాసనసభను ఏకపక్షంగా డిసెంబర్ 16నే జరిపించి ఫిరాయింపుదార్లకు వత్తాసుగా నిలిచారు.సుప్రీం కోర్టు ఈ చర్యను విమర్శించినా యథాతథస్థితిని పునరుద్ధరించాలని ఆదేశించడంతో రాష్ట్రపతిపాలన తిరిగివచ్చింది. దాన్ని హఠాత్తుగా ఎత్తివేసి కాలికోపాల్‌ను గద్దెక్కించారు. 11 మంది వున్న బిజెపి మరో ఇద్దరు మద్దతు తెలిపారు. ఇక కాంగ్రెస్ కథ అయిపోయిందనే భావించారు. ఈ అనుభవంతోనే సుప్రీంకోర్టు ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతిపాలన హఠాత్తుగా తీసేయబోమని హామీనివ్వాలని కోరింది. ఇక ఇప్పుడు అరుణాచల్ కేసు పూర్తిగా విచారించిన తర్వాత నబాం తుకి ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని ఆదేశించింది. దీన్ని కాంగ్రెస్ గొప్పగా స్వాగతించగా బిఎస్‌పి నాయకురాలు మాయావతి కూడా మోడీ ప్రభుత్వనిర్వాకాన్ని నిశితంగా విమర్శించారు. వెంటనే తనను తిరిగి ఆహ్వానించాలని నబాం తుకి కోరుతుంటే కాలికోపాల్ మాత్రం ససేమిరా దిగాపోనంటున్నారు. తనకు సంఖ్యాబలం వుందని హుంకరిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీర్పును సమీక్షించాలంటే పిటిషన్ వేస్తామంటున్నాయి.అయితే సామాన్యంగా అలాటి పిటిషన్లు తోసిపుచ్చుతుంటారు. అంత చిన్న రాష్ట్రంలో అధికారంకోసం రాజకీయ దుర్నీతికి పాల్పడి అక్షింతలు వేయించుకున్న మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాటి పనులు మానుకుంటే మంచిది.